Monday, November 5, 2018

ధార్మికవరేణ్య

విద్వదాహితాగ్ని... వేదవిద్యానిధి

బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి

దర్శనమ్ చతుర్దశ వార్షికోత్సవంలో ‘ధార్మికవరేణ్య’ బిరుదు ప్రదానం

పల్లకీ సేవ, జీవనసాఫల్య పురస్కారంతో ఘనసత్కారం

నవంబర్12న రవీంద్రభారతిలో వేడుక

గహనమైన వేదరహస్యాలను కథలుగా చెప్పగల వాఙ్మి ఆయన. గంభీరమైన మర్మాలను సరళపదాలలో వివరించగల వేదవేత్త ఆయన. వేలాది శిష్యులను వేదవిదులుగా మారుస్తున్న గురువరేణ్యుడాయన. వేదధర్మ ప్రచారం మాతృవందనంగా సంభావిస్తున్న పవిత్రుడాయన. దుర్లభమైన సోమలతలతో వైదికయజ్ఞాలకు పునఃప్రాణప్రతిష్ఠ చేసిన యాజ్ఞికుడాయన. శ్రౌతకర్మలను సరైన పద్ధతిలో నిర్వహింపజేస్తున్న మార్గదర్శకుడాయన. ప్రాంతీయ వివక్షను పాండిత్యంతో గెలిచిన ధర్మవీరుడాయన. పరోపకార ధర్మానికి పతాక ఆయన. శ్రౌతధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్న విఖ్యాత సోమయాజి. పీఠాధిపతుల సత్కారాలు, బిరుదాలు పొందిన మహోపాధ్యాయుడాయన. అంతెత్తు ఎదిగినా వినయంగా ఒదిగిన వినయభూషణుడాయన. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే నిరుక్తం ఆయన. ఆ వేదవిద్వన్మూర్తియే బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు. వేదవిద్యానిధి, విద్వదాహితాగ్ని, జ్యోతిరప్తోర్యామయాజిగా ప్రసిద్ధులైన ఈ మహానుభావుడికి ‘దర్శనమ్’ చతుర్దశ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో పల్లకీసేవ, ధార్మికవరేణ్య బిరుదు ప్రదానం, జీవనసాఫల్య పురస్కారంతో నవంబర్ 12న సన్మానిస్తోంది. ఈ సందర్భంగా వారి జీవనప్రస్థానంపై ‘దర్శనమ్’ సభక్తికంగా సమర్పిస్తున్న అక్షరార్చన.
నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణలో వైదిక సంప్రదాయ విద్యలు అడుగంటిపోయిన కష్ట కాలంలో కన్నతల్లి పట్టుదలతో, ప్రేరణతో, కృషితో వేదవిద్యను అభ్యసించి, నేటిదాకా తెలంగాణలో విశిష్టస్థానాన్ని అలంకరించిన వేదవిద్యానిధి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు. ‘పట్లూరు సోమయాజి’ అనే పేరుతో ప్రసిద్ధులైన ఈ మహనీయుని జీవితం ఈనాటి వేదవిద్యార్థులకు, శాస్త్ర విద్యార్థులకు ఆదర్శపాత్రం. పట్లూరి సోమయాజి కుటుంబంలోని పూర్వ పురుషులందరూ వేదవిద్యా పారంగతులే. ముత్తాల గంగాధర దీక్షితులు, తాత రామకృష్ణ సోమయాజి, తండ్రి పురుషోత్తమ సోమయాజి అందరూ సంప్రదాయిక వేదవిద్యను అధ్యయనం చేసినవారే. తండ్రి కేవలం వేదంలోనే కాక, మీమాంసా వాస్త్రంలోను, వ్యాకరణ శాస్త్రంలోనూ దిట్ట. ఇలా ఉన్నత విద్వత్కుటుంబంలో 13వ సంతానంగా జన్మించిన మాణిక్య సోమయాజికి శిశుప్రాయంలోనే తండ్రి మరణించారు. తండ్రి మరణంతో కలిగిన లోటును తీర్చడానికి తల్లి జనాబాయి కంకణం కట్టుకున్నది. భర్త మరణం మానసికంగా తనను కుంగదీసినా, ధైర్యాన్ని విడువక, తనయులను సంప్రదాయ వేదవిద్యలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించింది. అప్పటికి తెలంగాణలో వేదాధ్యాపనం చేయించే గురువులు స్వల్పంగా ఉండడం, సామాజిక వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని గమనించి, ఎంతో శ్రమకోర్చి మాణిక్యసోమయాజిని, ఆయన అన్న నరసింహశాస్త్రిని గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా చవటపాపయ్యపాలెం అగ్రహారంలోని వేద గురుకులానికి చేర్చింది. అక్కడ ఆమెకు ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. నిజాం ప్రాంతం వారికి ప్రవేశం లేదనే నిషేధోక్తులు శూలాలై గుచ్చినా వెరువక పట్టుదలతో వేదనిధులను ఒప్పించి, తన తనయులకు వేదవిద్యాభ్యాసానికి ప్రచోదనం చేసింది. ఆమెకు వేదవిద్యపట్ల గల ఆసక్తిని, శ్రద్ధను గమనించి ఆనాటి వేద గురువులు ఇద్దరు వేద పిల్లలకు వేదపాఠశాలలో ప్రవేశం కల్పించారు. అక్కడే సంహిత వరకు అధ్యయనం కొనసాగింది. ఇంతలో అకస్మాత్తుగా అక్క అనారోగ్యంతో తనువు చాలించడం వల్ల చదువుకు అంతరాయం కలిగింది. అయినా సంయమనంతో తల్లి తన పిల్లలను బాపట్లలోని గొల్లపూడి మధుసూదన అవధాని దగ్గర మిగిలిన వేద భాగాన్ని పూర్తి చేయించింది.
ఆ తరువాత రేపల్లెలోని తూములూరి సుబ్బావధాని దగ్గర పదం, క్రమం, బ్రాహ్మణ, ఆరణ్య భాగాలు, ఉపనిషత్తులు పూర్తి చేయించి వేదవిద్యలో తీర్చిదిద్దింది. ఆ సమయంలోనే అన్న నరసింహావధాని మరణం మళ్లీ అశనిపాతమైంది. అంతటితో అక్కడ చదువు మానేసి, ఇంటికి వెళ్లిపోదామనుకున్న దశలో తల్లి మొక్కవోని ధైర్యంతో మాణిక్య సోమయాజిని పరిపూర్ణ విద్యావంతుణ్ణి చేసింది. 17 ఏళ్ల వయస్సులోనే వేదశాస్త్ర సభల్లో విజయం సాధించే విధంగా తనయుణ్ణి తీర్చిదిద్దింది తల్లి!
ఆ తరువాత స్వగ్రామానికి చేరుకుని వేదవిద్యా ప్రచారం కోసం కంకణం కట్టుకున్నారు మాణిక్యసోమయాజి. అప్పుడే కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ సమీపంలోని ఖనేరంజోల్ గ్రామానికి చెందిన రామచంద్ర భట్ గారి కుమార్తె లలితతో వివాహం జరిగింది. ఆ తరువాత గృహస్థాశ్రమంలో విద్యుక్త ధర్మాలను కొనసాగిస్తూ ప్లవంగ నామ సంవత్సరంలో సోమయాగాన్ని నిర్వహించి ‘సోమయాజి’గా సార్థక కీర్తిని అందుకున్నారు.
