*ధర్మరాజు* - ‘*యుధిష్ఠిరుడు*’!
ధర్మరాజుకి యుధిష్టిరుడు అనే బిరుదం ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పొరాడే వాడు అని అర్ధం. కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం ఋజువు చేయడం కష్టం.మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్ధకమవుతుంది?
యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది మాత్రమే కాదు. ఆ యుధాలతో చేసేది అంతకన్నా కాదు. ఎవరు శత్రువో తెలియకపొయినా ఏ ఆయుధం దొరకపోయినా మనం మనల్ని జయించడం కోసం చేసే నిత్య జీవల సంగ్రామమే నిజమైన యుద్దం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే. అందుకే ఆయన యుధిష్టిరుడయ్యాడు.
ఆయన జీవన యుధిష్టిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనమే ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం. ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలలోను, జీవితంలో అన్ని సందర్భాలలోను మనదేపైచేయి అనుకోకూడదు. వనవాసమ్లో ఉన్న ధర్మరాజుకి, సోదరులకి దాహం అయితే నకులుణ్ణి పిలిచి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాడు. అతను వెళ్ళి ఒక సరోవరం చూశాడు. అందులొ దిగి నీరు త్రాగబోయాడు. అంతలో ఒక యక్షుడు కొంగరూపంలో వచ్చి అడ్డుకుని తన ప్రశ్నలు సమాధానలు చెబితే గాని నీరు త్రాగడానికి వీలులేదన్నాడు. కొంగను అల్ప జీవిగా భావించిన నకులుడు ఆ ఆదేశాన్ని ధిక్కరించి నీరు త్రాగబోయాడు.
యక్షుని క్రోధానికి గురై మరణించాడు. సహదేవుడు, అర్జునుడు, భిముడు కూడా అదే దారిని త్రొక్కి, అదే అహంకారంతో అదే విధంగా మరణించారు. చివరకు ధర్మరాజు వెళ్ళాడు.
సోదరుల శవాలు గమనించి దుఃఖించాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాడు. ‘ఇది అనువు గాని ప్రదేశం, ఇక్కడ అధికులమనరాదు’ అని నిశ్చయించుకొన్నాడు. కొంగలోని దివ్యత్వాన్ని అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడ్డాడు. జవాబులు చెప్తే ఒక్కరినైనా బ్రతికిస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయినా ఆపదలందు ధైర్యగుణము అన్నట్లుగా గుండెలు చిక్కబట్టుకుని తన ప్రయత్నం తాను చేశాడు.
మొత్తం వంద ప్రశ్నలకు పైగా ఉన్నా అన్నింటికీ ఓపికగా తన పరిజ్ఞానం మేరకు సమాధానం చెప్పాడు. అవి ఏ పుస్తకంలోనూ సమాధానాలు దొరకని ప్రశ్నలు. వాటికి ఏ కేంద్రంలోను శిక్షణ ఇవ్వరు. అవగాహనే గ్రంథం. అంతరంగమే శిక్షణా కేంద్రం.
భూమికంటే గొప్పది ఏది? - తల్లి.
ఆకాశం కంటె ఉన్నతుడు ఎవరు? - తండ్రి.
జీవితాంతం తోడుండేది ఎవరు? - గుండె ధైర్యం.
ఇవీ ఆ సమాధానాలు. ఆ సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా ఒక ప్రశ్న అడిగాదు. దానికి జవాబు చెబితే సోదరులలో ఒకరిని బ్రతికిస్తానన్నాడు. అక్కడికదే అదృష్టం అని అంగీకరించాడు ధర్మరాజు. చివరి ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైనది.
అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది? - ‘రోజు ఎంతో మంది మరణిస్తూ ఉంటె చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకొని సంపదలు కూడబెట్టుకొంటున్నామే’ ఇదీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు.
ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజును అతి క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టాడు.
ఇంతకీ నీ సోదరులు నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావు అన్నాడు.
ఇంతవరకు సమాచాకానికి పరీక్ష. ఇప్పుదు సంస్కారానికి పరీక్ష.
ధర్మరాజు ఒక్కక్షణం ఆలోచించలేదు.
‘నకుల జీవతు మేభ్రాతా’ నా తమ్ముడు నకులుణ్ణి బ్రతికించండి. అన్నాడు
ఇప్పుడాశ్చర్యపోవడం యక్షుని వంతయింది. అదేమిటయ్యా, అమాయక చక్రవర్తి, భయంకరమైన యుద్ధాన్ని పెట్టుకొని పదివేల ఏనుగుల బలం కలిగిన పార్ధుణ్ణి వదిలి నకులుణ్ణి కోరుకుంటున్నావేమిటి? అన్నాడు.
వెంటనే ధర్మరాజు గెలుపు గుర్రాల రాజకీయం తనకు తెలియదనీ, యక్షుడు నలుగురినీ బ్రతికిస్తే తనకు పరమానందమేననీ కానీ ఒక్కరినే కోరుకోమనడం వల్ల నకులుని కోరుకోవలసి వచ్చిందనీ స్థిరంగా చెప్పాడు.
మా నాన్న్గగారికి కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు. వారిలో మాద్రి చనిపోతూ తన కుమారులిద్దరినీ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళీపోయింది. కుంతి సంతానంలో పెద్దవాణ్ణి నేను బ్రతికే ఉన్నాను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. కాబట్టి అతను బ్రతకాలి. ఇంతకు మించి నాకు రాజకీయ సమీకరణాలు తెలియవు.
నకులిణ్ణి నేను బ్రతికించగల్గితే మా తల్లులిద్దరికీ సమానంగా న్యాయం చేసిన వాణ్ణవుతాను. రేపు మా అమ్మ ఏ సందర్భంలో కూడా మా పినతల్లి ముందు తలవంచుకోవలసిన పరిస్థితి రాదు. మా అమ్మ నావల్ల ఈ లోకంలోనైనా ఏలోకంలోనైనా తలయెత్తుకుని బ్రతకాలి గానీ తలదించుకుని బ్రతకకూడదు. అని ధర్మరాజు నిశ్చయంగా చెప్పేసరికి ఆశ్చర్యపడి, ఆనందించి యక్షుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురినీ బ్రతికించాడు.
అంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యం ఏదో మనం చేస్తే ఆపైన దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట.ఇదీ ధర్మరాజుని యుధిష్టిరుని చేసిన యక్ష ప్రశ్నల ఘట్టం.
ఈవేళ పరీక్షలో నాలుగు జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై ఆందోళనకు గురై, విజయం సాధించలేక ఆత్మహత్యలకు సహితం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివితీరాలి. ధర్మరాజు ముందు నాలుగు సమాధానాలు లేవు. నలుగురు తమ్ముళ్ళ శవాలున్నాయి. అయినా తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పి సమాచారంలోను, సదాచారంలోనూ కూడా తనకు సాటిలేరని నిరూపీంచుకున్న జీవన యుధిష్టిరుడు, అదర్శ నాయకుడు ధర్మరాజు.
No comments:
Post a Comment