Monday, September 4, 2017

అద్వైత సిద్ధాంతం

అద్వైత సిద్ధాంతం

ఆదిశంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతానికి అద్వైతమని పేరు. శంకరులకు పూర్వం కూడా కొందరు అద్వైతం చెప్పారు. శంకరుల తరువాత అద్వైతానుభవం కలవారు పలువురు స్వస్వానుభవాలను ఉపనిషదుపదేశాలతో చేర్చి ఎన్నో ప్రబంధాలు వ్రాశారు. వారు తమ అనుభవాలను ఇతరులకు తెలిపేపట్ల అంతా ఒకటే అనే తత్త్వాన్ని గూర్చి అనేక గ్రంథాలు వెలువరించారు. ఇట్లా అద్వైతసిద్ధాంతం చెప్పిన గ్రంథాలు కోకొల్లలు.

అద్వైత గ్రంథాలు అన్ని భాషలలోనూ ఉన్నవి. సంస్కృతంలో సరేసరి. తమిళంలో మూలగ్రంథాలే ఎన్నో ఉన్నవి. తెలుగులో కూడా మూలగ్రంథాలు ఉన్నవి. కన్నడంలోనూ కావలసినన్ని ప్రాంతీయ భాషలలో అనుభవజ్ఞులూ, జ్ఞానులూ చాలా మంది స్వతంత్రంగా అనేక పుస్తకాలు వ్రాశారు. అద్వైత గ్రంథాలు హిందీ మరాఠీలలో గూడా కనబడతవి.

అద్వైత సంప్రదాయంలోనే పుట్టి పెరిగి చదువుకున్న వారు అద్వైతాన్ని శ్లాఘించి గ్రంథాలు వ్రాయడం మాట అటుండనీయండి. ఇతర మతాలను కూడా తమ తమ అనుభవాల తుది మెట్టు, అద్వైతమని వ్రాయడం విశేషం. ఇలా పలువురు పలు గ్రంథాలు రచించారు.

తమిళంలో 'మస్తాన్ సాహెబ్ పాటలు' అనే ఒక పుస్తకం ఉంది. ఇది 'తాయు మానవర్' వ్రాసిన పాటలలాగా ఉంటుంది. అద్వైతానుభవం తెలిపే పాటలు ఇందులో ఎన్నో. మద్వులకు చెందిన 'తత్త్వరాయస్వామి' అనేగొప్ప వారొకరు 'శశివర్ణబోధము' అనే గ్రంథమునూ మరికొన్ని పాటలనూ వ్రాశారు. 'వేదనాయకంపిళ్ళ' అనే అతడు క్రైస్తవుడు, మున్సిప్ ఉద్యోగం చేసేవాడు. ఈయన ఆత్మానుభవం చాటే గ్రంథాలు చాలా వ్రాశాడు. చరిత్రగా వ్రాయనీండి, పాటలుగా వ్రాయనీండి ఏమి వ్రాసినా అద్వైతం దొడ్డది అని ఈయన వ్రాస్తాడు. వీరి గ్రంథాలలో అద్వైతం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇటీవల ఎ.వి. గోపాలాచారియార్ అనువారు కొన్నిపుస్తకాలువ్రాశారు. మరణం చెందేవరకు ఈయన ఆత్మచింతనచేసిన వ్యక్తి. అద్వైతావలంబకులు ఇలా శరపరం పరగా అద్వైతంగూర్చి వ్రాయడమేకాక ఇతరమతాలకు చెందినవారుగూడా తమతమ గ్రంథాలలో అద్వైతానుభూతిని ప్రకటించారు.

ఆదిశంకరులంటే అందరకూ ఒక విధమైన ప్రీతి. ఆది శంకరులంటే ఏ మతాల వారికయినా ప్రేమా గౌరవమూ వీరి సిద్ధాంతమ్మీద ఒకానొకప్రీతి. ఇది నేను అనుభవంలో తెలిసికొన్న విషయం.

వాదనకు తలపడేవారుకూడ శంకరుల గ్రంథాలనే ఖండిస్తారుగాని ఇతరుల గ్రంథాలను చూడరు.

మన దేశంలో నేటివరకూ ఉన్న సిద్ధాంతాలు ఎన్నో మధ్వ సిద్ధాంతం, రామానుజ సిద్ధాంతం, శైవ సిద్ధాంతం. ఇవి కాక ఉత్తరాన గుజరాతు, బొంబాయి ప్రాంతాలలో వల్లభాచార్య సిద్ధాంతం. సంస్కృతంలో శ్రీకంఠాచార్య సిద్ధాంతం. తమిళంలో శివాచార్య సిద్ధాంతం, అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయ్. వీనిలో పరస్పరభేదం స్వల్పం.

ఈశ్వరభక్తీ, ఈశ్వరసాయుజ్యం అనే విషయాలలో ఏ సిద్ధాంతానికీ అభిప్రాయభేదం లేదు. శంకరులు చెప్పినరీతిగా ఈశ్వర భక్తిచేత ఈశ్వరసాయుజ్యం కలిగి ఈశ్వర స్వరూపైక్యం మనకు కలుగుతుంది. మనమూ ఈశ్వరుడూ, అనే భేదంలేకుండా కలిసిపోతాం. పరమాత్మ స్వరూపంతో ఐక్యమవడమే ఆనందమని భగవత్ పాదుల సిద్ధాంతం.

పూర్తిగా కలిసిపోతే ఆనందం ఎట్లా మనం అనుభవించగలం? అనుభవింపలేకపోవుదుమే, అందుచేత ఈశ్వరునితో మనం చేరేటప్పుడు మనం వేరూ ఆయన వేరూ అనియే తలపోస్తాం. ఆనందం ఇచ్చేవాడు భగవంతుడైతే ఆనందానుభవం పొందేమనంవేరుగా ఉండాలి. అని ఒక స్వల్ప భేదం పెట్టుకొని యింకో సిద్ధాంతం తలచూపింది.

కలిసి పోతాంకాని నీటిలో కలిసే పాలువలె కొంత విడిగానే ఉంటాం అని ఇంకోరూ ఏ సిద్ధాంతమైనా సరేభక్తిని అలవరచికొని పరమేశ్వర పాదసన్నిధి చేరుదాం అనేవిషయంలో ఎవరికీ ఆపత్తిలేదు. ఈశ్వరునితో కలిసిపోయినప్పుడు మనకు ఆనందం ఏదీ? సముద్రపు ఒడ్డున నుంచుంటేనే అలలనూ వాని అందచందాలనూ చూడవచ్చు. సముద్రంతో కలిసిపోతే ఆ అందచందాలు చూచేవాడెవడూ? ఆనందం ఎట్లా? అని సుంతసుంత కొంత కొంతభేదం కల్పించుకొని కొందరు కొన్ని మతాలు లేవదీశారు. రైల్వేజంక్షన్‌లో ఒక పట్టా మీంచి మరొక పట్టామీదికి రైలు మారేటప్పుడు మొట్ట మొదట శివా అని మధ్యదూరం కొంచెమే కొంతదూరం పోగాపోగా తోవలు వేరువేరు నడమమన్న దూరం ఎక్కువ ఎక్కువ అవుతూనే వుంటుంది. కడకుమిక్కిలీ ఎక్కువౌతుంది. ప్రారంభ దశలో మాత్రం దూరం స్వల్పమే.

వల్లభాచార్యులని చెప్పితినే వారికి బాలకృష్ణునిలో ప్రీతిఎక్కువ. రామానుజాచార్యులకు నారాయణ స్వరూపంలో ప్రేమ ఎక్కువ. మధ్వాచార్యులు 'విష్ణుః విష్ణుః' అంటూ కూచుంటారు.