అటుపిమ్మట ఇస్మా యిల్ఖాన్ పేటలో శాస్త్రుల విశ్వనాథశాస్త్రిగారి ప్రేరణతో ప్రారంభమైన వేదవిద్యా పాఠనోద్యమంలో చేరి శివంపేటలోని వేదపాఠ శాలలో ఆచార్యులై వందలాది మంది శిష్యులకు వేదవిద్యలోను, శాస్త్ర విద్యలోనూ, యజ్ఞయాగాది ధార్మిక సంస్కారాలలోను తీర్చిదిద్దిన మహాతపస్వి మాణిక్య సోమయాజి. శ్రీ మాణిక్య సోమయాజిగారు దేశంలోనే వేదానికి భాష్యం చెప్పగల అతికొద్దిమంది విద్వన్మూర్తులలో అగ్రగణ్యులు. వేదాలకు సంబంధించి ఏ భాగంలోనైనా అనర్గళంగా భాష్యం చెపుతూ వందలాది సభల్లో వీరు ధర్మప్రబోధాన్ని అందిస్తున్న జ్ఞాని. ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలో శ్రౌతసంవర్థినీ సభ ఆధ్వర్యంలో ధర్మపురిలో జరిగిన జ్యోతిరప్తోర్యామం ఉత్కష్ట సోమయాగం వీరి యాజమాన్యంలో వైభవంగా జరిగింది. కృష్ణా పుష్కరాల సమయంలో బీచుపల్లిలో బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి యాజమాన్యంలో జరిగిన అగ్నిష్టోమ సోమయాగం పట్లూరి గురువుగారి పర్యవేక్షణలోనే జరిగింది. ఐదేళ్ల క్రితం తొగుట శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠంలో శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి ఆశీస్సులతో జరిగిన చాతుర్మాస్యేష్ఠి శ్రౌతయాగం మాణిక్య సోమయాజులు-లలితా సోమిదేవమ్మ యాజమాన్యంలోనే జరిగింది. బ్రహ్మశ్రీ మాణిక్య సోమయాజులు గారి వైదిక నిర్వహణలో తెలుగునాట సహస్రాధిక యాగాలు ఆలయాల ప్రతిష్ఠలు జరిగాయి. ఏ కార్యక్రమం నిర్వహించినా నిస్వార్థ, ధార్మిక చింతనతో వీరు వేదోక్తంగా నిర్వహిస్తారు. అంతేకాక ఏ చిన్న సందర్భం వచ్చినా వేదాల్లో ఉండే విశిష్టతను వివరిస్తూ అనర్గళంగా ధార్మిక ప్రవచనాలను అందించి ఆస్తికులను మంత్రముగ్ధులను చేస్తారు. వీరి ఆధ్వర్యంలో 2012లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్లోని పురాతన శ్రీ రామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష రుద్ర మహాయాగాన్ని అద్వితీయంగా నిర్వహించారు. గత సంవత్సరం సికింద్రాబాద్ కానాజీగూడలోని మరకత శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో లక్ష మోదక గణపతి హోమాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వీరికి విశిష్ట సేవా పురస్కార ప్రదానం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగంలో స్వర్ణకంకణంతో సత్కారం జరిగింది. విఎస్ఆర్ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవంలో వీరిని ‘వేదవిద్యానిధి’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
వారి స్వగ్రామం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు. మాణిక్య సోమయాజులుగారికి పట్లూరులో అపూర్వ సత్కారం జరిగింది. గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేద పండితులు, విద్వన్మూర్తులు వేలాదిగా తరలివచ్చి వీరిని భారీ ఊరేగింపుతో వేదికపైకి తీసుకువచ్చి స్వర్ణకంకణంతో సన్మానించారు. గత మూడున్నరేళ్లుగా పరిపూర్ణధార్మిక చింతనతో వారణాసి (కాశీ) విశ్వనాథుని సన్నిధిలో ఉంటూ అక్కడే అనేక ధార్మిక ప్రవచనాలను, వేదవేదాంత బోధనలను అందిస్తూ ధార్మిక జీవనాన్ని గడుపుతున్నారు. వీరి వద్ద వేదవిద్య అభ్యసించిన వందమందికి పైగా ధార్మిక ఆధ్యాత్మిక వేదవిద్వన్మూర్తులుగా కీర్తి ప్రతిష్ఠలను పొందుతున్నారు. ఇంకా వెయ్యి మందికి పైగా ప్రశిష్యులు వీరి మార్గంలో ధార్మిక సేవలందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాక యావత్ భారతదేశం గర్వించదగిన ఈ వేదవిద్యా నిష్ణాతునికి ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తామాసపత్రిక తన చతుర్దశ వార్షికోత్సవం సందర్భంగా భాగ్యనగరంలోని రవీంద్రభారతి సాంస్కతిక కళావేదికపై నవంబర్ 12వ తేదీ సోమవారం ఉదయం 12 గంటలకు ‘ధార్మికవరేణ్య’ బిరుద ప్రదానంతో పాటు జీవనసాఫల్య పుర స్కారాన్ని పల్లకీలో ఊరేగింపుతో అత్యున్నతంగా సత్కరించాలని సంకల్పించడం ధార్మికలోకానికి ఆనందదాయకం. విద్వదాహితాగ్ని, జ్యోతిరప్తోర్యామయాజి, వేదవిద్యానిధి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి-లలితా సోమిదేవమ్మ దంపతులు భవిష్యద్వైదిక భారతావనికి స్ఫూర్తిదాతలై శతాధిక సంపూర్ణాయురారోగ్య భాగ్యాలతో వెలుగొందాలని సమస్త ధార్మికలోకం కోరుకుంటోంది.

