Tuesday, September 12, 2017

వైషమ్యాలను రెచ్చగొట్టడం దేశద్రోహం కాదా?

సామవేదం షణ్ముఖశర్మ గారి చెప్పుదెబ్బ
కంచె ఐలయ్య-"ఈ దేశంలో హిందుత్వం ఉండరాదు" అంటూ మాట్లాడిన కంచె ఐలయ్య అనే అతనికి శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి చెప్పుదెబ్బ! క్రింది వ్యాసంలో చదవండి.
వైషమ్యాలను రెచ్చగొట్టడం దేశద్రోహం కాదా?
-- సామవేదం షణ్ముఖశర్మ, ఆంధ్రభూమి, 19-7-2015

‘‘వేదాలు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రచనలు చేయా ల’’ని ఈమధ్య ఒక ప్రొఫెసర్‌గారు పిలుపునిచ్చారు. ‘‘క్రైస్తవులు దళిత మేధావులే ఆ పని చేయాలి. ఈ దేశంలో హిందుత్వం ఉండరాదు. గోదావరి పుష్కరాలకు ఒక్కరు కూడా వెళ్ళకుండా క్రైస్తవులు, దళితులు చూడాలి’’అని మాట్లాడారు. ఈ సభలో దళిత, క్రైస్తవ అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఇది ఒక దినపత్రికలో ఇటీవల ముద్రితమైన వార్తాంశం.

ఇలాంటి సంఘటనలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నా హిందువులు ఉపేక్షిస్తున్నారు. అసలు దళితుల అభ్యున్నతికోసం జరిగే సభలకి క్రైస్తవులు హాజరుకావడం దేనికి? క్రైస్తవం దళితులకు మాత్రమే పరిమితమా? అగ్రవర్ణాల్లో క్రైస్తవులు లేరా? ఆ అగ్రవర్ణ క్రైస్తవులు తమ కుల నామాలతోనే వ్యవహరింపబడుతున్నారే! వారు ఈ దళితులను తమ వర్గంలో కలుపుగోలరా?

పై వార్త ప్రకారం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలనే లక్ష్యం. దానికి అడ్డుగా ఉన్న దేశపు సహజ మతమైన హిందూ ధర్మాన్ని కూలదోయాలి. అందుకోసం ఈ సంఘటన. ఇందులో దళిత జనోద్ధరణ క్రైస్తవోద్దేశం కాదు. అందునా- అంబేద్కర్, జ్యోతీరావు పూలే వంటి మహాత్ముల ప్రస్తావన కూడా తెచ్చారు. కానీ వారు ఉభయులు కూడా క్రైస్తవులు కారు.

అంబేద్కర్ హిందూ మతంలో తనకు జరిగిన అనుభవాలు, అవగాహనల మేరకు తాను బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఇప్పుడా బౌద్ధాన్ని సదరు క్రైస్తవ మహాశయులు వ్యాప్తిచేయగలరా? ఇప్పుడు ‘దళితులు’అని పిలువబడుతున్న వర్గం వారి ఉద్ధరణకోసం స్వాతంత్య్రానికి పూర్వమే హిందూ మతంలో ఎందరో ఎన్నో సంస్కరణలు ఏర్పాటుచేశారు.

గాంధీ వంటివారు హరిజనోద్యమాన్ని నడిపారు. ఆలయ ప్రవేశాలు కల్పించారు. స్వాతం త్య్రం లభించిన నాటికి రాజ్యాంగ నిర్మాతలలో ప్రముఖులుగా ‘దళితుల’ని పిలువబడుతున్న వర్గంవారినే నియమించారు. ఆ సమయంలో నిమ్న వర్గాల వారికి రిజర్వేషన్లు అని పెడితే భవిష్యత్తులో ప్రమాదముంటుందని దేశ హిత కాంక్ష అంబేద్కర్ మహాశయులు పేర్కొన్నారనీ- కానీ కొద్దికాలం నడిపి తరువాత తొలగిద్దామని గాంధీ నెహ్రూలే ఒత్తిడి చేశారనీ- కొద్ది ఏళ్ళక్రితం ప్రముఖ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ వ్రాశారు కూడా.

అంబేద్కర్, పూలే వంటి మహాశయులు మనల్ని మనం సంస్కరించుకోవాలని కోరుకున్నారే గానీ, పరాయి మతాల దాడులని ఆశించలేదు, ద్వేషాలతో వర్గవైషమ్యాలు కొనసాగాలని భావించలేదు. అలాంటి స్థితిలో- రాజ్యాం గం కల్పించిన అనేక విధానాలతో ఈ దళిత వర్గాలవారు ఉన్నత పదవులను, ఆర్థికంగా ఉన్నతిని సాధించారు. అందుకే పై వార్త ప్రకారం- ‘దళిత అధికారులు, ప్రముఖులు’ కూడా సభలు నిర్వహించగలిగారు.

