Tuesday, November 14, 2017

దేవిపురం

🌺🌺 దేవిపురం 🌺🌺

విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.

“నాకు ఇల్లు కట్టించు” : న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి, ముంబాయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ లో శాస్త్రవేత్త గా పనిచేస్తున్న నిష్ఠల ప్రహ్లాద శాస్త్రిని “ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. ఒకసారి ప్రహ్లాదశాస్త్రి హైదరాబాద్ లో బిర్లామందిర్ కు వెళ్ళి, బాలాజీని దర్శించి, ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపురసుందరిగా దర్శనమిచ్చి నాకు ఇల్లు కట్టించు అని పలికి అంతర్థానమైనట్లనిపించింది. అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి. జాగ్రత్తగా, దోషరహితంగా, ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు అని ఆదేశించింది. ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు.

ఆలయం ఎక్కడ కట్టాలి ? ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపురసుందరీ దేవి స్వయంగా ఎంచుకుంది. తొమ్మిది కొండల మధ్య, రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాదశాస్త్రి తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఒక అగ్ని గుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ళ అమ్మాయిలా దేవి కనిపించింది. పూజలు అందుకుంది. తనకు అక్కడే ఇల్లు కట్టాల్సిందిగా ఆదేశించింది. ఆ ప్రదేశంలో తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది. ఆ శ్రీచక్రమేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్యపీఠం ప్రతిష్టించారు.ప్రక్కనే వున్న ఎత్తైన కొండమీద శివాలయం కట్టించారు.

ఆలయ సొగసులు : ఈ దేవీపురం ప్రాంతంలోని శ్రీచక్రమేరునిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది. ప్రహ్లాదశాస్త్రి ఏకాగ్రతతో, సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా, లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు, ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. 1990 లో జూన్ 4 వతేదీన మూలవిరాట్ ‘సహస్రాక్షి’ విగ్రహ ప్రతిష్ట జరిగింది. శ్రీ చక్రాలయంలో బిందు స్థానంలో (మూడో అంతస్తు) పవళించిన సదాశివుని మీద కూర్చున్న, నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే, జీవకళ ఉట్టిపడుతూ, జీవితం ధన్యమవుతుంది. ఆమె చుట్టూ, క్రింది అంతస్తులలో, నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు.

నిష్ఠల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, రెండో అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటు చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి మూడో అంతస్తులో అష్ట దళ పద్మంలో ఉంచారు. ఇవికాక భూమిమీదే భ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళియమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు _ఈ పది విగ్రహాలనూ రాతితో చెక్కించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేకాలు చేస్తారు.

ఈ దేవీ పురాన్ని శ్రీదేవీ భాగవతంలో వర్ణించిన ‘మణిద్వీపం’ గా రూపొందించాలని గురూజీ (ప్రహ్లాద శాస్త్రి) ఆకాంక్ష .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

1 comment:

Old Book Stories said...

మీ సిమ్ కార్డు ని ఆధార్ కార్డు తో లింక్ చేసారా ?
లేకపోతే వెంటనే ఒక కాల్ ద్వార వెరిఫై చేయండి .
lik your aadhar card with your mobile number online by calling 14546.
if you like video do like.
share to your friends
how to link mobile number to aadhar card in telugu || 2018 Sim linking process to Adhar card
YOUTUBE.COM
adhar verify proces by calling

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...