Monday, December 12, 2016

గాయత్రీ మంత్రం - వైశిష్ట్యం

      మంత్రాల్లో శ్రేష్ఠం గాయత్రీ మంత్రం -
           సంధ్యాదేవత.. గాయత్రి

సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన సరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. అందుకే గాయత్రీ మాతను

ఓం తత్స విదుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహీ
ధియోయోనః ప్రచోదయాత్॥

అంటూ స్తుతిస్తారు. ఏ మహాతేజం ఈ లోకమంతా వ్యాపించి సర్వాధిపత్యం వహిస్తుందో, ఏ తేజ పుంజం సర్వ చరాచర జీవ జాలాన్ని నడుపుతూ కర్మఫలాలను అనుభవింపచేస్తుందో ఆమే గాయత్రి. ఆ తల్లి దివ్యతేజస్సుతో బ్రహ్మాది దేవతలు సైతం ప్రభాభాసమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత మహిమాన్వోపేతమైన గాయత్రీ మాత కరుణకు పాత్రులం కావడానికి గాయత్రీ మంత్రోపాసన ముఖ్య భూమికను పోషిస్తోంది.
ఈ గాయత్రీ మంత్రం సూర్యపరంగా, శక్తిపరంగా, శివపరంగా, పరబ్రహ్మపరంగా, తేజోమయుడైన పురుషోత్తముని పరంగా ధ్యానింపబడుతోంది.
సర్వశక్తికి మూలప్రదమైన ‘గాయత్రీ’ పుట్టుక గురించి పురాణాలు ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఈ చరాచర సృష్టిలోని అంధకారం నుంచి ‘జ్యోతి’ జన్మించింది. ఆ జ్యోతినుంచి విశ్వవ్యాపక తేజమగు ‘విష్ణువు’ జనించాడు.
ఆ మహావిష్ణువు రెండువ్రేళ్ళ రాపిడితో ‘నురుగు’ జన్మించింది. నురుగు నుండి ‘బుడగ’, బుడగనుంచి ‘గ్రుడ్డు’, గ్రుడ్డు నుంచి ‘ఆత్మ’, ఆత్మనుంచి ‘ఆకాశం’ ఆకాశం నుంచి ‘వాయువు’, వాయువు నుంచి ‘అగ్ని’, అగ్నినుంచి ‘ఓంకారం’, ఓంకారంనుంచి ‘వ్యాహృతులు’ వాటి నుంచి ‘గాయత్రి’ జన్మించింది.
మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనది గాయత్రీ మంత్రం. దీనివల్ల గరుడు నారాయణుడుగా మారతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిని ‘గురుమంత్రమని’ బ్రహ్మోపదేశ మంత్రమని కూడా పిల్వడం జరుగుతోంది. అత్యంత శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ మంత్ర జపం వల్ల కాని కార్యాలంటూ ఏవీ ఉండవు. మూడు పాయలు కల్గిన ఈ మంత్రంలోని ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున 24 బీజాక్షరాలున్నాయి. ఈ 24 బీజాక్షరాలలోనూ ఈ విశ్వంలోని సర్వవిజ్ఞానం నిక్షిప్తమై ఉంది. అలాగే ఈ మహామంత్రంలోని 24 బీజాక్షరాలు 24 దైవిక శక్తుల బీజాక్షరాలు. అంతేకాకుండా ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవత అధిపతియై, ఆయా దేవతల శక్తులు అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. అందుకే ఇది మహామంత్ర రాజమైందని తాంత్రిక గ్రంథాలు చెబుతున్నాయి.