శ్రీ కంఠాచార్యులకూ శైవులకూ శివ స్వరూపంలో ఆదరం, ఇట్లా కొన్ని స్వరూపాలూ కొందరు ఆచార్యులూ కొన్ని సిద్ధాంతాలూ భిన్నంగా కనబడతై. తమ ఉపాసనా మూర్తిని గూర్చిగాని తమ సిద్ధాంతాలను గూర్చిగానీ నిర్ధారణ చేసే పుస్తకాలు రాసేటప్పుడు మధ్వులు వైష్ణవ సిద్ధాంతాలూ వైష్ణవులు శ్రీ కంఠుల సిద్ధాంతాలనూ ఖండించవచ్చు గదా, కాని వీరందరూ శంకరులు ఇలా చెప్పారు అలా చెప్పారూ, ఇది తప్పు అది తప్పు అని వారిమీదే దాడిచేశారు. మీమాంసలో సాంఖ్యములో ఖండించి వుండవచ్చు. కాని వెతికి వెతికి తప్పులు ఎన్నడానికీ, చర్చచేయడానికీ తక్కిన మతాలు తగినంత యోగ్యత కలిగినవిగా వారికి కనబడలేదు. బౌద్ధులు వ్రాసిన పుస్తకాలలోనూ, జైనులు వ్రాసిన పుస్తకాలలోనూ అద్వైత భావగాఢత కనబడుతుంది. కాని తమతమ తత్త్వములందు అనభవశాలులు ముస్లిములైనా, క్రైస్తవులైనా తమకు తెలియకయే అద్వైతంలో అడుగు పెడతారు. ఇట్టి వైష్ణవులనూ ఇతర మతాలవారినీ నేను చూచాను.

రామనాథపురం సంస్థానంలో గొప్ప తమిళ విద్వాంసులు ఒకరు ఉన్నారు. ఒకపుడు నేను అక్కడికి వెళ్లేను. ఆయన నాతో వాదించడం మొదలు పెట్టేడు. ఇంతకూ వాదన ఏమంటే శంకరులు శివభక్తులుకాదు, విష్ణుభక్తులు అని. దీనిని నిరూపించడానికి శంకర భాష్యం దానిమీద గల ఉప గ్రంథాలూ దేశీయభాషలలోనివేగాక పాశ్చాత్యులువ్రాసిన గ్రంథాలు ఆయన ఉదహరించారు.

శంకరులు విష్ణుభక్తిని గూర్చి చర్చించినట్లే శివభక్తి ప్రాశస్త్యమును గూర్చికూడా వర్ణించారే అని నేనున్నూ శంకరభాష్యము నుండే ఉదహరించాను. కాని వారు ఒప్పుకోలేదు. వాదనలో వారికి జయమా నాకు జయమా అన్నది ప్రస్తుతం కాదు. ''మీరా వైష్ణవ గ్రంథాలను ఆధారంగా ఎందుకు తీసుకోరూ'' అని నేనడిగేను. అందులకు వారు ''ఎవరినైనా పరిశీలించవలసివుంటే వారిలో ఆచార్య లక్షణాలు ఉండనక్కరలేదా? శంకరులలోనే కదా ఆచార్య లక్షణాల పరిపూర్ణత'' అని వారు బదులు చెప్పేరు.

ఇలాగ దూషణకుగాని భూషణకుగాని శంకరులే గురి. ఇట్లా గురి అవడం శంకరులలో వుండే అసాధారణ గుణం. ఇట్లా అంటే మనకు పాపమా లేక పుణ్యమా అని ఆలోచిస్తే పాపమే అని తోస్తుంది. మనకు గురువులైన శంకరులను మనమే స్తోత్రం చేస్తే అందులకు మన భక్తి విశ్వాసాలు కారణంగావున్నా మనలను మనమే పొగడుకొన్న వారమౌతాం. ''మావూరు పెద్దదీ, మా జాతి అంతకన్న పెద్దదీ'' అని చెపితే ''నేను చాలా శ్రేష్ఠుడను'' అని అర్థం. అది ఆత్మస్తోత్రంగా తేలుతుంది. ప్రతి మతమందూ గ్రంథకర్తలకు తమ తమ మతముల గొప్ప చెప్పుకోవాలనే ఆశ బలీయం. సాధారణంగా తమ మతంలో గొప్పతనం చెప్పుకోవడానికి ఇతరులను ఖండిస్తేనే గాని తమ మత ప్రాశస్త్యం వెల్లడి కాదని అభిప్రాయం. వారు ఇతర మత సిద్ధాంతాలలోని గుణాలు కప్పిపుచ్చి దోషాలనే ఎంచుతారు. ఇట్లా వ్రాయకపోతే ఇతర మతాలు గొప్పవైపోతయ్యని భయమేమో. మన మతం గూర్చి ఇతరులకు చెపుదాం అనే చూపు వదలి పరమతాలలో రంధ్రాన్వేషణ చేస్తారు. ఇట్లాకాక సమన్వితంగా వ్రాసినవారే మతానికి చేరినవారై వుంటారు.

