*మాణిక్య సోమయాజులు గారి గురించి*
...
గంభీరమైన వేదార్థానికి తేలిక పదాలతో కథారూపమిచ్చే వాగ్మి! తెలంగాణలో ఏకైక సోమయాజి.. వేలాది శిష్య పరంపర కలిగిన గురువరేణ్యుడు..మాణిక్యసోమయాజులు! పేరుకు తగ్గట్టుగానే నిరాడంబరం, నిస్వార్థం సహజలక్షణాలుగా వెలుగుతున్న మణిమాణిక్యం ఆయన! నడిచే వేద నిఘంటువు.. తెలంగాణ గర్వించదగ్గ ఆ విద్వదాహితాగ్నితో నేటి ములాఖత్.....
వేదవిద్య క్షీణిస్తున్న నేపథ్యంలో యుగయుగాల పరంపరను కొనసాగించాలనే తపనతో క్లిష్టమైన సనాతన వైదిక సంస్కృతిని పరిరక్షిస్తున్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి. అందులో ఒకటే మాణిక్య సోమయాజులు కుటుంబం. వైదిక ధర్మాన్ని బతికించుకోవాలనే తన తల్లి ఆరాటాన్ని అర్థం చేసుకుని... ఆ ఆశయాన్ని సాధించే దిశగా ఎదురైన కష్టాన్ని ఇష్టంగా మలచుకుని.. నిస్వార్థంతో స్వధర్మాన్ని ఆచరణలో పెట్టి జీవనయానం కొనసాగిస్తున్నారు మాణిక్యం సోమయాజులు. వైదికమార్గంలో తాను నడవడమే కాక వందల మంది శిష్యులనూ నడిపిస్తున్నారు. ఆ సాధన మార్గం ఆయన మాటల్లోనే...
నైజాంవారికి ప్రవేశం లేదని....
‘తరతరాలుగా వైదిక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబం మాది. మా ముత్తాతగారు గంగాధర దీక్షితులు, తాతగారు రామకృష్ణ సోమయాజులు. పూర్వం కొంశట్‌పల్లి అనే గ్రామంలో నివసించేవారు. ఇష్టికి ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దొరకడం కష్టంగా ఉండడంతో అక్కడి నుంచి కోహీర్‌కు, మళ్లీ అక్కడి నుంచి పట్లూర్‌కు వలస వచ్చారు. పూర్వం నుంచే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వేదాధ్యయనం, వేదవిహితకర్మలు, ఇష్టిని మాత్రం మా వంశం విడవకుండా కొనసాగిస్తుండేది. మా ముత్తాత, తాతగార్ల తర్వాత మా తండ్రిగారు పురుషోత్తమ సోమయాజులూ అదే పరంపరను కొనసాగిస్తూ వచ్చారు. మా నాన్న కృష్ణయజుర్వేద క్రమాంతం, మీమాంసా వ్యాకరణంలో పండితులు. ఇక మా తరానికి వస్తే పదమూడు మంది సంతానంలో నేనే చివరివాడిని. నాకు రెండు నెలల వయసున్నప్పుడే నాన్నగారు పరమపదించారు. అంతమంది సంతానంలో ఒక అన్న, అక్క, నేను మాత్రమే మిగిలాం. నాన్న గతించడంతో మా మేనత్త భర్త అల్వాల్ రామశాస్త్రి గారు మాకు ఉపనయనం చేసినారు.
