Thursday, June 28, 2018

పెళ్ళిళ్ళ గణపతి ఆలయం

పెళ్ళి కాని వారికి కొంగు బంగారం ఈ వినాయకుడు

ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.

ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు. ఏటా సుమారు పది లక్షల మంది భక్తులు ఈ దేవాలయ సందర్శన చేస్తారని తెలుస్తోంది. భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు గణేష్ ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినపుడు అక్కడ ఉండేవాడని చెపుతారు. ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకొనేవారు.
ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడుపెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. వినాయకుడు బ్రహ్మచారి. కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.
మనదేశంలో వెలసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది.

స్థల పురాణం

కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతినదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు రాక్షస సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఋషులు నారదుని శరణు వేడారు. అంతట నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలూ లేకుండానే యజ్ఞం పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు.

ఇడగుంజి ఆలయంలోని వినాయకుడు

ఇక్కడ వినాయకుడు ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.
ఇడగుంజిలోని ఆచారం

కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు. ఇడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగుళూరు, అనెగుడ్డే, కుండపుర, ఇడగుంజి మరియు గోకర్ణ.
విష్ణుమూర్తి ఆలయం

దీనికి దగ్గరగా 1000 సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలిగిన విష్ణుమూర్తి ఆలయం కూడా చూడవచ్చును. శ్రీ విష్ణుమూర్తి ఆలయం కర్నాటకలోని ఆలయాల్లో ఒకటి. ఇక్కడ చాలా ప్రశాంతంగా వుంటుంది. ఇడగుంజి సమీపంలోని బల్కుర్ విష్ణుమూర్తి ఆలయానికి అడవి దారుల్లో నడుస్తూ వెళ్ళవచ్చును. ఈ ఆలయం ఇడగుంజి వినాయక ఆలయం నుండి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.

విష్ణుమూర్తి ఆలయం ప్రాంగణంలో ప్రకృతిదృశ్యాలు చాలా వర్ణనాత్మకంగా వుంటాయి. ఇక్కడ ఎటువంటి కాలుష్యం లేని వాతావరణంలో మీ సమయాన్ని గదపవచ్చును. వినాయకుని ఆలయాన్ని సందర్శించినప్పుడు అలాగే విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా సందర్శించి దీవెనలు తీసుకోవచ్చును.

ఓం గం గణపతయే నమః

Tuesday, June 26, 2018

కృష్ణుడి నిందావిమోచన క్షేత్రం


కృష్ణుడి నిందావిమోచన క్షేత్రం
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
శ్రీకృష్ణ జాంబవంతుల యుద్ధం, శ్రీరామచంద్రమూర్తి దర్శనం... పురాణాల్లోని ఆసక్తికర ఘట్టాలు. ఆ ఐతిహ్యానికి సాక్ష్యంగా నిలిచినచోటే నెల్లూరు జిల్లాలోని మన్నారుపోలూరు. ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతీ సత్యభామా సమేతంగా వెలిశాడు.
 