దక్షిణ బీహారంలో గంగకు దక్షిణప్రాంతాన హిందీ భాష ఎక్కువ. గంగకు ఉత్తరాన నాలుగు జిల్లాలలో మైథిలీ భాష. ఇది సీతాదేవికి జనకుడైన జనకుడు ఏలిన ప్రాంతం అని వాడుక. బీహారుకూ తూర్పు నేపాళానికీ సరిహద్దులో వున్న జనక్‌పూర్ అనేచోట జనకుడు ఉండినట్లు చెప్పుకుంటున్నారు. దర్భాంగా, చంపారణ్యం, ముజఫర్‌పూర్ ఇవి ఆ జిల్లాలలో ఉన్నై. ఆ దేశస్థుల పేరుల చివర 'మిశ్ర' అని వుంటుంది. 'వాచస్పతి మిశ్ర' అనేవారు (ఆదేశంలో) వేయేండ్ల క్రిందట ఉండేవారు. వారు సకలశాస్త్రకోవిదులు. యోగ శాస్త్రంలో ఎల్లలు ఎరిగినవారు. న్యాయశాస్త్ర పారంగతులు. ఉపనిషత్తులలోని జ్ఞానకాండను అవలోకనం చేసే శాస్త్రం వేదాంతం. కర్మానుష్ఠాలను విచారణ చేసేది మీమాంస. ఈ రెంటను వారిది పెద్దచేయి. ఆ కాలంలో వారికి ఉజ్జీ వారే. బ్రహ్మ సూత్రాలకు ఎందరో భాష్యాలు వ్రాశారు. శంకరులున్నూ వ్రాశారు. శంకరులభాష్యానికి వాచస్పతిమిశ్ర ఒక వ్యాఖ్య వ్రాశారు. దాని పేరే వాచస్పత్యం.

మిశ్రగారు చిరుతప్రాయంలోనే అంత పెద్ద వ్యాఖ్య వ్రాయడాని కుపక్రమించారు. భార్య కూడా అపుడే గృహ ప్రవేశం చేసింది. వారు వ్యాఖ్యానం వ్రాస్తూనే ఉన్నారు. తదేక దీక్షతో వ్రాసి ముగించే సరికీ వారికి షష్టిపూర్తి. ఇల్లాలికి ఏబదియేండ్లు దాటిపోయినై. ఇరువురూ వృద్ధ దంపతులయిపోయారు.

'మీరు పుస్తకం వ్రాసి యేమి పున్నెం సంపాదించు కొన్నారబ్బా? నాగతి యేమి కావాలి. తిలతర్పణాలు ఇవ్వ డానికయినా కడుపున ఒక కాయ కాయలేదు' అని ఆ యిల్లాలన్నది. 'అరెరె! పెండ్లాడి నీకు చాలా ద్రోహం చేశాను. సరి విచారపడకు! ఈ పుస్తకానికి నీపేరే పెడతా' ననితత్త్వ విచారాని కుపక్రమించే వారందరూ నిన్ను తలచుకునేటటులు చేస్తాను, అని తాను వ్రాసిన వ్యాఖ్యానానికి ఆమెపేరే పెట్టారట. ఆమె పేరు భామతి. ఆ వ్యాఖ్యానగ్రంథము పేరూ భామతి.

తత్త్వవిచారణచేసే గ్రంథాలు శాంకరభాష్యాన్ని ఉదహరించినా ఉదహరింపకున్నా భామతిలోని కొన్ని వాక్యాలనయనా ఉదహరస్తవి. ఆ వ్యాఖ్యకు అంతప్రశస్తి. వాచస్పతి మిశ్రవారికి మతపక్షపాతం లేదు. దర్శనాలన్నింటికీ వ్యాఖ్యానం చేశారు. మతాలన్నింటా గ్రంథాలు వ్రాశారు. వారి నిష్పాక్షికత అట్టిది. వారు రచించిన గ్రంథాలు - మండన మిశ్రుల బ్రహ్మసిద్ధికి వ్యాఖ్య బ్రహ్మతత్త్వ సమీక్ష, మండవ మిశ్రుల విధివివేకము మీద వ్యాఖ్య న్యాయగణిక, పూర్వ మీమాంసకు సంబంధించిన తత్త్వబిందు, సాంఖ్యతత్త్వ కౌముది, న్యాయగణికాతాత్పర్యం, న్యాయసూచీనిబంధనం, యోగసూత్రిభాష్యవ్యాఖ్య.

