సంకట విమోచన సపోటాలు
ఒకసారి ఒక కుర్రవాడు చుట్టచుట్టుకొని పడుసున్న తాచుపాముపై పొరపాటున కూర్చున్నాడు. అయినా అదేం చిత్రమో, ఆ పాము పిల్లవాడిని ఏమీ చెయ్యకుండా నెమ్మదిగా అవతలకు వెళ్ళిపోయింది. మరోసారి ఆ పిల్లవాడే నదిలో స్నానం చేస్తూ మునిగిపోయాడు. అదృష్టవశాత్తు దగ్గరెవరో ఉండి అది చూసి ఈదుకుంటూ వెళ్ళి అతణ్ణి రక్షించారు. ఇంకోసారి ఈనిఉన్న పందొకటి అతడి వెంబడి పడింది. ఏదో అదృశ్య శక్తి కృప వల్ల ఈసారి కూడా అతడే అపాయమూ లేకుండా బయటపడ్డాడు. ఇలా ఎన్ని గండాలో రావటం తేలిపోవటం జరిగాయి. ఈ గండాలు తప్పిపోవడానికి సపోటా పండ్లకు ఏదైనా సంబంధం ఉందా?
అమలాపురం దగ్గర మామిడిపల్లి అగ్రహారంలో జగద్గురువులు పరమాచార్యకు చిట్టెన్నగారనే భక్తుని ఇంట భిక్ష. భిక్ష అయిన తరువాత స్వాములవారు చిట్టెన్నగారి వీధిలో కూర్చున్నారు. భక్తులలో కొందరు వీధిలోనుండే నమస్కారం చేస్తున్నారు. మరికొందరు బజారులోనే సాష్టాంగపడి స్వాములవారికి ప్రణామం చేస్తున్నారు. ఇంతలో స్వాములవారి శిష్యులూ, వృద్ధులూ అయిన శ్రీ సుబ్రహ్మణ్యేంద్ర భారతిని నెమ్మదిగా పట్టుకొని లోపలకు తీసుకొని వచ్చాడు, ఆ ఊళ్ళోని బ్రాహ్మణులొకరు ఆయన వెంట ఆయన కొడుకు ఆరేళ్ళ వాడు కూడా ఉన్నాడు.
స్వామి వారా కుర్రవాణ్ణి చూసి ‘నీకేమన్నా పద్యాలు వచ్చా’ అని అడిగారు. అతడు ‘ఆ!’ అన్నాడు. ‘చదువు’ స్వామివారి ఆదేశం. అతడు బెరుకు లేకుండా పోతనగారి భాగవతంలో ప్రహ్లాద చరిత్ర నుండి ‘కంజాక్షునికి గాని కాయంబు కాయమే’ అన్న పద్యం చదివాడు. ఆరేళ్ళ కుర్రవాడా పద్యాలు చక్కగా చదువుతుంటే స్వాములవారికి ముచ్చట వేసింది. ఆ అబ్బాయి ఒడిలో ఆయన ఒక సపోటా పండు వేశారు. తరువాత ఇంకో పద్యం చదవమన్నారు. అతడు చదవటం, వీరు ఒక సపోటా వేస్తుండటం ఇలా క్రమంగా అతని ఒడి సపోటాలతో నిండింది.
ఇంతకూ వాళ్ళ నాన్న ఆ అబ్బాయినక్కడకు తీసుకొని వచ్చింది ఎందుకంటే తనకు సంతానం పుట్టి పోతున్నారు కాని నిలవటం లేదు. వీడికయినా స్వామివారేదయినా రక్షకడతారేమో అడగాలని. అయితే అతనేదీ అడక్కుండానే ఆ పిల్లవానికి స్వామివారి ఆశీస్సులు ఒడినిండా సపోటా రూపంలో దండిగా లభించాయి.
ఆ తరువాత తనికి మొదట చెప్పిన గండాలెన్నో వచ్చాయి. కాని అతని సిగపూవువాడలేదు. స్వామివారు ఆనాడు అతని ఒడిలో నింపిన సపోటాలు ఒక్కొక్కటి ఒక గండానికి అడ్డుకట్టా? ఏదయితేనేం. అతని భవిష్యత్తు ఆచార్యుల ఆశీస్సులతో పండింది.
ఆ కుర్రవాడే సుప్రసిద్ధ రచయిత, పండితుడు శ్రీ బులుసు సూర్యప్రకాశశాస్త్రి. తెనాలిలో ‘సాధనా గ్రంథమండలి’ స్థాపించి శ్రీవారి ఉపన్యాసాలను పది సంపుటాలుగా ప్రచురించింది వీరే. శంకరగ్రంథరత్నావళియని ఆది శంకరుల చరిత్రను, రచనలను కూడ 13 సంపుటలుగా ఆయన వెలువరించారు.
--- “శ్రీ కంచి పరమాచార్య పథం” పుస్తకం నుండి
(రాజశేఖరుని విజయ్ శర్మ గారి సౌజన్యంతో)
No comments:
Post a Comment