రామభక్తుడైన జాంబవంతుడికి స్వామితో యుద్ధం చేయాలనే విచిత్రమైన కోరిక కలిగిందట. ఆ రోజు వస్తుందని స్వామి ఆయన్ను ఆశీర్వదించాడు కూడా. అమిత పరాక్రమశాలి అయిన జాంబవంతుడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించే శక్తి ఒక్క శ్రీరామచంద్రుడికి తప్ప మరెవరికీ ఉండదు. ద్వాపరయుగంలో గుహల్లో ఉంటున్న జాంబవంతుడిని సాక్షాత్‌ రామచంద్రమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణపరమాత్మ చేరి యుద్ధం చేస్తాడు. తన నీలాపనిందను పోగొట్టుకోవడానికి స్వామి యుద్ధం చేసే ఘటన శమంతకమణోపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. రామచంద్రమూర్తి దర్శనమివ్వబోతున్నాడన్న వార్త విని ఆంజనేయుడూ ఆ చోటుకి వచ్చాడట. ఈ కథనం జరిగిన స్థలమే మన్నారుపోలూరు అని ప్రసిద్ధి. మణిమండప క్షేత్రంగా ప్రసిద్ధిచెందిన సత్యభామా జాంబవతీ సమేత అళఘు మల్లారి కృష్ణస్వామి ఆలయం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలోని మన్నారుపోలూరు గ్రామంలో ఉంది. ఇక్కడే జాంబవంతునికి కోదండరాముడై దర్శనం ఇచ్చినందువల్ల ఈ క్షేత్రానికి మణి మండప క్షేత్రమని పేరొచ్చింది. జాంబవంతుడితో స్వామి మల్లయుద్ధం చేసినందున స్వామిని మల్లహరి అని పిలిచారట. ఆ మల్లహరి మల్లారిగా మారి తరువాత ‘మన్నారుపోలూరు’గా ఆ గ్రామం పేరు స్థిరపడింది. వైష్ణవ భక్తాగ్రేసరులైన పన్నిద్దరాళ్వార్లు స్తుతించిన 108 దివ్య తిరుపతులలో ఈ మణిమంటప క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం పూర్వం దండకారణ్యంలో భాగంగా ఉండేదని చెబుతారు. బ్రహ్మ కాంచీపురంలో యాగమాచరించేప్పుడు దండకారణ్య ప్రాంతపు ఉత్తర ఈశాన్యపు సరిహద్దును నిర్ణయించుకునేందుకు దీనిని చిహ్నంగా పెట్టుకొన్నాడంటారు. అందుకు గుర్తుగా కాళంగి నదీ ప్రాంతం నుంచి శ్రీకాళహస్తి ప్రాంతపు తొట్టంబేడు తిప్పలు వరకు ఒక ఎత్తైన కట్ట అగడ్తవలె ఉండేదట. దీనినే కోటకట్ట అని ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ఇది నేడు శిథిలమై కనిపిస్తోంది. బహుశా ఇదే బ్రహ్మయాగం నాటి ఉత్తర ఈశాన్యపు సరిహద్దుగా ఉండవచ్చనీ, ఇక్కడే గోమహర్షి తపస్సు చేసి వైకుంఠ ప్రాప్తి పొందాడనీ చెబుతారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో ఏటా శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి పర్వదినాలు విశేషంగా జరుగుతాయని ఆలయ అర్చకులు వల్లీపురం చక్రవర్తి మురళీకృష్ణన్‌ చెప్పారు.
స్థల పురాణం 
