వివాహము - నిర్వచనము - రకములు
నిర్వచనము: కలిసి నివసిస్తూ తమకు గల లైంగిక హక్కులను అంగీకరిస్తూ మత పరమైన ఆచారాలచే గుర్తింపు పొందిన స్త్రీ పురుషుల సంయోగమే వివాహము.
అష్ట విధ వివాహాలు: హిందూ శాస్త్ర కారులు ఎనిమిది రకములైన వివాహాలను గుర్తించారు. వాటిని అష్ట విధ వివాహాలని అంటారు.
౧. బ్రాహ్మ వివాహము: పెండ్లి కుమార్తె తండ్రి పెండ్లి కుమారుని ఎంపిక చేసుకుని అతనిని తన గృహానికి ఆహ్వానించి తగిన క్రతువులు నిర్వహించి తన కుమార్తె ను వధువుగా అతనికిచ్చే విధానము.
౨ .ప్రాజాపాత్య వివాహము: కన్యా దానానికి ముందుగా కాబోయే అల్లుని తగిన రీతిగా సత్కరించి వధూ వరులిద్దరిని పూనుకొనిపించి (సిద్ధ పరచి ) తరువాత జరిపే వివాహము.
౩. ఆర్ష వివాహము: వధువు తండ్రి పెండ్లి కుమారుని వద్ద నుండి ఆవు ఎద్దుల జంట ను స్వీకరించి తన కుమార్తె ను ఇచి పెండ్లి చేయు విధానము.
౪,దైవ వివాహము: యజ్ఞ యాగాదులొనర్చే వారు తమ కుమార్తెను పురోహితునకిచ్చి వివాహము చేస్తారు. ఇలాంటి వివాహాలు చాలా తక్కువ.
౫. గాంధర్వ వివాహము: వధూవరులిద్దరూ ఒండొరులు ప్రేమించికొని వివాహము చేసుకోవడాన్ని గాంధర్వ వివాహము అంటారు. ఈ పద్ధతిలో స్త్రీ పురుషులకు ఇరువురకూ తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యము కలిగి ఉంటారు. శకుంతలా దుష్యంతుల వివాహమును దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
౬. అసుర వివాహము: కొంత ధనాన్ని వధువు తండ్రికి కన్యా శుల్కముగా ఇచ్చి మారుగా వరుడు పెండ్లి కుమార్తె ను తెచ్చుకొని వివాహమాడటమే అసుర వివాహము. దీనినే కన్యా శుల్క వివాహము అంటారు. భీష్ముడు శల్యుని కి వధు మూలము(Bride Price ) ఇచ్చి అతని సోదరి మాద్రి ని తెచ్చి పాండు రాజుకు వివాహము చేసాడు.
౭. రాక్షస వివాహము: తను వలచిన కన్యను ఎత్తుకొని పోయి గాని , వధువు తండ్రి మొదలగు వారితో యుద్ధము చేసి వారిని ఓడించి గాని వివాహము చేసుకోవడము రాక్షస వివాహము. ఉదాహరణకు శ్రీ కృష్ణుడు రుక్మిణి ని వివాహము చేసుకోవడము.
౮. పైశాచిక వివాహము: నిద్రిస్తు న్నట్టి మరియు మత్తు పదార్థాలను సేవించి ఉన్నట్టి యువతిని బలవంతముగా సంభోగించి వివాహము చేసుకోవడము పైశాచికము. శాస్త్ర కారులు దీనిని చట్ట బద్ధం కాని వివాహము గా పేర్కొన్నారు.ఒక రకముగా ఇది నిషేధించ బడిన వివాహము.
No comments:
Post a Comment