Saturday, October 27, 2018

కన్యాశుల్కం

*నాకు నచ్చిన పుస్తకం*

కన్యాశుల్కం నాలానే చాలా మందికి అత్యంత ప్రీతికరమైన నాటికని మీకు తెలియక పోవచ్చును. ఆ నాటికలోని కొన్ని మాటల ప్రయోగాన్ని విశ్లేషిస్తూ వాట్సాప్ లో షేర్ చేశాను. మీకూ నచ్చవచ్చును.

*కన్యాశుల్కం'* లోని కొన్ని మాటలు అర్ధం కావడం లేదంటున్నారు యువపాఠకులు. *అలాంటి వారికోసమే ఈ పోస్ట్.* వాళ్ళ భావన నిజమే. ఉదాహరణకు పూజారి రామప్పంతులుతో " *వై.స.బు.పె* అని ఎందుకన్నాడు బాబూ !" అంటాడు. *'వైదికీకి సర్వదా బుద్ధి పెడసరమే '* అని దీని అర్ధం. బంగోరె చెప్పినట్టు ఇలా *" కన్యాశుల్కం నాటకాన్నిశబ్దార్ధ విచారణ చేసి రాయాలంటే వేయి పుటల గ్రంధం తయారవుతుంది"* అయినా కొన్ని విషయాలు వివరిస్తాను. ఈ విధంగానైనా కన్యాశుల్కం *కూలంకషంగా* చదవాలనే ఆసక్తి కలుగుతుందని ఓ చిరు ఆశ.

*1)* *" నీ ఇంట కోడిని కాల్చా ! "* అంటాడు అగ్నిహోత్రావధాన్లు. ఇంటి యజమాని చనిపోయినపుడు శవానికి కోడిని దిష్టి తీసి కాల్చడం ఒక ఆచారం. అంటే *'ఆ ఇంటి యజమాని చచ్చుగాక '* అని ఈ తిట్టుకి అర్థమన్నమాట.

గురజాడ తెలుగుతోబాటు సంస్కృతాంగ్ల భాషా సాహిత్యాలను కూడా ఆపోసన పట్టాడు. సందర్భాన్నిబట్టి వాటిని పాత్రోచితంగా వాడుకున్నాడు.

*2.)* నాటకం ప్రారంభం లోనే గిరీశం స్వగతంగా ' *పూర్ రిచర్డ్ చెప్పినట్టు* 'అంటాడు. పూర్ రిచర్డ్ అనేది 19వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కల్పిత పాత్ర. నాటి ప్రసిద్ధ రచయిత బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆ పాత్రపేరుతో ప్రతియేటా 'ఆల్మనాక్' ( పంచాంగం ) ప్రచురించేవాడు. గురజాడ ఆగ్రంధాన్ని చదివారు.

*3)* కరటకశాస్త్రి మధురవాణి నుద్దేశించి *' ఏకా నారీ సుందరీ వాదరీవా* అంటాడు. దీని పూర్తిపాఠం ఇది " ఏకోదేవః కేశవో శివాః / ఏకోవాసః పత్తనంతా వనంవా / ఏకోమిత్రం భూపతిర్వా యతిర్వా /ఏకానారీ సుందరీ వాదరీవా/( శివుడో కేశవుడో ఒకడే దేవుడు. పట్టణమో వనమో ఒకటే నివసించదగిన చోటు. రాజో సన్యాసో ఒకరే ఆశ్రయించ దగినవారు. అందగత్తె అయిన భార్యతో కాపురం చేయటమో మునిలా గుహలో ముక్కుమూసుకుని ఉండటమో ఏదొకటి చెయ్యాలి. మధ్యే మార్గం మంచిది కాదని భావం.

*4)* లుబ్ధావధాన్లు దెయ్యాన్ని వదిలించుకోడానికి " *శాపరమంత్రాలు* ఉపదేశం అవుదామంటే బెడిసిగొడతాయేమో అని భయం " అంటాడు.'శాపర' అనేది 'శబర ' అనేదాని రూపం. అంటే భూతప్రేత పిశాచాది క్షుద్రవిద్యలకు సంబంధించినది. వీటిని సరిగా ప్రయోగించ కపోతే ప్రయోగించినవారికే కీడు కలుగుతుందని భయం ఉండేది.

*5)* గిరీశం వెంకటేశాన్ని ' సిగర్స్ కోసం *కాపర్స్* ఏమైనా సంపాదిం చావా లేదా? ' అంటాడు. కాపర్ అంటే రాగి. అర్ధరూపాయి, పావలా, బేడ వగైరా నాణాలు వెండితోనూ అణాలూ పైసలూ రాగితోనూ చేసేవారు.

*6)* 'నన్ను *సప్తవెధవ* ను చేశావు ' అంటాడు రామప్పంతులు మధురవాణితో. వధువు ఎంచుకున్న పురుషుడు వరుడు. స్త్రీ అలా ఏడుసార్లు వరులను మార్చుకోవచ్చు. *ఏడోసారి కూడా స్త్రీ ఆ మగాణ్ణి ఎంచుకోకపోతే అతణ్ణి సప్తవెధవ* అంటారు.