మా అమ్మ జనాబాయి వేదవిచ్ఛిత్తి.. వేదీ విచ్ఛిత్తి కాకుండా మా అన్న నరసింహశర్మను అల్వాల్ రామశాస్త్రి గారి వద్ద వేదాధ్యయనానికి పంపింది. కానీ అక్కడ వేదాధ్యయనం పూర్తవుతుందో లేదో అన్న అనుమానంతో నన్ను, అన్నను తీసుకొని ఆంధ్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకొంది. రజాకార్ల అల్లర్లు జరుగుతున్న సమయం అది. అయినా పట్టుదలతో పిల్లలకు వేదాధ్యయనం చేయించాలని గుంటూరు జిల్లాకు తీసుకు సత్తెనపల్లి తాలూకా చవటపాపయ్య పాలెం అగ్రహారంలో ‘బ్రాహ్మణ గురుకులాక్షిశమం’లో నన్ను, అన్నను చేర్చుకొమ్మని అమ్మ అర్థించినా అక్కడి వారు నిరాకరించారు. ‘నైజాం ప్రాంతం వారికి ఇక్కడ ప్రవేశం లేదు’ అని చెప్పారు. కానీ అమ్మ పట్టువిడవకుండా ఎన్నో ధర్మసూకా్ష్మలు, సోమయాగం, ఇష్టి గురించి పాఠశాల ఆచార్యులు ముదిగొండ వెంకటరామశాస్త్రితో చర్చించింది.
అమ్మకున్న అవగాహన తెలిసి ఆశ్చర్యపోయారు. ఆమె పట్టుదలకు ముగ్ధులైన ఆయన మిగతా సభ్యులు, అధ్యాపకులతో చర్చించి ‘ఒక ఆడమనిషి దేశంకాని దేశం వచ్చి వేదాధ్యయనం కోసం అర్థించినప్పుడు ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టకపోతే వేదమాతను అవమానించినవారమవుతామ’ని గట్టిగా చెప్పడంతో అందరూ సమ్మతించారు. అలా పాఠశాలలో మాకు ప్రవేశం కల్పించారు. పాఠశాలలో సంహితమావూతము అధ్యయనం ఇంకా నాలుగు పన్నాలు మిగిలి ఉన్న సమయంలోనే మా అక్క అనారోగ్యంతో మరణించింది. అక్కడి నుంచి బాపట్ల వెళ్లి పొదిల సత్యనారాయణ అవధాని దగ్గర ఆ నాలుగు పన్నాలు, అ తర్వాత అనంతవరములో గొల్లపూడి మధుసూదన అవధాని వద్ద పధ్నాలుగు పన్నాలు పదం చెప్పించింది అమ్మ. అక్కడి నుంచి రేపప్లూలో తూములూరి సుబ్బావధానులు వద్ద పదక్షికమాలు, బ్రాహ్మణ, అరణ్యకాలు, ఉపనిషత్తులు పూర్తిచేయించింది. అప్పుడే క్రమాంతం పూర్తయిన అన్న నర్సింహ్మావధాని స్వర్గస్తులైనాడు.
ఆ సంఘటనతో భయపడ్డ నేను మన ఊరికి వెళ్లిపోదామని అమ్మను ప్రాధేయపడ్డాను. కానీ అమె నా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రాగాన్ని వదిలి కఠిన నిర్ణయం తీసుకొంది. ఈ సందర్భంగా ఒక్కటే మాట అంది.. ‘వచ్చిన కార్యం పూర్తికాకుండా, అంటే వేదాధ్యయనం చేయకుండా పోవడం కన్నా ఇక్కడే మరణించడం మేలు’ అని. నేటికీ ఆ మాటే నా మనసులో మార్మోగుతుంటుంది. చదువుపట్ల ఆమెకున్న దృఢసంకల్పం వల్లే నేను ఈనాడు ఈ స్థితికి రాగలిగాను. ఆ తర్వాత క్రమాంతం పూర్తి చేసుకొని విజయవాడ కౌతాపూర్ణానందం వేదశాస్త్ర సభలో క్రమాంత పరీక్షలో ఉత్తీర్ణుడినై సొంత ఊరికి చేరుకొన్నాం. అప్పటికి నాకు 17 ఏళ్లు. తర్వాత కర్ణాటకలోని హమ్నాబాద్ పక్కన ఉన్న ఖేనేరంజోల్‌కు చెందిన రామచంవూదభట్ గారి అమ్మాయి లలితతో నాకు పెండ్లి అయింది. ఏండ్లు గుడుస్తున్నయి, వేదాధ్యయనం పూర్తయింది కానీ పరంపరంగా వస్తున్న అగ్నిహోత్రం పునఃవూపారంభించాలన్న మా అమ్మ సంకల్పం నెరవేరలేదు. దాంతో ప్లవంగ నామ సంవత్సరంలో సోమపూర్వక పర్వాదానము (సోమయాగాన్ని) చేయించింది.