------------------------------------------------------------------------------
“మా అమ్మ జనాబాయి వేదవిచ్ఛిత్తి.. వేదీ విచ్ఛిత్తి కాకుండా మా అన్న నరసింహశర్మను అల్వాల్ రామశాస్త్రి గారి వద్ద వేదాధ్యయనానికి పంపింది. కానీ అక్కడ వేదాధ్యయనం పూర్తవుతుందో లేదో అన్న అనుమానంతో నన్ను, అన్నను తీసుకొని ఆంధ్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకొంది. రజాకార్ల అల్లర్లు జరుగుతున్న సమయం అది. అయినా పట్టుదలతో పిల్లలకు వేదాధ్యయనం చేయించాలని గుంటూరు జిల్లాకు తీసుకు వెళ్లింది. సత్తెనపల్లి తాలూకా చవటపాపయ్య పాలెం అగ్రహారంలో ‘బ్రాహ్మణ గురుకులాక్షిశమం’లో నన్ను, అన్నను చేర్చుకొమ్మని అమ్మ అర్థించినా అక్కడి వారు నిరాకరించారు. ‘నైజాం ప్రాంతం వారికి ఇక్కడ ప్రవేశం లేదు’ అని చెప్పారు. కానీ అమ్మ పట్టువిడవకుండా ఎన్నో ధర్మసూక్ష్మాలు, సోమయాగం, ఇష్టి గురించి పాఠశాల ఆచార్యులు ముదిగొండ వెంకటరామశాస్త్రితో చర్చించింది. అమ్మకున్న అవగాహన తెలిసి ఆశ్చర్యపోయారాయన. ఆమె పట్టుదలకు ముగ్ధులైన ఆయన మిగతా సభ్యులు, అధ్యాపకులతో చర్చించి ‘ఒక ఆడమనిషి దేశం కాని దేశం వచ్చి వేదాధ్యయనం కోసం అర్థించినప్పుడు ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టకపోతే వేదమాతను అవమానించిన వారమవుతామ’ని గట్టిగా చెప్పడంతో అందరూ సమ్మతించారు. అలా పాఠశాలలో మాకు ప్రవేశం కల్పించారు”. - మాణిక్య సోమయాజులు
ధర్మాభిమానమున్న రోజులవి...