సత్రాజిత్తు దగ్గర ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న నిందను నివృత్తి చేసుకోవడానికి కృష్ణుడు తన సైన్యంతో అడవులకు వెళతాడు. అక్కడ కనిపించిన సింహపు జాడలను బట్టి ఓ గుహలో ప్రవేశించి లోపల ఓ ఎలుగుబంటి దగ్గర మణి ఉండటాన్ని గమనించి జాంబవంతునితో 28 రోజులు యుద్ధం చేస్తాడు. చివరకు కృష్ణుడిని శ్రీరాముడిగా గుర్తించడటం, జాంబవంతుడు తన కూతురు జాంబవతినీ, శమంతకమణినీ స్వామికి ఇవ్వడం జరుగుతాయి. దాన్ని సత్రాజిత్తుకు ఇవ్వడం ద్వారా స్వామి నిందావిముక్తుడయ్యాడు. ఆ యుద్ధం జరిగిన చోటు ఇదే అవడం వల్ల ఈ క్షేత్రాన్ని నిందావిమోచన క్షేత్రంగా పిలుస్తారు. సాక్షాత్తూ జాంబవంతుడే ఇక్కడ మూలవిరాట్టులను ప్రతిష్ఠించాడని చెబుతారు. జాంబవంతుడే క్షేత్రపాలకుడిగా ఉండటం మరో విశేషం. బ్రహ్మాండపురాణంలో క్షేత్ర ప్రశస్తి విస్తృతంగా ఉంది.
పదో శతాబ్దం నుంచీ... 
ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. చోళ రాజుల శిల్ప కళా వైభవాన్ని ఇక్కడ చూడొచ్చు. మనుమసిద్ధి హయాంలో, వెంకటగిరి రాజుల కాలంలో ఆలయం వైభవోపేతంగా ఉంది. వెంకటగిరి పాలకులు, దేవాలయానికి 5 గ్రామాలను విరాళంగా ఇచ్చారు. భారత ప్రాచీన శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన భూగృహం ఒకటి దేవాలయ ప్రాంగణంలో బయట పడింది. సౌందర్యవళ్లి అనేపేరుతో వెలసిన రుక్మిణీదేవి ఆలయం ప్రధానాలయానికి దక్షిణ భాగంలో ఉంది. ఒకప్పుడు గరుత్మంతుడు తన కంటే బలవంతుడు ఎవరూలేరని లోలోపల గర్వపడుతూ ఉండేవాడట. అది గమనించిన స్వామి గరుడుడి గర్వమణచదలిచి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఆంజనేయుడిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. స్వామి ఆజ్ఞమేరకు హిమాలయానికి వెళ్లి ఆంజనేయస్వామి తపస్సుకు భంగం కలిగించడంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయుడు గరుడుడిని చెంప దెబ్బ కొట్టాడు. నొప్పికి తాళలేక గరుడుడు ఏడుస్తూ దీనంగా స్వామితో మొరపెట్టుకుంటున్నట్లుగా, ఒక చెంప వాచి ఉన్న గరుడుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. మళ్లీ స్వామి ఆజ్ఞమేరకు గరుడుడు పోయి ఆంజనేయుడితో ‘స్వామి కోదండరామస్వామిగా జాంబవంతుడికి దర్శనమిస్తున్నాడు రమ్మ’ని పిలువమనగా అది విన్న ఆంజనేయుడు సంతోషంగా వెంటనే వచ్చి దాసాంజనేయుడై ఉన్న విగ్రహమూ మనకు కనిపిస్తుంది. దీన్ని గర్వభంగ క్షేత్రమనీ పిలుస్తారు.
మరిన్ని విశేషాలు 
ద్వారపాలకులైన జయవిజయులతో పాటూ విష్వక్సేన, సుగ్రీవుల బొమ్మలూ, రావణుడు నరకడం వల్ల ఒకరెక్కేఉన్న జఠాయువు, శ్రీనివాస మూర్తులను ఇక్కడ చూడవచ్చు. ఆలయంలో స్వామి సన్నిధిన ఆళ్వార్లతో పాటూ 9.5 అడుగుల ఎత్తుతో కన్నీరు కారుస్తూ కన్పించే గరుత్మంతుని విగ్రహం, అదే ఎత్తులో ఉన్న జాంబవంతుని విగ్రహాలూ ఆకట్టుకుంటాయి. ఆలయ గోపురం మీద తిరుమల గోపురంలోలా సింహాల బొమ్మలు ఉంటాయి.
 
