Thursday, September 13, 2018

కరుణశ్రీ వినాయకుడు

వినాయకచవితి సందర్భంగా *కరుణశ్రీ* జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన అరుదైన ఆణిముత్యాల్లాంటి పద్యాలు:

ఎలుకగుర్రముమీద నీరేడు భువనాల
            పరువెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకములనేలు ముక్కంటియింటిలో
            పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా" యంచు నారాయణుని పరి
             యాచకా లాడు మేనల్లు కుర్ర
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
              నూరేండ్లు నోచిన నోముపంట

అమరులం దగ్రతాంబూల మందు మేటి
ఆరుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ !!

వడకుగుబ్బలి = హిమవత్పర్వతము

తిలకమ్ముగా దిద్ది తీర్చిన పూప జా
          బిలి రేక లేత వెన్నెలలు గాయ
చిరుబొజ్జ జీరాడు చికిలి కుచ్చెల చెంగు
          మురిపెంపు పాదాల ముద్దుగొనగ
జలతారు పూలకుచ్చుల వల్లెవాటుతో
       త్రాచు జందెములు దోబూచులాడ
కొలుచు ముప్పదిమూడు కోట్ల దేవతలపై
         చల్లని చూపులు వెల్లివిరియ

గౌరి కొమరుడు కొలువు సింగారమయ్యె
జాగుచేసినచో లేచి సాగునేమొ!
తమ్ముడా! రమ్ము స్వామి పాదములు కడుగ;
చెల్లెలా! తెమ్ము పువ్వుల పళ్ళెరమ్ము!

కొలుచు వారలకు ముంగొంగు బంగారమ్ము
           పిలుచువారల కెల్ల ప్రియసఖుండు
సేవించువారికి చేతి చింతామణి
            భావించువారికి పట్టుకొమ్మ
"దాసోహ" మనువారి దగ్గర చుట్టమ్ము
             దోసిలొగ్గినవారి తోడునీడ
ఆశ్రయించినవారి కానందమందార
              మర్థించువారల కమృతలహరి

జాలిపేగులవాడు -  లోకాల కాది
దేవుడే మన పార్వతీదేవి కొడుకు!
చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు;
అక్కరో! అర్ఘ్యపాత్ర మిట్లందుకొనవె!

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
          బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టు దువ్వలువలే పనిలేదు
           పసుపు గోచీకే సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు
            పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు
కల్కితురాయీలకై తగాదా లేదు
             గరిక పూజకె తలకాయ నొగ్గు

పంచకళ్యాణికై యల్కపాన్పులేదు
ఎలుక తత్తడికే బుజా లెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టులేదు
పచ్చి వడపప్పె తిను "వట్టి పిచ్చితండ్రి"

కుడుములర్పించు పిల్లభక్తులకు నెల్ల
ఇడుములం దించి కలుము లందించు చేయి;
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి;
తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక!

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...