"మన భక్తి ప్రపంచం "
📌శ్రీ ఆదిశంకరుల జీవిత చరిత్ర
జగత్గురు ఆదిశంకరాచార్యలు సంపూర్ణ జీవిత చరిత్ర
సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు . ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా
శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి,వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడు. (కూర్మపురాణం నుండి).
హిందూ మతంపై శంకరుని ప్రభావం అసమానమైనది. శంకరుడు సాధించిన ప్రధాన విజయాలు:
బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.
ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.
శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.
గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.
జీవిత గాధ
***********
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని - శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.
📌జననము
శంకరుల జన్మస్థలం కాలడి
సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురువు లకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ,శివగురువు లు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామి కి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.
📌బాల్యము
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది.
ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.
📌సన్యాస స్వీకారము
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.
గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
📌గోవింద భగవత్పాదుల దర్శనం
తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యుడు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదుడు ఎవరునువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.
న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరుని, గోవిందభగవత్పాపాదుడు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నాడు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరుడు.)
శంకరులు వెంటనే గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరునికి బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
వారాణసిలో శంకరులు
********************
గురువునాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరునికి వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరునికి ప్రధమ శిష్యుడయ్యాడు.
📌మనీషా పంచకం
ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక ఛండాలుడు అడ్డువస్తాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు.
అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్
ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి
సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు
ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
📌ప్రస్థానత్రయం
అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరి కి బయలు దేరారు. బదరి లో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.
వ్యాసమహర్షి
*************
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.
వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరుడు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక" అని దీవిస్తాడు.
📌శంకరాచార్యుని శిష్యులు
శంకరునికి అనేకులు శిష్యులుగా ఉండిరి. ఆయన ప్రజ్నాపాఠవాలకు కొందరు. చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు వారిలో అతి ముఖ్యులు కొందరు కలరు
📌పద్మపాదుడు
పూర్తి వ్యాసం పద్మపాదాచార్యులు
శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్నానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్ధించాడు. అలా శంకరునుకు అత్యంత ఆత్మీయునిగా మారాడు.సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరును వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.
📌కుమారిల భట్టును కలవడం
తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుని గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరునికి వివరిస్తాడు. శంకరుడు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.
📌భట్టిపాదుడు
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన జ్నాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉన్నది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాలను గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం భోదించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగినది. మీరు ఇపుడు పరిక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమానంగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురివుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమి అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్క్తి ప్రసాదిస్తాడు
📌మండన మిశ్రునితో తర్క గోష్ఠి
మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరుడు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరుని లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా,మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తి గా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల ఒడిలి పోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటి కి మండనమిశ్రుని మెడలోని మాల ఒడిలిపోయింది. కాని, భర్త శరీరం లో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి,శుక్ల పక్షలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరుడు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశ్యంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగిగడు.
📌కామరూపవిద్య
శంకరుడు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద, ప్రీతి, రతి, దృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని,మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశాడు. చివరికి మండనమిశ్రుడు తన ఒటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.
దిగ్విజయ యాత్రలు
*******************
తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శఁకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరుని సంహరింపబోయినపుడు శంకరుని శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్ధించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరుని రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరుడు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు.
తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుని శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుని శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.
సర్వజ్ఞపీఠం అధిరోహణ
*********************
కేదారనాధ్‌లో శంకరుని సమాధి మందిరం వద్ద ప్రతిమ
శంకరుడు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతలో ఉంది , ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి విదేహ ముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుని స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. కాదు కంచి లో అని కూడా అంటారు.
📌శంకరుని జీవిత కాలము
శంకరుని జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి.
క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.
అయితే శంకరుడు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇంచుమించు శంకరుని సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దంవాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక మరియు పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత పక్కాగా ఉండే అవకాశం ఉంది...✍ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
No comments:
Post a Comment