Wednesday, October 3, 2018

మన ధర్మంలో విధినిషేధాలు ఎందుకు ?

చారిత్రాత్మక శబరిమల తీర్పుకు అంకితం

మన ధర్మంలో విధినిషేధాలు ఎందుకు ?
ఈ మధ్య చాలా మంది అడిగే ప్రశ్న: మేమెందుకు గర్భగుడిలోకి వెళ్ళలేము? మేమెందుకు మూల విగ్రహాన్ని ముట్టుకోకూడదు? మేమెందుకు వేదం నేర్చుకోకూడదు? పుస్తకాలు కొనుక్కుని మంత్రాలు మేము మాత్రం చదవలేమా?

వీటికి కొంచెం సహేతుకంగా సమాధానపరుద్దాం.ఒక కధ చెప్పుకుందాం.
ఒక రీసెర్చ్ లాబరేటరీ వుంది. దానిలో కొన్ని అణుధార్మిక పదార్ధాలు ఉంచబడ్డాయి. ఆ ల్యాబ్ లోకి వెళ్ళడానికి కొందరికే అనుమతి వుంది. దానిలోకి వెళ్ళాలంటే ప్రత్యేక ట్రైనింగ్, తీసుకోవలసిన జాగ్రత్తల మీద కొంత orientation అన్నీ వున్నాయి. దానిలోకి వెళ్ళడానికి కొంతమందినే ఎంచి వారికి మాత్రమె లోనకు వెళ్ళే అనుమతిని ఇచ్చారు ఆ పరిశోధనా గృహం వారు. ఇంతలో కంచర గాడిదయ్య అనే ఒకడు, అసంతృప్తి దేశదిమ్మరమ్మ అనే మరో మహిళా శిరోమణి ఆ సంస్థ మీద కసితో దీన్ని కొన్ని వర్గాల వారి కుట్ర అని గొడవ చేసి, గగ్గోలు పెట్టి వారు పని చెయ్యని సోమరులు వారిని మాత్రమె ప్రత్యేకంగా అనుమతిస్తున్నారని నానా యాగీ చేసి ఆ సంస్థను అప్రతిష్టపాలు చేసేవారు. చివరికి ఒకరోజు ఆ సంస్థ వారికి మండి వెళ్ళండి, కానీ సరైన ట్రైనింగ్ తీసుకోండని చెప్పారు. అబ్బ చ్చా మాకన్నీ తెలుసులే అని వెళ్లి ఆ గదిని పరిశీలించి అక్కడ వాళ్ళకేమి అర్ధం కాక ఆ పదార్ధాలను అటు ఇటు చూసి పట్టుకుని, మొహం మీద పెట్టుకుని సేల్ఫీలు దిగి కొన్ని టీవీ చానెళ్ళలో తాము చేసిన గొప్ప పనిని అందరికీ తెలిసేలా చేసి ఇన్నాళ్ళు తమను ఎలా అణగదోక్కారో కధలు అల్లి మరీ వివరించారు.కొన్నేళ్ళు బాగానే గడిచాయి. ఆ అణుధార్మిక వస్తువులకు తమవాడు, పగవాడు అని ఏమి తేడా వుండదు. ఇద్దరికీ శుబ్బరంగా కొన్ని అంతు తెలియని వ్యాధులు సంక్రమించాయి. కాన్సర్ అని, మరొకటి అని, ఎన్నో ఆ వస్తువుల దీర్ఘ కాలిక రోగాలోచ్చి చివరికి దేహత్యాగం చేసారు.

మేరీ క్యూరీ అణుధార్మికత మీద పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో విషయాలు కనుక్కుంది. దాని వల్ల శరీరం మీద ఎటువంటి ప్రభావం వుంటుందో వివరంగా చెప్పింది. ఎలా కాపాడుకోగలమో చెప్పింది. కానీ ఆవిడ మాత్రం వాటి మీద పూర్తి అవగాహన సాధించే క్రమంలో ఎంతో దగ్గరగా ఆ రేడియం తో పని చేసింది. దానివల్ల శరీర రుగ్మత కలిగి, కాన్సర్ తో మరణించింది. కానీ ఆవిడ తెలిపిన విధానంతో ఎందరో శాస్త్రజ్ఞులు కాపాడబడ్డారు. ఆవిడ భర్త కూడా అటువంటి రోగానికే ప్రాణం వదిలారు. కానీ వీరి పరిశోధనల వలన ఎన్నో విషయాలు, జాగ్రత్తలు తెలుసుకున్నారు. అటువంటి అన్ని విషయాలు గ్రంధస్థం చేసారు. దాన్ని వారు భావితరాలకు అందించారు. ఆ చెప్పిన విషయాల వలన ఎంతో జాగ్రత్తగా మరింత పరిశోధనలు చేసి యురేనియం, ప్లుటోనియం ఇలా ఎన్నో పదార్ధాలను కనుక్కుని, వాటి ద్వారా అమోఘమైన శక్తిని ఉత్పత్తి చేసారు మన శాస్త్రజ్ఞులు. కానీ దీనికి ఆది మాత్రం క్యూరీ దంపతుల విశేష పరిశోధన, కృషి. వారు ఈ విషయంలో వారు నేటికాలం మహర్షులు.

