*కాళేశ్వరం*
🔔🕉🔔🕉🔔🕉🔔🕉🔔🕉🔔
కరీంనగర్ జిల్లా, మహాదేవపూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది. త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.
ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై శివుడు యముడు వెలిశారు. సుప్రసిద్ధశైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని మహాదేవపూర్ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది. అతిప్రాచీనచరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేకప్రత్యేకతలున్నాయి. మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్థులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని 'కాళేశ్వరఖండవలు' ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
కాళేశ్వరక్షేత్రం శిల్పకళానిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గతవైభవం తెలుస్తుంది. ఇక్కడ హిందూ- ముస్లింలు సోదరభావంతో జీవించినట్లు కాకతీయుల శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది. మన దేశంలో ప్రముఖ సరస్వతీ ఆలయాలు మూడు ఉన్నాయి. కాళేశ్వరంలో మహాసరస్వతి, అదిలాబాద్ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతీ, కాశ్మీరులో బాలసరస్వతీ ఆలయాలున్నాయి. అదే విధంగా సూర్యదేవాలయాలు కూడా మూడు ఉన్నాయి. కాళేశ్వరంలో ఒకటి కాగా ఒరిస్సాలోని కోణార్క్, శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యదేవాలయాలు ప్రముఖమైనవి. కాశ్మీర్‌లోని మార్తాండ్ నందగల సూర్యదేవాలయం శిథిలావస్థలో ఉంది. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం, ఇత్యాది తీర్థాలున్నాయి.
కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వర ఆలయం సమీపానే మహారాష్ట్ర భూభాగం ఉంది. అందువల్ల ఇటు ఆంధ్రప్రదేశ్ భక్తులతోపాటు మహారాష్ట్ర భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పూరావస్తుశాఖవారు నిర్వహించిన తవ్వకాల్లో బౌద్ధవిహారాల గోడలు, పునాదులు, మహాస్తూపాలు, కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు లభించాయి. నేలకొండలోని బౌద్ధస్తూపం ప్రత్యేకాకర్షణ అని చెప్పవచ్చు. ఆలయంలో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెళ్ళినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment