Monday, December 12, 2016

శివకేశవులు చమత్కార శ్లోకం

అనగనగా ఒక రామ భక్తుడు . రాముడంటే వల్లమాలిన ప్రేమ . పోనీలే అని విష్ణువన్నా నమస్కరిస్తాడు .
శివుడి పేరు ఎత్తడు .
ఒక సారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇమ్మన్నాడు .
ఆ పెద్దాయనకీ తెలుసు ఇతడికి శివుడు అంటే పడదని . సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు .
విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను . మీ విష్ణువు సంతోషిస్తాడు చదువుకో అంటూ .

గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః
లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః  పరమేశ్వరో నః

ఆశ్చర్య పోయాడు చదవగానే .
అందులో ఏమని చెప్పబడింది ? పరమేశ్వరః నః పాయాత్  అని . అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు . అర్ధం చూడండి :
గవీశపాత్రః .... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం . అది వాహనం గా కలవాడు గవీశపాత్రః . అంటే సదాశివుడు .
నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే . 
కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్ధమ్... కుమారస్వామి యొక్క తండ్రి అయిన వాడూ , శివుడే నిస్సందేహంగా .
శశి ఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.
లంకేశ సంపూజిత పాద పద్మ: లంకాధిపతి అయిన రావణుని చే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 
అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ .
అటువంటి....  పరమేశ్వరః నః పాయాత్ ....   
వృషభ వాహనుడూ , పార్వతీ పతి , కుమార స్వామి తండ్రీ , చంద్రశేఖరుడూ , రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం .

అర్ధం తెలియ గానే మతి పోయింది . వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది .
అది పట్టుకుని తెగ తిరిగాడు .
చివరికి ఒకాయన అది విష్ణువుని కీర్తించేదే  ... ఏమీ అనుమానం లేదు అని అతడిని ఓదార్చాడు .
ఇది మరో ఆశ్చర్యం .

అనాది అనే మాటలో ఉంది అంతా .
కిటుకు చూడండి .... పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట . అంటే ఆది లేని వాడు . అంటే పరమేశ్వర లో ఆది అక్షరం లేనివాడు .
ఇప్పుడు ఏమయ్యింది ? రమెశ్వరః అయ్యింది . అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా !
గవీశపాత్రః... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది . విః  అంటే పక్షి అని అర్ధం . వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు , ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు .
నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు .
కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు .
శశి ఖండ మౌళి: ... మొదటి అక్షరం లేక పోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు .  
లంకేశ సంపూజిత పాద పద్మ:... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ:... క అంటే బ్రహ్మ , ఈశః  అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేన్ద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు .
అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ , గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ , మన్మధుని తండ్రీ , నెమలి పింఛము దాల్చిన వాడూ , బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .
ఇప్పటికి అతడు శాంతించాడు.
సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి . సర్వదెవతలలొ  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు . సర్వ దేవతలలో శివుని 
దర్శించగలిగితే వాడు  శైవుడు .
అందమైన ఈ శ్లోకపు కర్త తెలియదు .

(ముత్యంపేట మల్లికార్జున్ గారి సౌజన్యంతో)

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...