- మారాబత్తుని వెంకటేశ్వర్లు, 

Thursday, June 7, 2018

కార్తెలు - సామెతలు

🚩 *రేపే మృగశిర కార్తె* 🚩
*హిందూ ధర్మచక్రం*

మృగ‌శిర‌ కార్తె వ‌చ్చిందంటే స‌క‌ల‌జ‌నుల‌కు వూర‌ట క‌లుగుతుంది. అప్ప‌టివ‌ర‌కు గ్రీష్మ‌తాపంతో అల్లాడుతున్న స‌ర్వ‌కోటి జీవాలు తొల‌క‌రిజ‌ల్లుల‌తో స్వాంత‌న చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు ప‌గిలే ఎండ‌లు కాస్తాయి. అనంత‌రం మృగశిర కార్తె వ‌స్తుంది. రుతుప‌వ‌నాల రాక‌ను మృగ‌శిర‌కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ న‌క్ష‌త్రంలో ప్ర‌వేశిస్తే ఆ రాశి ప్రారంభ‌మ‌వుతుంది. జింక త‌ల క‌లిగివుండ‌టంతో ఈ కార్తెను మృగశిర‌కార్తెగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ కార్తె మ‌న‌దేశంపై విశేష‌ప్ర‌భావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువ‌ప‌నాలు భార‌త్‌లోకి ప్ర‌వేశిస్తాయి. అప్ప‌టివ‌ర‌కు నిప్పులు చెల‌రేగిన భానుడి కిర‌ణాలు న‌ల్ల‌టి మేఘాల ప్ర‌భావంతో చ‌ల్ల‌బ‌డుతాయి. దేశానికి జీవ‌ధార అయిన వ‌ర్షాల‌తో నేల‌త‌ల్లి పుల‌క‌రిస్తుంది. రైతులు తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే  దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధ‌మ‌వుతారు. ఏరువాక‌సాగే కాలం అని కూడా అంటారు.

మృగశిర  న‌క్ష‌త్రం దేవ‌గ‌ణానికి చెందిన‌ది. అధిప‌తి కుజుడు. రాశి అధిప‌తులు శుక్రుడు, బుధుడు. ఈ న‌క్ష‌త్రంలో జ‌న్మించిన‌వారు మంచి అదృష్టం క‌లిగివుంటారు.

ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం వలన శరీరంలో   కూడా సమతుల్యం దెబ్బతినకుండా ఉండడానికి నేడు ఇంగువ   బెల్లం    కలిపి తీస్కోవడం అనేది మన   ఆనవాయితీ.

మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు.సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు.ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు.సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు.తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు నెలలు రాశులు వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో ఎలా చెప్పుకున్నారో చూడండి: 👇

1.అశ్వని (ఏప్రిల్ – 14) '

అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం
అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.
అశ్వని కురిస్తే అడుగు తడవదు.
2'.'భరణి' (ఏప్రిల్ – 27)

భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.
భరణి ఎండకు బండలు పగులుతాయి.
భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.
3.కృత్తిక (మే – 11)

కృత్తిక పునర్వసులు సత్తువ పంట.
కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పదిరినా చెడుతుంది.
4.రోహిణి (మే – 25)

రోహిణి ఎండకు రోళ్ళు పగులును
రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.
రోహిణి ఎండకు రోళ్ళో పాయసం ఉడుకును.
5.మృగశిర (జూన్ – 8)

మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.
మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.
మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.
మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.
మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.
మృగశిర కురిస్తే ముంగాలి పండును.
మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.
6.ఆరుద్ర (జూన్ – 22)

ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
ఆరుద్రతో అదనుసరి.
ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.
ఆరుద్ర వాన ఆదాయాల బాన.
ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
ఆరుద్ర వాన అరుదు వాన
ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి
7.పునర్వసు (జులై – 6) :-

పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా తడవదు.
8.పుష్యమి (జులై – 20) :-

పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.
పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరేడు పిట్ట అడుగైనా తడవదు
9.ఆశ్లేష (ఆగస్టు – 3) :-

ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది
ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.
ఆశ్లేష ముసురు – ఆగి ఆగి తుంపర కురియును.
ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.
ఆశ్లేషలో అడ్డెడు చల్లటం – పుట్టెడు ఏరుకోవటం
ఆశ్లేషలో ఊడ్చిన – అడిగినంతపంట.
ఆశ్లేష వర్షం – అందరికి లాభం.
ఆశ్లేష వాన అరికాలు తేమ
10.మఖ (ఆగస్టు – 17) :-