మన సనాతన ధర్మం గురించి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలిసిన విషయం కూడా ఇంచుమించు ఇటువంటిదే. తమ శరీర సౌఖ్యాలను వదులుకుని తాము ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేసి, తపించి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎన్నో విషయాలు తాము శిష్యులకు తరతరాలుగా బోధించారు. గ్రంధస్థం చేసారు. అవే మనకు పురాణఇతిహాసాలు, ధర్మ శాస్త్రాలు, ఆగమాలు ఇలా ఎన్నో రకంగా ఎన్నో విషయాలను జాగ్రత్తగా అందించబడ్డాయి. వాటిలో ఏ క్రతువులు ఎలా చెయ్యాలో, ఏ విగ్రహ ప్రతిష్ట ఎలా జరగాలో, ఒకడు దేవాలయంలో ఎలా మసలుకుంటే వాడికి మంచిది, ఏది చెయ్యకూడదు లాంటి ఎన్నో విషయాలను పంచుకున్నారు. వాటిని చదవాలన్నా ముందు వారికి కొంత వేదజ్ఞానం వుండాలని నియమం పెట్టారు. ఇదేదో అందరికీ అందించవలసిన విషయాలు కావు, కేవలం ఎవరికైతే అధికారం వుందో వారు మాత్రమె ఈ గర్భగృహ ప్రవేశం చెయ్యాలి అన్న నియమాలను చెప్పారు. అలాగే సామాన్య జనం ఎలా ఉండాలో,వారి పరిధి ఎంతవరకో నిర్ణయించారు. మంత్రశక్తితో అక్కడ దైవీ శక్తిని ఎలా అక్కడకు ఆహ్వానించవచ్చో శాస్త్రం తెలిసిన వారికి తెలుస్తుంది. ఒక గురువు దగ్గర ఎలా మసలుకోవాలో, ఒక దైవం దగ్గర ఎలా మసలుకోవాలో చెబుతుంది శాస్త్రం. తద్విరుద్ధంగా చేస్తే వారు తత్వ్యతిరిక్తమైన ఫలితాలు చవి చూస్తారు. ఒక శాస్త్రజ్ఞుడు చేసే పరిశోధన తెలియని వాడికి ఎలా పిచ్చిగా వుంటుందో, మన క్రతువుల గురించి తెలియని వారికి అలాగే అర్ధం కాదు. అవన్నీ జాత్యహంకారంతో ఇలా వాళ్లకు వాళ్ళే రాసేసుకున్నారని నేడు కొందరు కుహనా మేధావులు దుష్ప్రచారం చేస్తున్నారు. నేడు ఆ గర్భగుడిలోకి వెళ్లామని గొప్పగా చెప్పుకుంటున్నారు. దీని పర్యవసానాలు నేడు తెలియవు. కొన్ని రోజులు ఓపిక పడితే వారి ప్రాభవం మనం చూడకపోము.

ఒక దైవప్రాసాదంలో మడి వుంటుంది, ఆచారం వుంటుంది. అక్కడ ప్రతిష్టితమైన శక్తి కి అనుసరణీయమైన ఒక పద్ధతి వుంటుంది. అవన్నే పాటిస్తేనే అక్కడకు వెళ్ళిన ఫలితం దక్కుతుంది. ఒక యూనివర్సిటీ కి ఎందుకు ఒక స్కూల్ కు వెళ్ళాలంటే ఒక యూనిఫారం వేసుకుని వెళ్తాం. ఒక ముఖ్యమైన మీటింగ్ కు వెళ్ళాలంటే ఎంతో జాగ్రత్తగా తయారవుతాము. అంత భక్తి నమ్మకం వున్నవాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఒక రకం దుస్తులు ధరించాలంటే బాధ ఎందుకు? ఎలాగైతే ఒక యంత్రాన్ని నడపగల టెక్నీషియన్ కు మాత్రమె ఆ యంత్ర గదిలోకి అనుమతి వుంటుందో, ఒక ఆపరేషన్ థియేటర్ లో ఎలా వైద్యం, శాస్త్ర చికిత్స తెలిసిన వైద్యులకు మాత్రమె ప్రవేశం వుంటుందో, యంత్ర తంత్ర మంత్రం ప్రతిష్టితమైన ఒక దేవాలయ గర్భగుడికి కూడా కొందరికే అనుమతి వుంటుంది. అది ఏ వర్ణం వారైనా సరే. బ్రాహ్మణుడు కదా అని అందరు బ్రాహ్మణులకు గర్భ గుడిలో ప్రవేశం వుండదు. ఇది తెలియని కొందరు కేవలం ఇది బ్రాహ్మణ కుట్ర అని అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచినది అన్నట్టు ఒక అర్ధం కాని మూర్ఖుడు మరింత మందిని మూర్ఖత్వంలోకి నేట్టేస్తున్నాడు. తద్వారా దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళకు ఎప్పటికైనా బుద్ధి రావాలని ప్రార్ధిద్దాం.వారికి కొంతైనా జ్ఞానం ప్రసాదించమని కోరుకుందాం.

సర్వే జనా: సుఖినోభవంతు

!! ఓం నమో వేంకటేశాయ !!

!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

స్వీకరణ :
సి.వి.బి. సుబ్రహ్మణ్యం గారు.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...