“దేశానికి స్వాతంత్య్రం వచ్చి హైదరాబాద్ మాత్రం ఇంకా ప్రత్యేక దేశంగా కొనసాగుతున్న రోజులవి. వేదాధ్యయనం కోసం మేము గుంటూరు వెళ్తున్నాం.. రజాకార్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని సైతం తుపాకులతో కాల్చి చంపేసిన సంఘటన నాకు ఇప్పటికీ కళ్లల్లో కనిపిస్తుంది. అదే సమయంలో హైదరాబాద్ను దేశంలో విలీనం చేసుకోవడానికి భారత సైన్యం వచ్చిన సంగతి నాకు బాగా గుర్తుంది. ఇక నాకు తెలిసిన హైదరాబాద్ అంటే... చుట్టుపక్కల రంగాడ్డి జిల్లాలో 20 నుంచి 30 గజాల్లోతులోనే నీళ్లు పడేవి. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక వర్షాలయితే సంవత్సరంలో మూడు, నాలుగు నెలలు కురిసేవి. సస్యవృద్ధి బాగా ఉండేది. నేడు చెట్లను నరకడం, అడవుల పెంపకం నిరక్ష్యం చేయడంతో విపరీత పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రజల్లో నాడు డబ్బుకు ఇబ్బంది ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. పంటలు పండకున్నా, నీళ్లు లేకున్నా ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఆ రోజుల్లో ధర్మాభిమానం ఉండేది. ప్రతి ఇంట్లో ఏడాదికి ఒకసారి అన్నసంతర్పణ చేసేవారు. పంటలు, నీటి విషయంలో ఆ రోజులే మంచిగ ఉండేవన్నది నా అభిప్రాయం.” - మాణిక్య సోమయాజులు
వేదం అంటే...
“వేదం అంటే జ్ఞానం అని అర్థం. విద్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. విద్ అనే ధాతువుకు విచారణ, ఉండుట, జ్ఞానం, లాభం అనే అర్థాలు ఉన్నాయి. పూర్వం ఋగ్వేదంలో 21 శాఖలుండగా నేడు కేవలం రెండు శాఖలు లభిస్తున్నవి. అదేవిధంగా యజుర్వేదంలో 101 శాఖలుండగా నేడు 6, సామవేదంలో 1000 శాఖలు ఉండగా నేడు 3, అథర్వణ వేదంలో 9 శాఖలు ఉండగా నేడు రెండు శాఖలు మాత్రమే లభిస్తున్నవి. మొత్తమ్మీద నాలుగు వేదాల్లో 1131 శాఖలు ఉండగా నేడు 13 - 17 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి” - మాణిక్య సోమయాజులు
సనాతన ధర్మమే మార్గం...
“నేడు ప్రపంచం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. వీటన్నింటికీ వేదాల్లో పరిష్కారాలు ఉన్నాయి. మానవుడు మొదట ప్రకృతిని ప్రేమించాలి. ఏదో సాధించామనే భ్రమలో ఉన్నాడు. కానీ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రకృతి విధ్వంసం, సాటి జీవులపై ప్రేమ, కరుణ లేకపోవడం, దురాశ, స్వార్థం మానవుల కష్టాలకు ప్రధాన కారణాలు. వీటన్నింటికి పరిష్కారం ఆధ్మాత్మిక మార్గం. సనాతన వైదికధర్మం పాటిస్తే అందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు” - మాణిక్య సోమయాజులు

అస్మద్గురుం సంతత మానతోస్మి....
(వ్యాస రచన : పురాణం మహేశ్వర శర్మ)

గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
మన భారతీయ ధర్మశాస్త్రాలలో గురువునకు అగ్రస్థానమీయబడినది. గురువే కనక లేకపోతే ఏ ధర్మమూ లేదు. ఏ సుఖము, ఆనందములూ లేవు. ఏ ధర్మానికైనా, ఏ సుఖానికైనా మూలం గురువే. ఆయన ఇది ధర్మం, దీన్ని ఆచరించాలి... ఇది అధర్మం, దీనిని ఆచరించకూడదు అని బోధించకపోతే మనకు ఎలా తెలుస్తుంది. అంధకార నిరోధకుడు కనుక ఆయనను గురువన్నారు- అని గురు శబ్ద నిర్వచనాన్ని చెప్పారు. అంధకారమంటే సంసారమే. దేనివలన జీవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో దానిని అంధకారం అంటారు. జీవుడు సంసారం వల్ల దుఃఖాన్ని అనుభవించడం వల్ల దీనిని తొలగించి ఆనందాన్నందించేవాడు అని ‘గురు’ అనే పదానికి అర్థం. గురువు ఉద్ధరించేవాడై ఉండాలి. శిష్యుడు ఉద్ధరింపబడేవాడై ఉండాలి. శిష్యుణ్ణి గురువు ఉద్ధరిస్తాడు. అతడు నిర్లిప్తుడు, పరిపూర్ణుడు ఆత్మారాముడు. ఒకవేళ గురువు కూడా దుఃఖ సంసారియైయున్నాడు అంటే శిష్యుణ్ణి ఎలా ఉద్ధరించగలడు.
