Saturday, May 20, 2017

భార్యను " పరబ్రహ్మము " తో పోల్చిన శ్రీరాముడు

*భార్యను " పరబ్రహ్మము " తో పోల్చిన శ్రీరాముడు !!*

ధర్మార్థకామాః ఖలు తాత! లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు । తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ॥

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకవింశస్సర్గః (౫౬)

కౌసల్యాదేవికి, మరియు లక్ష్మణుకి, శ్రీరామునిపై ఎంత ప్రీతి ఉన్నదంటే శ్రీరాముడంతటి వాగ్విదాంవరునికే వారిని ఒప్పించటానికి ఎన్నోమాటలు పట్టాయి. ఈ మాటలే సుమారు ౪ సర్గలలోని శ్లోకాలుగా మనకందించారు వాల్మీకిమహర్షి! ఈ వాక్చాతుర్యానికి వాల్మీకంతటివాడే పొంగిపోయి, ఉండబట్టలేక, “ఇలా మాట్లాడుట శ్రీరామునికే చెల్లుతుంది” అని తేల్చిచెప్పేశారు. ధర్మం యొక్క ప్రాముఖ్యత, మరియు “భార్యా” అనే పదమునకు నిర్వచమును ఇచ్చే ఈ అద్భుతమైన శ్లోకము శ్రీరాముడు కౌసల్యాసౌమిత్రులతో చెప్పెను..
ఈ శ్లోకార్థమేమనగా “నిస్సందేహముగా ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధపురుషార్థాలకు ధర్మమేమూలము. ధర్మమనే మహావృక్షానికి కలిగే ఫలములే పురుషార్థాలు. పైపెచ్చు అనుకూలవతి, మరియు సంతానవతి, అయిన భార్య పురుషార్థసాధనకు మూలము. కాబట్టి ధర్మానికి సరియైన పోలిక అనుకూలవతి, సంతానవతి, అయిన భార్యయే”..

*మనము నేర్వవలసిన నీతి:*
ధర్మమే పరబ్రహ్మము. ఒక్క ధర్మాని యెరిగిన ఐహికమోక్షఫలములు పొందవచ్చును. మోక్షసాధనకు వేరే మార్గములేదు..
సనాతనధర్మములో భార్య పురుషార్థసాధనలో ఇలా సహకరిస్తుంది:
పంచ యజ్ఞములు నిర్వహించుటలో సహకరించును..
దేవతార్చను కావలిసిన సంబారాలను భక్తితో సమకూర్చును..
అత్తమామలను సేవించి, పితౄణము తీర్చుకొనుటలో సహకరించును..
అతిథి అభ్యాగతులను అన్నపూర్ణవలె సత్కంరిచి సహకరించును..
తోటి జంతువులకు అన్నమిచ్చి, వృక్షములను పూజించి, సేవించి ఆ ఋణము దీర్చుటలో సహకరించును..
ధర్మసాధనకు సహకరించి ఋషిఋణము దీర్చుటలో సహకరించును..
పైచెప్పిన కార్యాలకు కావలిసినట్టుగా గృహమును సిద్ధపరిచి అర్థసాధనలో సహకరించును..
కోరికలను ధర్మబద్ధమైన రీతిలో తీర్చుకొనుటకు సహకరించును..
పితృకార్యాలు చేసే సత్సంతానమును అనుగ్రహించి, మొక్షప్రాప్తికి సహకరించును..
ఇంతటి ఉత్కృష్టమైన స్థానము భార్యకు ఉన్నందులకే భార్యని పరబ్రహ్మతో పోల్చెను రాఘవుడు..
*మీ*
*శశికాంత్ శర్మ దహగం*

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...