*7)* ' నీకీ *చిల్లంగికళ్ళు* ఏదేవుడిచ్చాడు? ' అంటుంది మధురవాణి శిష్యుణ్ణి. చేతబడుల్లాంటివి చేసేవాళ్ళు ఆ మంత్రాలూ పఠిస్తూ కంటి రెప్పలు ఆడించి అవతలివారిని వశీకరణ చేసుకునే పధ్ధతి అట.

*8)* పోలిశెట్టి పూజారితో ' *పాసం పెట్టి* సంపేస్తావా యేటి ? ' అంటాడు పేకాటసీనులో. కవిత్వంలో ఆయాస్థానాల్లో నిషిద్ధమైన అక్షరాన్ని పెట్టి శత్రువులకు కీడు చెయ్యొచ్చనే మూఢనమ్మకం ఉండేది. ఉదాహరణకి అ ,క ,చ ,ట ,త ,ప ,య ,స అనే అక్షరాలు పద్యపాదంలో 2,3,6,9,10,14 స్థానాల్లో పడకూడదట. వేములవాడ భీమకవి " హయమది సీత " అని ఆరో స్థానంలో 'త 'పెట్టి శపించడంవల్ల రాజకళింగగంగు రాజ్యభ్రష్టుడైపోయాడని కథ.

*9)* మీనాక్షి తండ్రితో 'ఎందుకీ *తంబళ అనుమానం?* 'అంటుంది. లుబ్దావధాన్లు ' *గుండు గొమ్ముల అనుమానం* 'తీరిపోయింది.'అంటాడు. ఇవి ఒక జాతీయానికి సంబంధించినవి. తంబళ అంటే శివార్చన చేసే పూజారి. అతను గుడికెళ్లే దారిలో ఒక ఆంబోతు మా గన్నుగా పడుకుని ఉంది వృత్తంలాగా ఉన్న దాని కొమ్ములో తనతల(గుండు)పడుతుందో పట్టదో చూడాలనిపించి తల దూర్చాడు. ఆంబోతుకి నిద్రవదిలి ఆ తంబళిని ఎగరేస్తూ ఊరంతా కలతిరిగితే పదిమందీ రక్షించారు. ఆ దెబ్బతో తంబళికి గుండు కొమ్ముల అనుమానం తీరింది.

*10)* *'ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూంటేనే కానీ పొలిటీషియన్ కానేరడు'* అంటాడు గిరీశం. మద్రాస్ కాంగ్రెస్ మహాసభలలో కాంగ్రెస్ నాయకులు అంతకుముందు చెప్పిన అభిప్రాయాలు మార్చారని, ఆ సభలకు వెళ్లొచ్చిన గురజాడ దాన్ని జ్ఞాపకం చెయ్యడానికి ఈ మాటలు వాడారు.

*11)* 'లుబ్ధావధాన్లు *శతాంధః కూపం ప్రవిశంతి "* అంటాడు. ఓ గుడ్డివాణ్ణి అనుసరించి వందమంది నూతిలో పడ్డారని అర్ధం.

*12.)* గిరీశం సౌజన్యారావు పంతులుతో *"మిషనరీ ఒరిజినల్ సిన్ అంటాడండి "* అని లెక్చర్ ఇస్తాడు. ఆడం ఈవ్ లు భగవంతుడి మాట జవదాటడం వల్ల , ఆ పాపం తరువాత తరాలకు పుట్టుకతోనే సంక్రమిస్తుందనే క్రైస్తవుల విశ్వాసమే ఒరిజినల్ సిన్.

*13)* *"ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను" అంటాడు అగ్నిహోత్రావధాన్లు "* శ్రాద్ధకర్మలు మొత్తం పదో పన్నెండో ఉన్నాయి. వాటిలో ఒకటిఘటాశ్రాద్ధం. పతితుడైనవాడు ప్రాయశ్చిత్తానికి ఒప్పుకోకపోతే అతని జ్ఞాతులు అతను బ్రతికుండగానే ప్రేత కార్యం జరిపి ,ఒక కుండను నీటితో నింపి ,దాసితో దాన్ని తన్నించి నీటిని ఒలకపోయడం అనే అపరకర్మ.

ఇలా నాకు తెలిసినవీ తెలియాల్సినవీ కూడా ఉన్నాయి. *నాకు తెలిసి కన్యాశుల్కం నాటకంపై జరిగినంత చర్చ ఏనాటకంపైనా జరగలేదు*

*పైన చెప్పినవి నా సొంతం కాదు.* బంగోరె, ఆర్వీయార్, ఆవంత్స సోమసుందర్, రాంభట్ల రచనలనుండి సేకరించినవి. కొన్ని పదాలు పండితులకు కూడా కొరుకుడు పళ్ళేదు. ఉదా: 'నా సంబంధం చేసుకుంటే *"ఇరవై రాపాషాణాలిస్తాను"* అంటాడు కరటకశాస్త్రి. *" రాపాషాణాలు "* అంటే అర్ధం తెలియదు" అన్నారు ఆవంత్స సోమసుందర్.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...