మఖ మానికంత చెట్టయితే – కార్తీకానికి కడవంత గుమ్మడికాయ
మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.
మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.
మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.
మఖలో మానెడు పుబ్బలో పుట్టెడు.
మఖా పంచకం సదా వంచకం.
మఖ పుబ్బలు వొరుపైతే మహత్తరమైన కాటకం.
మఖ ఉరిమితే మదురుమీద కర్రయినా పండును.
11.పుబ్బ (ఆగస్టు – 31) :-

పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటే.
పుబ్బలో చల్లేది, మబ్బుతో మొరపుట్టుకునేది.
పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు
పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు
పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు
పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే మఖలో మానేడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
12.ఉత్తర (సెప్టెంబరు – 13) :-

ఉత్తర చూసి ఎత్తరగంప – విశాఖ చూసి విడవరా కొంప.
ఉత్తర ఉరిమినా, త్రాచు తరిమినా తప్పదు.
ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
ఉత్తర పదును ఉలవకు అదును.
ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.
ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం
ఉత్తర వెళ్ళాక వరి ఊడ్పులు కూడదు
13.హస్త (సెప్టెంబరు – 27) :-

హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.
హస్తకు ఆధిపంట – చిత్తకు చివరిపంట.
హస్తకు ఆరు పాళ్ళు – చిత్తకు మూడు పాళ్ళు.
హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.
హస్తలో అడ్డెడు చల్లేకంటే – చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.
హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.
హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.
హస్తలో చల్లితే హస్తం లోకి రావు.
హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.
హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు వేయించండి అన్నవట గొర్రెలు.
14. చిత్త (అక్టోబరు – 11) :-

చిత్త కురిస్తే చింతలు కాయును
చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.
చిత్తి ఎండకు బట్టతల పగులును.
చిత్తలో చల్లితే చిత్తుగా పండును.
ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.
చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.
చిత్త నేలలో దుక్కి – పుటం పెట్టిన పుత్తడి.
చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.
చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.
చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.
15.స్వాతి (అక్టోబరు – 27) :-

స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.
స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.
స్వాతి కురిస్తే భీతి కలుగును.
స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.
స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.
స్వాతి వానకు సముద్రాలు నిండును.
స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకే.
స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
స్వాతీ! నేను జవురుకొస్తాను – విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.
16.విశాఖ (నవంబరు – 16) :-

విశాఖ వర్షం – వ్యాధులకు హర్షం.
విశాఖ కురిస్తే పంటకూ విషమే.
విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం
విశాఖ విసురుతుంది.
17.అనూరాధ (నవంబరు – 20) :-

అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది
అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.
18.జేష్ట్య (డిసెంబరు – 3) :-

జ్యేష్ట చెడకురియును – మూల మురగ కురియును
19.మూల (డిసెంబరు – 16) :-

మూల కార్తెకు వరి మూలన జేరుతుంది
మూల ముంచుతుంది
మూల కురిస్తే ముంగారు పాడు
మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు
మూల మంటే నిర్మూల మంటాడు
మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.
మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తేలుస్తుంది.
అది మన రైతన్నల విజ్ఞానం.