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమేనని, గాయత్రీ మంత్రములోని ఒక్కొక్క బీజాక్షరానికి వెయ్యి శ్లోకాల చొప్పున 24వేల శ్లోకాలతో వాల్మీకి రామాయణాన్ని రచించడం జరిగిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
గాయత్రీ మహామంత్ర మంత్రోచ్ఛారణ చేయునపుడు సాధకుని కంఠం, జిహ్వ, దంతాలు, శిరస్సు తదితరాల నుంచి ఒక విధమైన ధ్వని తరంగాలు జనిస్తాయట. ఆ విధంగా జనించిన స్పందనల వల్ల సాధకునిలోని సమస్త శక్తి కేంద్రాలు ఉత్తేజితమైన, చైతన్యాన్ని కల్గిస్తాయట. శ్రద్ధాశక్తులతో, విశ్వాసంతో గాయత్రీ జపం చేస్తే ఆత్మ, బుద్ధి, మనస్సు పవిత్రత చెంది బ్రహ్మశక్తి పుట్టి శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
‘‘గాయతం త్రాయతే గాయత్రే’’
గాయత్రి జపం చేసే వారిని గాయత్రీయే కాపాడుతుందట. ఈ గాయత్రీ జపాన్ని త్రిసంధ్యలలో చేస్తే అత్యంత శ్రేయస్కరమని విజ్ఞులు చెబుతారు. ఉదయం పూట ఎర్రని వస్త్రాన్ని ధరించి గాయత్రీదేవిని దేవతగా ఏకాగ్రతతో ధ్యానించాలి. మధ్యాహ్నం తెల్లని వస్త్రం ధరించి సావిత్రిదేవిని దేవతగా భావించి ధ్యానించాలి. సాయంకాలం నీలి వస్త్రం ధరించి సరస్వతిదేవిని దేవతగా ఏకాగ్రతతో ధ్యానించాలి.
ఇలా ధ్యానించిన వారికి పగలు చేసిన పాపాలు పగలే నశించిపోతాయని, అలాగే రాత్రి చేసిన పాపాలు రాత్రే మటుమాయమవుతాయంటారు. గాయత్రీ జపంవల్ల ఆయుర్దాయం, బ్రహ్మవర్చస్సు పెరుగుతుంది.
లక్ష్మీకటాక్షంతోపాటు సంతాన ధన, ధాన్య వృద్ధి కలుగుతుంది. గాయత్రి శబ్దం ఉచ్చరించినంత మాత్రానే సంసార సాగరం నుంచి మోక్షం లభిస్తుంది. త్రిసంధ్యలలో త్రికరణ శుద్ధిగా గాయత్రిని ధ్యానించేవారిని ఆ గాయత్రి మాత తల్లివలే కాపాడి ధనధాన్య సుఖాలను ఐహిక సుఖాలనిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గాయత్రీ మంత్రాన్ని జపం చేసేవారు ప్రాతఃకాలంలోనే చేయడం శ్రేయస్కరం. బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని, శుచియై, గాయత్రీ జపాన్ని చేయాలి. ఎవరి శక్తి అనుసారం వారు గాయత్రీ జపం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏకాగ్రత ప్రధానం కానీ సంఖ్య కాదని గుర్తుంచుకోవాలి.
గాయత్రీ జపం చేసే వారిల్లు శుచి శుభ్రతలతో ఉండాలి. సాత్విక ఆహారమే తీసుకోవాలి. దూమ, మద్యపానాలకు దూరంగా ఉండాలి. మైలుపడిన వారిని తాకకుండా గాయత్రీ మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, జపం చేయాలి. అలా చేసిన వారికి ఆ గాయత్రీమాత అభీష్టాలను నెరవేర్చి చల్లగా చూస్తుంది.
‘అమ్మా నీవే శరణు’ అన్న వారిని అనేక విధాలుగా ఆ తల్లి కాపాడుతుంది. ఆ తల్లినే ‘అన్యథా శరణం నాస్తి తల్లీ నీవే గతి, ఇహపరసుఖాలను నీవే ప్రసాదించు తల్లీ’ అంటే చాలు ఈ లోకంలోనే కాదు ఏ లోకాన తన భక్తులున్నా వారిని కంటికిరెప్పలాగా కాపాడుతుందా తల్లి. అందుకే అందరం కలసి అందాం. ’ఓం శ్రీ గాయత్రీ దేవతాభ్యోనమః‘

