సోమయాగం అంటే ఏమిటి?
కలియుగంలో చేయదగిన మహాయాగములు సప్త సోమయాగములు. అప్తోర్యామం ఏడవది. అగ్నిహోత్రంతో సశాస్త్రీయ సనాతన భారతీయ వేద విజ్ఞాన విధానం ద్వారా ప్రకృతిలో జీవ శక్తిని పెంచుటకు సోమలతనుండి తీయు సోమరసాన్ని ప్రకృతికి (దేవతలకు) సమర్పించుట సోమయాగం. సోమ అనగా చంద్రుడు అని, (స+ఉమ) ఈశ్వరుడు అని అర్థం. ఉమ అంటే శక్తి. శివుడు శక్తి సహితుడు. అంటే పదార్ధాన్నీ, శక్తినీ కలిపి సంధాన పరిచే చాంద్రీయశక్తి సోమలత. ఇది ఒక లత (తీగ). భూమండలముపైన ప్రతి మొక్క (ఔషధి) చంద్రశక్తి వలననే పెరుగుతుంది. చంద్రుడు మన: కారకుడు. చంద్రకాంతి ప్రకృతిని, జీవుల మనస్సును ప్రభావితం చేస్తుంది. చంద్ర కళలలతో సమానంగా పెరుగుతూ, సమానంగా తరిగే ఏకైక ఓషధీరాజము సోమలత. అమితంగా చంద్రశక్తిని గ్రహించే ఏకైక లత సోమలత.
సోమలత హిమాలయాల్లోనూ, దక్షిణభారతదేశంలో కొంకణ ప్రాంత అరణ్యములలోనూ లభిస్తుంది.
సోమయజ్ఞ నిర్వహణ అంటే సాధారణమైన సత్యవ్రతం, తిరుకల్యాణం, రుద్రాభిషేకం, నిత్యపూజలాంటి భక్తిమార్గంలో చేసేవి కావు. అవి మనస్సును భగవంతునివైపు మళ్లించే సంతోషదాయక క్రియాకలాపాలు. వాటికి ఒక సామాజిక, మానసిక, పౌరాణిక నేపధ్యం ఉంటుంది. అవి తప్పక అనుసరించాలి. కానీ యజ్ఞాలు వాటికి భిన్నమైనవి. సోమయజ్ఞనిర్వహణ పౌరాణికం కాదు. అది వేద సంబంధం. అంటే జ్ఞాన - శాస్త్ర సంబంధమైనవి. పురాణోక్త కర్మలలో స్థితినిబట్టి కాలానుగుణంగా మార్పులు చేసుకోవచ్చు (ఉదా- సత్యనారాయణ వ్రతంలో బంగారు ప్రతిమ బదులు రాగి ప్రతిమ....), కానీ వేద యజ్ఞాలలో అలా కుదరదు. అవి నిర్దేశించిన ప్రకారమే జరగాలి. సోమయజ్ఞములలో సోమవల్లీరసం ప్రధానము. ప్రకృతిలో జీవశక్తిని పెంచుటకు సోమలతనుండి తీయు సోమరసాన్ని అగ్నిద్వారా దేవతలకు సమర్పించుమంత్రవిభాగములు ప్రధానంగా 33 స్తుతి – శస్త్రములు. స్తుతి సామవేద మన్త్రములు, శస్త్రములు ఋగ్వేద మన్త్రములు. సప్త సోమయాగముల పేర్లు ఈస్తుతి – శస్త్రముల సంఖ్యను అనుసరించి నిర్ణయించబడును. వేదానాం సామవేదోస్మి అని జగద్గురువులైన శ్రీకృష్ణులు చెప్పారు. సామం లేకపోతే యాగం లేదు.సోమయాగంలో సామవేదమే ప్రధానం. ఈ విషయం అర్థం కావాలంటే యాగం చూడడం, అది ఏమిటి అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
శుభ సాయంత్రం
( గంగాపురం పవన్ గారి సౌజన్యంతో)
No comments:
Post a Comment