Friday, November 23, 2018

గుడిమల్లం

చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తిలోని ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము. చారిత్రకంగా చాల ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలంనాటి పురాతన శివాలయం వుంది. ఇది క్రీ.శ. 1 లేదా 2 శతబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. పురావస్తు శాస్తజ్ఞ్రుల పరిశోధన ప్రకారం గుడిమల్లంలోని శివాలయం క్రీ. పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. భారత పురావస్తు శాఖ . క్రీ.శ. 1973లో జరిగిన త్రవ్వకాలలో ఈ ఆలయాన్ని జాతీయసంపదగా గుర్తించింది. ఈ ఆలయనిర్మాణానికి వాడిన రాతి ఇటుకలు   42+21+6  సెంటీమీటర్ల సైజులో  ఉండటం వలన దీన్ని ఆంధ్ర శాతవాహనుల కాలంలోని అంటే 1,2 శతాబ్దాల నాటి నిర్మాణంగా గుర్తించడం జరిగింది.

శాసన ఆధారాలు:-
దేవాలయ గోడలమీద పల్లవ, గంగపల్లవ. బాణ, చోళరాజుల శాసనాలు కన్పిస్తున్నాయి. ఇవి ఎక్కువగా తమిళభాషలో ఉన్నట్లు శాసన పరిశోధకులు గుర్తించారు. అందరూ స్వామికి విశేష దానాలు  సమర్పించిన వాళ్లే. వాటిలో  ప్రాచీనమైనది క్రీ.శ 802 లో పల్లవరాజు నందివర్మ వ్రాయించిన శాసనం. కాని ఇన్ని శాసనాల్లో వేటిలోను గుడిమల్లం పేరు ప్రస్తావించబడలేదు. ఈ గ్రామం పేరును విప్రపిట(బ్రాహ్మణ అగ్రహారం) అని మాత్రమే  శాసనాల్లో పేర్కొనడం జరిగింది. ఎన్నో శాసనాలు గుడిగోడల మీద, ఆలయప్రాంగణంలోను మనకు కన్పిస్తాయి. కాని దీన్ని నిర్మించిందెవరో ఒక్క శాసనంలోను ప్రస్తావించబడలేదు. కాని స్వామి వారికి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం  ధనాన్ని,  భూములను, అఖండ దీపారాధనకు ఆవులను కొల్లలుగా దానం చేసినట్లు శాసనాధారాలు లభిస్తున్నాయి. అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియరావటం లేదు. అయితే ఉత్తర్రపదేశ్‌లోని మధురలో ఉన్న మ్యూజియంలో క్రీ.పూ. ఒకటవ శతాబ్దానికి చెందినది అంటూ ఒక లింగాన్ని భద్రపరచారు. అది ఈ గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది. అలాగే ఉజ్జయినిలో క్రీ.పూ. మూడవ శతాబ్దానికి చెందినవిగా భావించే కొన్ని రాగి నాణలు దొరికాయి. వాటిపై ఉన్న చిత్రం అచ్చు గుడిమల్లం శివలింగమే. ఇక ఆలయంలోని శివలింగాకారం. ఇది చిత్రంగా, మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది. దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటుంది. మంగోలులని పోలిన ఈరూపం ఖజురాహోలా కూడా కనిపించడం విశేషం. ఆంధ్రశాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా భావిస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతున్నది.

దేవాలయ చరిత్ర...
ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడుచేసారు. కాకుంటే మూలవిరాట్‌ స్వామికి మాత్రం హాని కలగలేదు.

గుడిమల్లం శివలింగ విశిష్టత...
గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశు రామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం, ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగరూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలే ఉన్నాడు. ఈ లింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన(స్థానకమూర్తి) రూపంలో అతి సుందరంగా ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు.
ప్రక్కన ఉన్న లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలస్ లోనిది. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకోగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రం) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రం మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రం అతి సున్నితమైనది అన్నట్లుగా అందులో నుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్థంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

స్థలపురాణం :- పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించాడు. మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు. కాని  తల్లిని చంపిన నందుకు అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చిత్తం కోసం, ఋషుల సలహా ననుసరించి శివుణ్ణి ఆరాధించడానికి బయలుదేరాడు. అత్యంతప్రయాసతో అడవి మధ్యలోని ఈ శివలింగాన్ని దర్శించాడు. ఈ ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్మించుకొని, దాని ఒడ్డునే తపస్సు ప్రారంభించాడు. ఆ సరోవరంలో ప్రతిరోజూ ఒక్క పుష్పమే పూసేది. దాన్ని శంకరునికి పూజాసమయంలో సమర్పించేవాడు పరశురాముడు. అడవి జంతువులనుండి ఆ సరోవర పుష్పాన్ని కాపాడడానికి చిత్రసేనుడనే  ఒక యక్షుని కాపలాగా నియమించాడు పరశురాముడు. దానికి బదులుగా ఆ  యక్షునకు ప్రతిరోజు ఒక జంతువును, కొంత పానీయాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

ఈ ఆలయం పశ్చామాభిముఖంగా ఉంటుంది. కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మిత మైంది. గర్భాలయంపై కప్పు గజ పృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ''తిరువిప్పరమ్‌ బేడు'' అని పిలిచినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో 'శ్రీ విప్రపీఠం' అంటారు. పల్లవుల నిర్వహణ లోకి వచ్చాక ఇది గుడిపల్లమైంది. కాలక్రమంలో అదే గుడి మల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది.
తిరుపతికి గానీ, రేణిగుంటకి గానీ రైల్లో చేరుకుంటే తిరుపతి నుంచైతే 22 కి.మీ., రేణిగుంట నుంచైతే 11కి.మీ. రోడ్డు ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకోవచ్చు. అయితే ఇక్కడ సుప్రసిద్ధ ఆలయాల్లో మాదిరి ఉండేందుకు వసతి, హోటల్స్‌ లాంటివేమీ లేవు. మంచినీళ్లతో సహా మనమే తీసుకుని వెళ్లాలి.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...