విద్యారణ్యులకాలంలో 'సర్వదర్శనసంగ్రహం' అనే పుస్తకం ఒకటి రచింపబడ్డది. అది ఆనాటి ఇరువది సిద్ధాంతాల తత్త్వమునూ లక్ష్యములనూ వర్ణించే గ్రంథం. దీనిలో నాస్తిక మతమును గురించికూడా రెండు మూడు పుటలు ఉన్నవి.

ఈ రీతిగానే నిష్పాక్షికంగా వ్రాసినవారిలో శ్రీ అప్పయ్య దీక్షితులవారొకరు. వీరు మున్నూరేండ్లకు మునుపటివారు. వీరు అద్వైతులూ, శివభక్తులూను. అయినప్పటికీ వీరు వివిధ మతాలు చెప్పే గ్రంథాలు రచించారు. 'ఇలా వ్రాయ వచ్చునా? అని వీరొక ప్రశ్న వేసికొని, 'అద్వైత స్థితికి ఈశ్వ రానుగ్రహం అవసరం, అన్ని సిద్ధాంతాలూ ఈశ్వర భక్తి ప్రతిపాదకాలు కాబట్టి ఏ మార్గాన నడచినా సరే అద్వైతస్థితిని పొందవచ్చు' అని తామే సమాధానం చెప్పారు.

యద్యప్యద్వైత ఏవ శ్రుతిశిఖర
గిరా మాగమానాం చ నిష్ఠా
సాకం సర్వైః పురాణౖః స్మృతినికర
మహాభారతాది ప్రబంధైః,
తత్రైవ బ్రహ్మసూత్రా ణ్య పి చ విమృ
శతాం భ్రాంతివిశ్రాంతిమంతి
ప్రత్నై రాచార్యరత్నై రపి పరిజ
గృహే శంకరాద్యై స్తదేవ.

- శివార్కమణిదీపక.

శ్రుతి అనగా చెవులతో విని చెప్పినది. శ్రుతి శిఖరాలంటే ఉపనిషత్తులు. ఇవి నాలుగు వేదాలకు చిటారు. ఇవి చెప్పేది అద్వైతం. శివాగమాలు, పాంచరాత్రం, విష్ణుపురాణం, శివపురాణం, అగ్నిపురాణం, వాయుపురాణం, భాగవతం మొదలయినవి ఉన్నా అన్నిటికి తుదిమెట్టు అద్వైతమే. ధర్మ శాస్త్రం, మనుస్మృతి, ఇతిహాసం, భారతాది ప్రబంధ సందోహం, వైద్యశాస్త్రం, కృషిశాస్త్రం. వీనిలో దేనిని ఎత్తుకున్నా అద్వైతంలోకే పోయి లయం చెందుతుంది.

వైద్యశాస్త్ర ప్రయోజనం రోగనివారణం. శరీరం ఇచ్చిన పరమాత్మను సత్య స్వరూపుని పొందడానికి ఉపకరణమైన శరీరానికి కావలసిన దృఢత్వంకలగడానికి వైద్యశాస్త్రం. ఆ ఆయుర్వేదముసైతం అద్వైతానికే దారి తీస్తుంది.

మనస్సు సంగీతంలో లయమవుతుంది. మనస్సులయం అయ్యేటటులు ''అలవాటు చేసికొంటే ఈశ్వరునిలో మనస్సును లయం అయేటటులు చేయడం సులభం. సంగీత శాస్త్రానికి ప్రయోజనంఇదే. అన్నవస్త్రాలకు లోపముంటే ఆత్మచింతనం కష్టమే. ఆత్మ చింతనచేసి 'అంతా ఒకటే' అన్న అద్వైతస్థితి పొందడానికి కృషిశాస్త్రం ఉపయోగపడుతుంది. ఆది ప్రబంధాలు అనగా సంగీతం కృషి నాట్యం వైద్యం మొదలయిన కళలు. ఇవి అన్నీ ఈశ్వరునితో ఐక్యం కావడానికి ఉపయోగిస్తవి.