..✍ *హిందూ ధర్మచక్రం*

Friday, May 4, 2018

సంధ్యావందనము, గాయత్రి మంత్ర విశిష్టత

మహాభారతం, అశ్వమేధిక పర్వంలో, ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణ భగవానుడు, *'సంధ్యావందనము, గాయత్రి మంత్ర'* విశిష్టతను ఈవిధంగా వివరించారు.
'ప్రతినిత్యం ప్రాతఃకాలం, సాయంకాలం చక్కగా సంధ్యావందనము చేసేవారు వేదమయమైన నావను నిర్మించి తాము దానితో తరిస్తారు, ఇతరులను తరింపచేస్తారు. పవిత్రమైన గాయత్రిమాతను జపించేవ్యక్తి నాలుగు సముద్రాల చుట్టూ గల భూమిని అంతనూ దానంగాతీసుకున్నా ప్రతిగ్రహదోషంచేత దుఃఖితుడుకాడు. ఆకాశంలో ఉండేకొన్ని గ్రహాలు అనిష్టస్థానాలలో ఉండి, అనిష్టదాయికాలయినాకూడా గాయత్రి జప ప్రభావంచేత సౌమ్యములు, మంగళకరములు, శుభదాయకములవుతాయి. భయంకరమైన పిశాచములు కూడా ఆ బ్రాహ్మణునికి అనిష్టం కలిగించలేవు.
వేదవ్రతాచరణంగల పురుషులు భూమిమీద ఇతరులను కూడా పవిత్రులను చేయగలరు. ఆ గాయత్రిమాత నాలుగు వేదాలకన్నా కూడా శ్రేష్ఠమైనది. బ్రహ్మచర్యాన్ని అనుష్టించనివారు,  వేదాధ్యయనంచేయనివారు, దుష్ట ఫలాలనిచ్చే కర్మలనాచరించే నామమాత్రపు బ్రాహ్మణులయినా గాయత్రీ ప్రభావంచేత పూజ్యులవుతారు. అటువంటప్పుడు ప్రాతః సాయం సంధ్యావందనము నిత్యం చేసేవారిగురించి వేరే చెప్పేదేముంది.
శీలం, వేదాధ్యయనము, దానం, పవిత్రత, కోమలత్వము, సారళ్యం అనే సద్గుణాలు బ్రాహ్మణునికి వేదంకన్నా మిన్న.
*'భూః భువః సువః'* అనే మూడు  వ్యహృతులతో గాయత్రి మంత్ర జపము చేసేవారు వేదాధ్యయనము నిరతులే. ప్రతి నిత్యం సంధ్యావందనము చేసే ఉత్తమ ద్విజుడు బ్రహ్మలోకానికి వెడతారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
పూర్వం బ్రహ్మదేవుడు,  దేవతలు, ఋషిగణాలు అందరూ కలసి త్రాసులో ఒకవైపు గాయత్రి మంత్రమును, మరొకవైపు నాలుగు వేదాలను ఉంచి తూచారు. నాలుగు వేదాలకన్నా కూడా గాయత్రి మంత్రమే బరువైనదని నిరూపితమయ్యింది. సర్వవేదాలకు గాయత్రి మంత్రమే ప్రాణం. గాయత్రి రహితమైన వేదాలు నిర్జీవాలు.
నియమసదాచార భ్రష్టుడైన బ్రాహ్మణుడు నాలుగు వేదాలు చదివినా వింధ్యుడవుతాడు. సచ్ఛీలం సత్ప్రవర్తన కలిగి గాయత్రి మంత్రం మాత్రమే చేసే బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు.
ప్రతిదినమూ సహస్ర గాయత్రి మంత్ర జపము శ్రేష్టం, శతజపం మధ్యమం, దశగాయత్రీ జపము అధమం అవుతాయి.
*ప్రతినిత్యం ప్రాతః సాయం సంధ్యావందనమున శతగాయత్రి జపము ఆచరించిన గ్రహప్రతికూలముండదు. పురశ్చరణగా అక్షరలక్ష జపమున గ్రహములనుకూలవర్తులగుదురు. అక్షరకోటి జపమున సర్వగ్రహములు వారి ఆధీనమగును.*
గాయత్రి మంత్ర ప్రభావమునెంతచెప్పిననూ తక్కువే యుధిష్టరా!
*సకాలమైననూ, కాలాతీతమైననూ సంధ్యనాచరించే ద్విజుడు నాకు మిక్కిలి ప్రీతి పాతృడైయున్నాడు ధర్మనందనా!*

పెళ్ళిళ్ళ గణపతి ఆలయం

పెళ్ళి కాని వారికి కొంగు బంగారం ఈ వినాయకుడు ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్...