‘‘అంధెనైవనీయమా నాయథాంధాః’’ అంటుంది ఉపనిషత్తు. ఒక అంధుడు ఇంకొక అంధుడిని తీసుకువెళ్ళినట్టు అని దీని అర్థము. ఒక మార్గాన అంధుడు వెళుతుంటే అంధుడు కాని వాడు అంధుడిని తీసుకువెళ్లగలడు. ఇద్దరూ అంధులే అయ్యారంటే ఇద్దరూ దుఃఖాన్ని అనుభవించవలసిందే. ‘‘కృతార్థోహినామ ఆచార్యాభవతి’’ అని శంకరులు వారి భాష్యమున గురువు కృతార్థుడైయుండాలి అని, శిష్యుడు అకృతార్థుడైనందున వానిని ఉద్ధరించగలడు అన్నారు. శిష్యునిపైన వాత్సల్యముండే గురువు దొరకడం చాలా దుర్లభం. శిష్యవాత్సల్యముండే గురువు శిష్యునికీ దొరకడమూ కూడా అనేక జన్మలలో చేసికొన్న పుణ్యముంటేనే సాధ్యమౌతుంది. మేమంతా ఎన్ని జన్మలలో చేసిన సుకృతమో తెలియదు కానీ ఈ జన్మలో మాణిక్య సోమయాజులు గారు మాకు గురువు అయ్యారు. పదిహేను ఇరవై సంవత్సరాలు అంతేవాసులుగా ఉండి మా గురువు గారి వాత్సల్యాన్ని ప్రేమను వెలగట్టడానికి వీలులేనంత చూరగొన్నాం. నిరంతరం ధర్మాన్నే బోధిస్తుంటారు. లౌకికమైన మాటలే లేవు. ఏ మాట మాట్లాడినా అది వేదాల్లోనిదే అయ్యుంటుంది.
ఎంతోమంది వేదాన్ని చదువుకున్నవారు ఉన్నప్పటికీ మా గురువుగారిది విలక్షణశైలి వేదాల్లోని మంత్రాలన్నీ ‘అహమహమికయా’ (నేనంటే నేను) అని పరిగెత్తుకు వస్తుంటాయి. సమయోచిత ప్రజ్ఞ, సందర్భోచితమైన భాషణ వీరి సొత్తు. మా గురువుగారికి వేదాల్లో చెప్పబడిన కర్మలంటే (శ్రౌత) చాలా ఇష్టం. ఆ కర్మానుష్ఠానము చేసే సందర్భంలో కర్మలో మమేకమవుతారు. కర్మల గురించి వివరించే సందర్భంలోనే వారి కంటి నుండి అశ్రుధారలు కారుతుంటాయి. అంటే వీరికి శ్రౌత కర్మలపైన ఎంత మక్కువో తెలుస్తుంది. వారి సంభాషణను వినే వారంతా నిశ్చేష్టులై (బీరిపోయి) వింటుంటారు. మంత్రముగ్ధులౌతారు అంటే అతిశయోక్తి కాదు. మా చిన్నతనాన గురుకులంలో వేదపాఠం చెప్పే సమయాన ప్రతినిత్యం ఆయా వేద మంత్రాల సందర్భోచితమైన వ్యాఖ్యానం చేస్తూ ధర్మము నందు, వేదము నందు అభిమానము అధికమయ్యేట్టుగా చేశారు. పునాది గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుందన్నట్టు మా విద్యార్థి దశన ఎంతో గట్టి పునాదిని వేశారు మా గురువుగారు. ఈనాటికీ వీరి ఉపన్యాసం వినాలని వీరి అంతేవాసులవ్వాలని వేలాది మంది కోరుతుంటారు. అంటే మా గురువుగారి ఉపదేశ ధీరత అంత గొప్పది.