దేశంలో ఒక మతం నశించాలి- అంటూ మరొక మతంవారు సభ పెట్టి చెబితే, ‘అది రాజ్యాంగ విరుద్ధం’-అని కూడా అనలేనంత అణచివేత స్థితిలో హిందూ జాతి ఉంది. హిందువులు సభ పెట్టి- ‘‘ఈ దేశంలో ఇతర మతాలు ఉండరాదు’’ అని ఏనాడూ అనలేదు, అనలేరు. కలిసి బ్రతకడం వీరి స్వభావం, ఔదార్యం. మార్పిడులు, మారణహోమాలు వీరి సిద్ధాంతంలో లేవు. ‘‘ఫలానా మత గ్రంథాలకు వ్యతిరేకంగా హిందూ మేధావులు రచనలు చేయాలి’’అని హిందూ పెద్దలు ఏనాడూ తీర్మానాలు చేయలేదు.

హిందూ వ్యతిరేకులైన జంట మతాలు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నా, సహిస్తున్నారు గానీ ఎదురు తిరగడం లేదు. అసలు స్వాతంత్య్రోద్యమ కాలంలో, తదనంతరం కొంతకాలం వరకు ‘హరిజనులు’గా హిందూ సమాజ వాహినిలో అంతర్భాగమై ఎదగవలసిన జాతిని ‘‘దళిత’’అనే శబ్దంతో వ్యవహరించవలసిన అవసరం ఎలా ఏర్పడింది?- ఎవరైనా ఆలోచించారా?

వారు హైందవ సమాజంలో అంతర్భాగం గాకుండా చీల్చి వేరుచేయడానికి ఈ ‘దళిత’శబ్దం వాడబడింది. నిజానికి అగ్రవర్ణాలవారు కొందరు పూర్వ సమాజంలో కొన్ని వైషమ్యాలను అవలంబించిన మాట వాస్తవమే. అది ఆనాటి సామాజిక వ్యవస్థలో కొందరు వ్యక్తుల స్వార్థంవలన ఏర్పడిన ఒక దోషం. అంతేకానీ అది మతంలోని లోపం కాదు. ఆ దోషాన్ని నిర్మూలించే ప్రయత్నాలు జరుగుతూ, హైందవ జాతి సమైక్యమవుతుంటే తట్టుకోలేని మతమార్పిడిదారులు కల్పించిన పదం ఈ ‘దళిత’శబ్దం (రాజీవ్ మల్హోత్రా రచించిన ‘బ్రేకిం గ్ ఇండియా’ గ్రంథాధారంగా).

క్రైస్తవుల మార్పిడి ధోరణి నచ్చని బౌద్ధుడైన అంబేద్కర్ వంటివారిని ఈ కుట్రలో వాడుకుంటూ- విదేశీ మత మార్పిడి సంస్థలు ధనమదంతో చేసిన ఒక మహావ్యూహంలో భాగాలే పైన చెప్పిన ప్రొఫెసర్, తదితర మత ప్రముఖులు. ఈ ప్రొఫెసర్ వంటివారు గతంలో ‘‘మీ ఆలయాల్లో దళితుల్ని పూజారులుగా, పీఠాధిపతులుగా పెడతారా?’’అని ప్రశ్నిస్తుంటారు. కానీ వారికి హిం దూ మత స్వరూపం అర్థంకాలేదు. అన్ని మతాలవలె హిందూ మతం ఉండాలనుకోవడం పొరపాటు. అసలు ఏ మతం ప్రత్యేకత దానిదే. ఆయుర్వేదంలా అల్లోపతి ఉండదు. అలాగని వాటిలో ద్వేషాలు లేవు.

ఆలయ నిర్వహణకి కావలసిన ఆచారం, విజ్ఞానం, కఠోర నియమాలు, ఆహార వ్యవహారాలు కుటుంబ పరంపరగా అలవాటవుతాయి, నేర్పబడతాయి. అందుకు ఆ బాధ్యత వారికి అప్పగించారు. పీఠాధిపత్యానికి ఉండవలసిన దీక్షావిధానాలు కూడా అటువంటివే. హిందూ మతానుయాయికి పూజారి కావడమో మఠాధిపతి కావడమో లక్ష్యం కాదు. ఒక భక్తుడిగా, జ్ఞానిగా, యోగిగా పరిణమించడమే లక్ష్యం.

దళితులను హిందూధర్మాన్ని అధ్యయనం చేయనివ్వకుండా, చరిత్రను తెలియనీయకుండా, భారతజాతిలో పరస్పర సౌమనస్య స్థితి భంగపడేలా కేవలం ద్వేషాల్ని రెచ్చగొడుతున్న ఈ ధోరణులు సమాజ క్షేమాన్ని ఆశించే అందరూ ఖండించాలి. ఈ క్రైస్తవ మత మార్పిడి చరిత్ర అనేక దేశాల్లో హింసతో, రక్తపుటేరుల్ని పారించింది. వారి దేశాల్లో అనేక జాతుల్ని పశువులకంటె హీనంగా హింసించిన వైనాన్ని చరిత్రలో చెరగని యధార్థాలు.

