Friday, January 27, 2017

ద్వాదశాదిత్య (పన్నెండు మాసాల్లో సూర్యుడు)

కాల రూపమును దాల్చిన సూర్య భగవానుడు లోకయాత్రు నిర్వహించుటకై చైత్రము, వైశాఖము, మొదలైన పన్నెండు మాసములలో వేరుగా పన్నెండు గణములతో గూడి సంచరించుచున్నాడు.

* చైత్రమాసంలో సూర్యుడు ధాత అనే పేరు  ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు అనేవారు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు.

* వైశాఖమాసంలో సూర్యుడు, ఆర్యముడు అనే పేరు వహిస్తాడు. పులహుడు, ఓజుడు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుడు, కంజనీరుడు అనేవారు అనుచరులు కాగా కాలగమనం సల్పుతుంటాడు.

* జ్యేష్ఠమాసంలో సూర్యుడు, మిత్రుడన్న పేరు దల్చి అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహ, రథస్వనుడు అనే పరిచరులతో కలిసి ప్రవర్తిస్తుంటాడు.

* ఆషాఢ మాసంలో సూర్యుడు, వరుణుడు అనే పేరు పొందుతాడు. వసిష్ఠుడు, రంభ, సహజన్యుడు, హూహువు, శుక్రుడు, చిత్రస్వనుడు, అనే వారు తనకు పరివారం కాగా కాలం గడుపుతుంటాడు.

* శ్రావణమాసంలో సూర్యుడు, ఇంద్రుడన్న పేరు స్వీకరిస్తాడు. అతనికి సహచరులుగా విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగిరసుడు, ప్రమ్లోచ, చర్యుడు అనేవారు కలసిరాగా కాలం నిర్వహిస్తాడు.

* భాద్రపదమాసంలో సూర్యుడు వివస్వంతుడన్న పేరుతో విరాజిల్లుతూ ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, ఆసారణుడు, భృగువు, అనుమ్లోచ, శంఖపాలుడు అనే వారు ఆవరించి ఉండగా సమయపాలనం చేస్తుంటాడు.

* ఆశ్వయుజమాసంలో సూర్యుడు త్వష్ట అన్నపేరుతో భూమికి ప్రమోదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తుంటాడు. ఈ నెలలో ఋచీకుని సుతుడైన కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంభరుడు అనే సభ్యులతో సహవర్తియై కాలక్షేపం చేస్తుంటాడు.

* కార్తికమాసంలో సూర్యుడు విష్ణువనే పేరుతో వ్యవహరిస్తాడు. అతనికి పరిచరులుగా అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘాపేతుడు అనేవారు సహకరింపగా కాలాన్ని నడుపుతుంటాడు.

* మార్గశీర్షమాసంలో సూర్యుడు అర్యముడన్న పేరుతో అభిహితుడౌతాడు. కశ్యపుడు, తార్ క్ష్యుడు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రువు, మహాశంఖుడు అనేవారు అనుచరులు కాగా కాల నిర్వహణ కార్యక్రమం చేస్తుంటాడు.

* పుష్యమాసంలో సూర్యుడు భగుడనే పేరు ధరింినవాడై స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వచిత్తి అనేవారు సభ్యజనులై అనుసరింపగా సమయం జరుపుతుంటాడు.

* మాఘమాసంలో పూషుడన్న పేరుతో వ్యవహరింపబడుతూ ధనంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు అనేవారు పరిజనం కాగా సంచరిస్తూ ఉంటాడు.

*ఫాల్గుణమాసంలో సహస్రకిరణుడైన సూర్యుడు చాతుర్యకళా కేళీలోలుడై బుద్ధిమంతులు ప్రశంసించునట్లుగా క్రతువన్న పేరు పెట్టుకుని కాలాన్ని పరిపాలిస్తాడు. ఆ సమయంలో వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేవజిత్తు, విశ్వుడు, ఐరావతుడు అనేవారు అతనిని పరిచరిస్తుంటారు.
సేకరణ....

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...