‘‘ఆచినోతి చ శాస్త్రార్థం ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతె యస్మాత్తస్మాదాచార్య ఉచ్యతే’’
మా గురువుగారు ఆచార్యుడు కూడా. ‘‘శాస్త్రార్థాన్ని చెపుతూ ఎదుటివాణ్ణి ఆచారమునందు ప్రవేశపెడుతూ తాను కూడా ఆచరించేవాడు’’ ఆచార్యుడు అని పై శ్లోకానికి అర్థం. ఇది నూరుపాళ్ళు మా గురువుగారికి అన్వయిస్తుంది. విద్య వినయాన్నిస్తుంది. వినయం వలన పాత్రత లభిస్తుంది అని చదవడమే కాని ఒకవేళ చూడదలిస్తే అవన్నీ మా గురువుగారిలోనే ఉంటాయి. ఏ ఒక్క అంశంలో పాండిత్యమున్నా విపరీతమైన అహంకారంతో ఉంటారు. కానీ మా గురువుగారిలో వేద, శాస్త్ర, జ్యోతిష, అలంకార, వేదాంత, శ్రౌత మొదలైన ఎన్నో శాస్త్రాల్లో అఖండ పాండిత్యమున్నా తొణికిసలాడని నిండుకుండ. కించిత్తు కూడా అహంకారం లేకపోవడం ఎంత విచిత్రమో. బాలురలో బాలుని వలె, పండితులలో పండితుని వలె ఉంటూ ఈనాడు మన మధ్య సంచరిస్తున్న మా గురువుగారు సాక్షాత్తూ పరమేశ్వరుడే ‘‘వేదశ్శివశ్శివోవేదః వేదాధ్యాయీ సదాశివః’’ వేదము శివుడు, శివుడే వేదము. వేదాన్ని అధ్యయనం చేయువాడు సదాశివుడే. ఈ వాక్యాన్ని ఎంతోమంది వాడుతుంటారు. కానీ ఈ వాక్యంలో చెప్పినది చూడదలిస్తే.. అది మా గురువుగారే.
‘దర్శనమ్’ తన ప్రతి ఒక్క వార్షికోత్సవానికి ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంది. ఈసారి మా గురువుగారికి పల్లకీసేవ చేసి బిరుదు ప్రదానం చేసి సన్మానించుట ఎంతైనా గొప్ప కార్యక్రమం, మాకెంతో ఆనందదాయకం. వేదశాస్త్రాలని చదివి బ్రాహ్మణుడు ధర్మమయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అంటే దేవతలంతా అతనిముందు నిలుచునుంటారు. కాదు, అతని శరీరంలోనికి వెళ్ళి కూచుని ఇతని శరీరం మా ఇంద్రాది లోకాలకన్నా గొప్పది అని దేవతలే వారి లోకాలను విడిచి ఆ శరీరంలో ఉంటున్నారంటే, వేదశాస్త్ర సంపన్నుడు ఎంత గొప్పవాడో ఊహించండి. ఎక్కడో రాష్ట్రాంతరాల్లో ఉన్న పండితులకన్నా నివురుగప్పిన నిప్పులవలె ఉన్న మన తెలంగాణ పండితులను వ్తిస్తత ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్న దర్శనమ్ పత్రిక కృషి సర్వదా అభినందనీయం. సకలదేవతా స్వరూపులయిన మా గురువుగారి సేవలో సకల దేవతలు సంతృప్తులై దర్శనమ్ వంద సంవత్సరాల వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని మా గురుదేవుల చరణధూళి సకల శ్రేయస్సులనిచ్చుగాక అని ప్రార్థిస్తూ... ---పురాణం మహేశ్వర శర్మ

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...