ఇప్పటికీ, అభివృద్ధిచెందిన వారి దేశాలలో వైషమ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటివారు మన దేశంలోని వైషమ్యాలను ఎత్తిచూపించడం గురివింద గింజ తంతు. ఇవన్నీ విదేశీ మత సంస్థల హస్తోదకంతో వెళ్ళమారుతున్నవే. కొందరు భూస్వాములు ధన, అధికార మదంతో నిమ్నజాతుల్ని హింసించారు. అది మత దోషం కాదు. మరి - సదరు బ్రాహ్మణుడు కేవలం శుచి, సదాచారం పేరుతో దూరం గా ఉన్నాడు.

బ్రాహ్మణుడు మడికట్టుకుంటే తన కొడుకును కూడా దగ్గరకు రానీయడు.

అదొక సమాచార వ్యవస్థ. దానిలో ద్వేషం ప్రసక్తి ఏముంది? కానీ ఇతరుల్ని ఆదుకోవడంలో తమ పరిధిని పాటిస్తూనే, ఎందరి పట్లనో సానుభూతి చూపించారు.
అంబేద్కర్ అసలు పేరు భీమ్‌రావు. ‘అంబేద్కర్’ అనేది బ్రాహ్మణ కుటుంబాల్లో గృహనామం. (శాస్ర్తీ, మిశ్రా, శర్మ- వలె) ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్‌రావ్‌ను చేరదీసి తన ‘అంబేద్కర్’ ఉపనామాన్ని అతని పేరుతో కలిపాడు. ఇది వాస్తవ చరిత్ర. కులాలకు అతీతులైన దేవతలనీ, ఋషులనీ, వారి గ్రంథాలనీ- కూడా కేవలం కులం కళ్ళద్దాలతో పరిశీలించి ద్వేషాన్ని జ్వలింపజేస్తున్నారు.

చట్టం కల్పించే సౌకర్యాలను అడ్డంపెట్టుకొని, ఆవేశకావేషాలతో అల్లరిచేసే విధంగా ప్రేరేపిస్తున్నారు. గతంలో వారు హింసించారు, అణచివేశారు కనుక, ఇప్పుడు వారిని మనం హింసించాలి, అణచాలి- అనడం ప్రతీకార ధోరణే కానీ, పరిష్కార పద్ధతికాదు. అదే ధోరణి స్వీకరించినట్లయితే- స్వాతంత్య్రానికి పూర్వం ఎందరో హిందువుల్ని ఊచకోతకోసి, హిందూ స్ర్తిలను మానభంగాలు చేసి, గ్రంథాలని తగలబెట్టి, ఆలయాలు ధ్వంసంచేసి రక్తసిక్తం చేసిన ముస్లిం, క్రైస్తవ పాలకులు, వారి వర్గాలు ఆచరించిన దౌష్టాన్ని దృష్టిలో పెట్టుకొని నేడు ముస్లిం, క్రైస్తవ సోదరులను ద్వేషించి దూరంచేసుకోలేదు హిం దూ జాతి.

గతంలో వారు చేసినదానికి, నేడు బ్రతుకుతున్నవారు ఎలా బాధ్యులౌతారు?- అనే ఉదాత్త్భావంతో వ్యవహరించింది. హిందూ ఛాందసవాది కూడా మత మార్పిడిని సహించడు కానీ, మతాలను గౌరవిస్తాడు. ‘్భరతదేశంనుండి హిందూ మతం పోవాల’ని సభలు చేయడం నాగరిక సమాజం, రాజ్యాంగం క్షమించరాని నేరం.

నీ మతం గురించి చెప్పుకోడానికి, ఇతర మతాల నిర్మూలన ప్రసక్తిదేనికి? ‘కులాలు లేని మతం మాది’అని గర్వంగా చాటుకొనే అన్యమతాలకి ఈ కులాల ప్రస్తావన ఎందుకు?
పుష్కరాలకు వెళ్ళరాదని పిలుపునిచ్చిన ఈ ‘మత మార్పిడి’ వ్యాపారుల అసలు బాధ- ఈ పుష్కరాల వంటి మహత్సందర్భాలలో సంఘటితవౌతున్న హిందూ సమైక్యతను సహించలేకపోవడమే.

మత మార్పిడికి రాజద్వారాలు తెరచిన క్రైస్తవ రాజకీయ నాయకులు కూడా పుష్కర స్నానాలు చేసి, తర్పణాలు వదిలారు కదా? వారిని ఆపలేకపోయారా? ఎన్ని సభలు చేసి, పుస్తకాలు ద్వేషాలను రెచ్చగొట్టినా- ఋషుల తపశ్శక్తితో ఉద్భవించిన నిత్య సనాతన హైందవ ధర్మం చెక్కుచెదరదు

http://andhrabhoomi.net/content/main-feature-1

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...