హిమాలయాల్లో మాత్రమే...
సోమయాగం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని సోమలతతో చేస్తారు. ఈ తీగ కేవలం హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ తీగ పాడ్యమి నాటి నుంచి పౌర్ణమి వరకు ఒక్కో కళను సంతరించుకొని పూర్ణకళతో శోభిస్తుంది. తర్వాత పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక్కోకళను కోల్పోతుంది. గీతలో శ్రీకృష్ణుడు రసాల్లో ‘నేను సోమరసం’ అని చెప్పాడు. సృష్టిలో అన్నింటికి ఇది ప్రధానమైంది. క్రమాంతం పూర్తయిన నాటి నుంచి సోమయాగం(నా 26వ యేట అంటే 1967లో) చేసే వరకు నేను కటిక దారివూద్యాన్ని అనుభవించాను. ఎన్నో రోజులు తినడానికి తిండి దొరకక, సంకటితో కాలం వెళ్లదీశాం. అయినా వైదిక ధర్మాచారాన్ని, అగ్నిహోవూతాన్ని మాత్రం విడువలేదు. నేటికీ అది కొనసాగుతుందంటే అమ్మ ఆశీస్సులే. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుందన్న నానుడి నా విషయంలో అక్షరాల నిజం.
అమ్మ నిరంతర తపన, ఆమెకు శ్రౌతకర్మయందు ఉన్న ఆసక్తే నన్ను ముందుకు నడిపిచింది. ఆ తర్వాత విశ్వనాథశాస్త్రిగారి ఆధ్వర్యంలో ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో ప్రారంభమైన ‘పురోహిత బ్రాహ్మణ వేదపా శివంపేటలో ఆచార్యులుగా పనిచేశాను. వందలాది మంది శిష్యులకు వేదాన్ని నేర్పించాను. ఆ శిష్య పరంపర నేడు వందల నుంచి వేలకు చేరుకుంది. అదే నాకు సంతృప్తినిస్తుంది. వేదాధ్యయనం, వైదికధర్మ సంరక్షణ, ఇష్టి, నిత్య అగ్నిహోత్రం ఇవే ప్రతిమనిషి చేయాల్సిన కర్మలు. సదాచారాలతో జీవనం గడిపితే దేశం సుభిక్షంగా ఉంటుంది. లోకంలో అన్నీ గొప్పవే. ప్రతి ఒక్కరూ దైవస్వరూపమే. ‘వేదేభ్యో అఖిలం జగత్తు’.. వేదాల్లో అన్నీ ఉన్నాయన్నది సత్యం. పాలల్లో నెయ్యి ఉన్నట్లే వేదాల్లో అన్నీ దాగున్నాయి.
ఆ రోజులే...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి హైదరాబాద్ మాత్రం ఇంకా ప్రత్యేక దేశంగా కొనసాగుతున్న రోజులవి. వేదాధ్యయనం కోసం మేము గుంటూరు వెళ్తున్నాం.. రజకార్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని సైతం తుపాకులతో కాల్చి చంపేసిన సంఘటన నాకు ఇప్పటికీ కళ్లల్లో కనిపిస్తుంది. అదే సమయంలో హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేసుకోవడానికి భారత సైన్యం వచ్చిన సంగతి నాకు బాగా గుర్తుంది. ఇక నాకు తెలిసిన హైదరాబాద్ అంటే... చుట్టు పక్కల రంగాడ్డి జిల్లాలో 20 నుంచి 30 గజాల్లోతులోనే నీళ్లు పడేవి. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక వర్షాలయితే సంవత్సరంలో మూడు, నాలుగు నెలలు కురిసేవి. సస్యవృద్ధి బాగా ఉండేది. నేడు చెట్లను నరకడం, అడవుల పెంపకం నిరక్ష్యం చేయడంతో విపరీత పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ప్రజల్లో నాడు డబ్బుకు ఇబ్బంది ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. పంటలు పండకున్నా, నీళ్లు లేకున్నా ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఆ రోజుల్లో ధర్మాభిమానం ఉండేది. ప్రతి ఇంట్లో ఏడాదికి ఒకసారి అన్నసంతర్పణ చేసేవారు. పంటలు, నీటి విషయంలో ఆ రోజులే మంచిగ ఉండేవన్నది నా అభివూపాయం.