గౌడపాదులు శంకరభగవత్పాదులు సురేశ్వరాచార్యులు వాచస్పతిమిశ్రులు విద్యారణ్యులు అద్వైత ఆచార్యులలో జీవరత్నాలు. వీరు వ్రాసిన విషయాలలో ఒకదాని కింకొకటి విరుద్ధంగా ఉన్నటులు మునిముందు తోచినా సునిశితంగా విమర్శిస్తే వైరుధ్యంలేదని తెలుస్తుంది.

తథా ప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణేః,
అద్వైత వాసనా పుంసా మావిర్భవతినాన్యథా.

ఇది పచ్చని దీపము, ఇది నీలిరంగు దీపము, ఇది టేప్రికార్‌డర్, ఇత్యాదు లన్నిటికీ మూలాధారం విద్యుచ్చక్తి. ఆ రీతిగానే మూర్తు లన్నీ బహిర్ దృష్టికి వేరువేరుగా ఉన్నా లోన ఉన్నది అద్వైతపరమైన వస్తువే.

అద్వైతస్థితికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహానికి భక్తియే సాధనం. అద్వైతులు ఇతర మతగ్రంథాలు వ్రాశారంటే అది అహంభావం కాదు. శంకరులను మనం గురుతు తెచ్చుకొంటాం. తెచ్చికొని ఏమి ప్రయోజనం? వారితోపాటు వారి మనోవైశాల్యం అందరకూ గురుతు కావాలి. మన కితరమతాలతో వైరుధ్యంలేదు. వాని తత్త్వం తెలిసికొందాం. మతాంతరులు అడిగితే మన మతతత్త్వం మనం చెబుదాం. ఇట్లా పరస్పర సాయం చేసికొందాం అన్న మనోభావం మనకు ఎక్కువగా కలగాలి.

'దేహాంతక ఆత్మ అనేదిలేదు. భుజించి అనుభవించి పెరిగి శరీరం అంతం పొందుతుంది. ఆత్మా పరమాత్మ అనేది ఏదీ లేదు' అని బోధిస్తుంది చార్వాకం. విద్యలన్నిటికీ కారణం ఈశ్వరు డని అంటై వేదాలు. అలాగైతే చార్వా కానికీ కారణం ఈశ్వరుడే కాబట్టి 'చార్వాకం అంటే మనకు ఏవనము కలుగగూడదు' అని సూతసంమితలో ఒక కాండ విస్తరంగా చెప్పింది.

భగవంతుడు లేడని చెప్పేది మతం ఎట్లా అవుతుందీ అంటే అదిన్నీ అద్వైతాని కనుకూలమే.

పొద్దున ఏడు గంటలకు లేవడం ఆచారం. అనుష్ఠానం లేదు. ఉన్నదింత తినడం పిదప తేడడం. ఇట్లా ఆచరిస్తూండే వాడు మన మతంలో ఒక డుంటే అలాటి సోమరికంటె- 'స్వామి లేడు, ఆత్మలేదు. అంతా ఈదేహమే' అని చెప్పేవాడెంతో శ్రేష్ఠుడు. అతడు తత్వవిచారణలో పడ్డాడుగదా! ఆత్మ ఉందా లేదా? స్వామికలడా లేడా? అనేదారిలోకి అతడు దిగాడు. అతడు కనుగొన్న తత్వం స్వామిలేడనే కాని అతడే విచారణలేని సోమరికంటె గొప్పవాడేకదా!

'స్వామి లేడు' అనేమెట్టువరకూ అతడు వచ్చాడు. మరికొంత పురోగమిస్తే అనుభవవిశేషం కలిగి అద్వైతస్థితిని అందుకోవచ్చు. కాన ఏమతమయినా సరే తత్త్వవిచారణ కనుకూలమే. ఏమతం మీదా ద్వేషంకూడదని వేయేండ్లనాటి వాచస్పతి, శంకరులూ, ఇన్నూ రేండ్లనాటి మహాపురుషులూ చాటిపోయారు.                       

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...