⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*
⚜⚜ *నాంది శ్రాద్ధ భోజనం*⚜⚜
ఒకసారి పరమాచార్య స్వామివారు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలోని చిన్న తిప్ప సముద్రం అనే ఊళ్ళో మకాం చేస్తున్నారు. అక్కడి ప్రజలు దాన్ని ఊరిపేరుతో కాకుండా సి.టి.యస్ అని పిలిచేవారు. దగ్గరలోనే శంకర జయంతి కూడా ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మహాస్వామి వారి పరమభక్తులైన శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, నేను చెన్నై నుండి బస్సులో సి.టి.యస్ కు బయలుదేరాము.
శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు ఆయన సహోదరుడు ఇద్దరూ సంస్కృత పండితులు. వారు ఆంధ్రదేశానికి చెందినవారు. వారి విద్వత్తు మహాస్వామి వారికి బాగా తెలుసు. ఆయన తరుచుగా మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవారు.
మేము అక్కడకు వెళ్ళిన రెండు రోజులకు శంకర జయంతి రాబోతోంది. అప్పుడు అక్కడ మహాస్వామి వారి కైంకర్యం చెయ్యడానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రతిరోజూ దర్శనానికి దాదాపు నలభై మంది దాకా వచ్చేవారు.
ఆ ఊళ్ళో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనది చాలా పెద్ద కుటుంబం. శ్రీవారికి పరమ భక్తుడు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అతని ఇంటనే బస చేసి, భోజనాదులు చెయ్యడానికి ఏర్పాటు చేశాడు. శంకర జయంతిని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారిని వాక్యార్థం గురించిన ప్రవచనం చెప్పవలసిందిగా ఆదేశించారు స్వామివారు.
భగవత్పాదులకు శంకర అను నామము కటపయాది సంఖ్యాన్ని అనుసరించి పెట్టారని పరమాచార్య స్వామివారే స్వయంగా చెప్పారు. విరై దానంగా వడ్ల ధాన్యాన్ని పంచిపెట్టారు. తరువాత అందరమూ ఆ ధనికుని ఇంటికి వెళ్లి భోజనాదులు ముగించాము.
మరుసటిరోజు ఆ ధనికుని ఇంట్లో ఆయన మనవడి ఉపనయన కార్యక్రమం ఉంది. ఉపనయనం రోజు ఉదయం మహాస్వామివారు వ్యక్తిగత సహాయకులైన రామకృష్ణన్, శ్రీకంఠన్ లను పిలిచి, “వాళ్ళ ఇంటిలో ఈరోజు ఉపనయనం. ఇక్కడకు దర్శనానికి వచ్చిన భక్తులను ఉపనయనం అయిన ఇంటిలో భోజనం చెయ్యకండి అని చెప్పండి. మీరు ఇద్దరూ వండి, అందరికి ఆహారం పెట్టండి” అని ఆజ్ఞాపించారు. ఈ విషయాన్ని ఆ ధనికునికి కూడా తెలపమని ఆదేశించారు.
విషయం విన్న ఆ ధనికుడు హతాశుడయ్యాడు. “మావల్ల ఏ తప్పిదము జరిగింది?” అని అతని వేదన. శంకర భక్తులను ఆకలి తీర్చే పుణ్యాన్ని కోల్పోయాము అని అతని బాధ.
బాధతో దాదాపుగా ఏడ్చే పరిస్థితిలో ఉన్నాడు. అతని బాధని పరమాచార్య స్వామివారికి తెలిపారు. అందుకు స్వామివారు, “ఉపనయనం జరిగే ఇంటిలో నాంది శ్రాద్ధం చేస్తారు. నాంది జరిగిన ఇంటిలో ఇతరులు భోజనం చెయ్యరాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భోజన ఏర్పాట్లు ఇక్కడ చెయ్యమని మీకు చెప్పాను” అని విశదపరచారు స్వామివారు.
ఈ శాస్త్ర సంబంధిత విషయాన్ని అందరికి స్వామివారు ఇలా తెలియజేశారు. శాస్త్ర సంబంధ విషయాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి ఎంతోమందికి ఈ విషయం తెలియదని మనకు స్పష్టమవుతుంది.
“తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ”
⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜
No comments:
Post a Comment