సనాతన ధర్మమే మార్గం...
నేడు ప్రపంచం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. వీటన్నింటికీ వేదాల్లో పరిష్కారాలు ఉన్నాయి. మానవుడు మొదట ప్రకృతిని ప్రేమించాలి. ఏదో సాధించామనే భ్రమలో ఉన్నాడు. కానీ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రకృతి విధ్వంసం, సాటి జీవులపై ప్రేమ, కరుణలేక పోవడం, దురాశ, స్వార్థం మానవుల కష్టాలకు ప్రధాన కారణాలు. వీటన్నింటికి పరిష్కారం ఆధ్మాత్మిక మార్గం. సనాతన వైదికధర్మం పాటిస్తే అందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు.
బిరుదులు.. సత్కారాలు
విజయవాడలో విద్యావిభూషణ, ఢిల్లీలోని పెదజీయర్‌స్వామి వారు వేదవిద్వాన్, వర్గల్‌లో వేదభారతి, తెలంగాణ సభలో ఆచార్య చూడామణి, కరీంనగర్‌లో బ్రాహ్మీభూషణ, భాగ్యనగరములో వేదపయోనిధి ఇలా పలు ప్రాంతాల్లో జరిగిన వేదసభల్లో పలు సత్కారాలు, బిరుదులను నాకు ప్రదానం చేశారు’ అంటూ తన జీవన ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు.
ఎంతోమందికి ఆదర్శం...
మిడిమిడి జ్ఞానంతో అలంకార భూషణల ఆడంబరాలతో పండితులు అని పిలిపించుకొనే నేటి రోజుల్లో... నిండుకుండ తొణకదు అన్నట్టుగా కృష్ణయజుర్వేదాన్ని ఔపోసన పట్టి, వేదానికి భాష్యం చెప్పగలిగిన మాణిక్య సోమయాజులు అతిసాధారణ జీవితాన్ని గడపడం అందరికీ ఆదర్శవూపాయం. ‘ఇదం శరీరం పరోపకారం’ అన్న సూక్తికి ఆయన అచ్చమైన నిదర్శనం!
వేదం అంటే..
వేదం అంటే జ్ఞానం అని అర్థం. విద్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. విద్ అనే ధాతువుకు విచారణ, ఉండుట, జ్ఞానం, లాభం అనే అర్థాలు ఉన్నాయి. పూర్వం రుగ్వేదంలో 21 శాఖలుండగా నేడు కేవలం 2 శాఖలు లభిస్తున్నవి. అదేవిధంగా యజుర్వేదంలో 101 శాఖలుండగా నేడు 6, సామవేదంలో 1000 శాఖలు ఉండగా నేడు 3, అథర్వణవేదంలో 9 శాఖలు ఉండగా నేడు 2 శాఖలు మాత్రమే లభిస్తున్నవి. మొత్తం మీద నాలుగు వేదాల్లో 1131 శాఖలు ఉండగా నేడు 13 - 17 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి.
దర్శనమ్ చతుర్దశ వార్షికోత్సవం సందర్బంగా భాగ్యనగరం భాగ్యనగరంలోని రవీంద్రభారతిలో నవంబర్ 12 వతేదీ సోమవారం ఉదయం 9 గంటలకు విద్వదాహితాగ్ని, జ్యోతిరప్తోర్యామయాజి , విఖ్యాత వేదం విద్వన్మూర్తి బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు- లలితా సోమిదేవమ్మ పుణ్యదంపతులకు "ధార్మిక వరేణ్య" బిరుదు ప్రదానం , జీవన సాఫల్య పురస్కారం, పల్లకీసేవ
ఆస్తిక మహాశయులందరికీ సాదర స్వాగతం....
No comments:
Post a Comment