సంధ్యాదేవత.. గాయత్రి

కాల చక్రాన్ని తన సంచారంతో నడిపించేవాడు సూర్యుడు. చండ మార్తాండ మం డల మధ్యలో సూర్యునికి అధిష్ఠాత్రి అయి, సూర్యునికి సత్తాస్ఫూర్తులను కలిగించే చిన్మయ చైతన్యరూపిణి- గాయత్రీమాత. సకల జగత్తును నియతగా నడిపేది- ధర్మం. అందరికీ ధర్మదేవత- గాయత్రి.
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి వెళ్ళడానికి నెల రోజులు పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఉన్నపుడు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి. అవి మానవ శరీరం మీద, మనస్సు మీద ప్రభావం చూపుతాయి. అయితే పుట్టినప్పుడు- ఏ రాశిలో సూర్యుడు ఉ న్నాడో అది ముఖ్యమైన ప్రాణశక్తి. ప్రాణం మన శరీరంలో నాభి దగ్గర ఉంటుంది. అందుకే సృష్టించే బ్రహ్మదేవుడు, స్థితి కారకుడైన విష్ణుమూర్తి నాభి కమలంలోంచే ఆవిర్భవించాడు. అలాగే గర్భస్థ శిశువు నాభి, తల్లి నాభి కలుస్తాయి. ఇదే గర్భస్థ శిశువులకు ప్రాణ శక్తిని యిచ్చేది. బయటకు వచ్చిన తరువాత వేరు చేస్తారు. వేరవగానే సూర్యశక్తి ప్రాణశక్తిగా, పుట్టిన శిశువుకు సమకూరుతుంది. ఆ శక్తియే గాయత్రీమాత.
పిల్లలు ఎదిగినకొద్దీ వారికి- ప్రాణశక్తిని ఎలా పొందాలనే విషయమై ప్రాణాయామం, కుండలినీ శక్తి గురించి చెప్పి నేర్పించాలి. రోజూ మూడుసార్లు త్రిసంధ్యావేళల్లో ప్రాణాయామం చేస్తే బుద్ధి వికసిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆ సంధ్యాదేవతే- గాయత్రీ మాత.
గాయత్రీమాత కాంతి లేక వెలుగు స్వ రూపం, తేజోమయి. శక్తివంతమైన కాంతి, వెలుగులోకెల్లా వెలుగు. అది స్వయం ప్ర కాశం కలిగిన అఖండ వెలుగు. సూర్యుడిని సూర్యునిగా భాసింపజేసి, విశ్వానికి కనుపింపచేసే ‘ప్రభావతి’ గాయత్రీ మాత.
ప్రత్యక్ష కర్మసాక్షి- సూర్యభగవానుడు. మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రకాశమే ఆయన భర్గస్సు. ‘సవిత’ అంటే మానవబుద్ధి. బుద్ధిలో ప్రతిఫలించే జ్ఞాన తేజః కిరణాలే- భర్గస్సు. ‘సవిత’ అంటే పరబ్రహ్మస్వరూపము. చైతన్యవంతమయిన నామరూపాది రుూ విశ్వమే- భర్గస్సు. అదే శక్తి స్వరూపం. ఆ శక్తీ గాయత్రీమాత. ప్రాణుల దేహ గోళములందు కుండలినీ శక్తిగా మూలాధారాధి షట్చక్రములలో ఉంటుంది. ప్రాతఃకాలంలో కుండలినీ శక్తితో పవిత్ర తేజస్సును ధ్యానించినా, జపించినా- విశ్వ కల్యాణం జరుగుతుంది. ఇది గాయత్రీ మాత సర్వజనావళికి యిచ్చే రక్ష.
బాహ్య ప్రపంచంలో ఉండే పంచ భూతములు అనగా- పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మన శరీరంలో కూడా ఉన్నాయి. సూర్య తేజస్సు ఉంది. విద్యుత్ అయస్కాంత శక్తి ఉన్నాయి. పంచభూతములలో సూర్యశక్తి ఉన్నది. దీనినే సోలార్ ఎనర్జీ అని అంటున్నారు. ప్రాణశక్తి నాడుల ద్వారా ప్రసరిస్తుంది. మన శరీరంలోని ముఖ్యమైన నాడులు- ఇడ, పింగళ నాడులు, వెనె్నముక వద్దనున్న సుషుమ్నానాడి. సూర్యుడు ప్రాణశక్తి ప్రదాత. అందుకే అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు- దగ్గరలో వున్న ప్రాణశక్తి ప్రదాత సూర్యుడు కాబట్టి. అప్పుడే రాముడు రావణుని సంహరించేలా ‘శక్తి’మంతుడైనాడు. సూర్యునిలో ఉండే ప్రాణశక్తి- గాయత్రీమాత.
సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని, సత్సంతానాన్ని, గో సంపదను, కీర్తి ప్రతిష్ఠలను, బ్రహ్మ వర్చస్సును, ఓజస్సును, భ్రాజస్సును ప్రసాదించి, అంత్యమున మోక్షమును ప్రసాదించు కరుణామయి- గాయత్రీమాత అని అధర్వణ వేదం చెపుతోంది.
శివ,శక్తులలో భేదభావం లేదు. ఒకరికొరు ఆరాధ్యులు. శివుని ప్రేమను సంపాదించిన శక్తి శివుని మించిన వ్యక్తిత్వాన్ని పొందుతుంది. పరమాత్మను సేవించే భక్తులు భగవంతుని కంటే మిన్నగా ఉంటారు. అందుకే శక్తికి శిష్టులంటే చాలా ఇష్టం. మంచి మనసంటే తల్లికి ఎంతో అనురాగం. అలాంటివారి పూజలందుకొని, తన అమేయమైన స్వ యం జ్యోతిలో వారిని అనుగ్రహిస్తుంది. పరమ చైతన్య రూపంలో ఆమె చిచ్ఛిక్తి స్వరూపిణి. అయినా, జడపదార్థాలలో కూడా జగన్మాత జడశక్తి కూడి ఉంటుంది. ఆమె దృష్టిలో జడ చేతన భేదం లేదు. రెండింటిలో ఒకే పరతత్త్వం ప్రధానంగా ఉంటుంది. ఆ పరతత్త్వమే గాయత్రి.
‘‘గాయంతం త్రాయత ఇతి గాయత్రీ’’ -తనను గూర్చి గానం అనగా ధ్యానం చేసేవారిని రక్షించే వేదమాత గాయత్రీమాత. ఓంకారంతో ఆరంభించి, భూం, భువః సువః, మహః జనః తపః సతం- అనే సప్త వ్యాహృతుల్లో గాయత్రి నివసిస్తుంది. ఈ సప్త వ్యాహృతుల్లో, సప్తలోకాల సర్వసంపద ఇమిడి ఉంది. పగలు - రాత్రి, వెలుగు - చీకటి, జాగృతి- సుషుప్తి- వీటికి సంధిస్థలమైన సంధ్యలో గాయత్రి ప్రవేశిస్తుంది. ‘గతా భగవతీ రాత్రిః అహశ్శివ ముపస్థితం’ అన్న ఆర్ష వాక్యాల్లో సాంధ్యరాగంలోని శివశక్తి సాయుజ్యం స్పష్టంగా గోచరిస్తుంది. ఉదయం, సాయంత్రం సంధ్య వె లుగు కనిపించగానే గూళ్ళలోని పక్షులు గలగలా ధ్వనిచేస్తూ సంధ్యాదేవిని కీర్తిస్తాయి. సంధ్యాదేవత- గాయత్రి. సంధ్యా సమయాల్లో ఉపాసించినవారి యోగక్షేమములను ఆ తల్లే చూసుకుంటుంది.
ఋగ్వేద సూక్తములు, వాటియందలి సర్వ విశేషములతో ఏర్పడిన సామము, యజుర్వేద, అధర్వణ వేదములు, ఆ వేదములనుండి ఒక్కొక్క పాదముగా ఏర్పడిన గాయత్రీ మహామంత్ర హృదయము, సరిగమ పదని సంగీత సప్తస్వర సుందరులకు నిలయమని, ‘నాభి హృత్కంఠీ రసన నాసాదులలో ధర ఋక్యామాదులలో వరగాయత్రీ హృదయమున’ -అని గాయత్రీ మంత్రాన్ని సమన్వయపరుస్తూ ‘శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా’ అని జగన్మోహినీ రాగంలో సద్గురు త్యాగరాజ స్వామి మనకందించిన గంభీర ఉదాత్త కీర్తన- గాయత్రీ మాత ఆరాధనకు స్ఫూర్తినిస్తుంది.
గాయత్రీ మంత్రంలోని ఇరువది నాలుగు అక్షరములను మూడు భాగములుగా చేస్తే- ఒక్కొక్క భాగానికి ఎనిమిది అక్షరాలు వస్తాయి. ఈ మూడు ఖండాలు- సృష్టి స్థితి లయలకు సూచికం. మొదటి ఖండం- ఋగ్వేదం, రెండవ ఖండం-సామవేదం, తృతీయ ఖండం- యజుర్వేదం అవుతాయి. ఇది వేదమాత గాయత్రీ మంత్ర అంతరార్థం.
వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదటి ఒక్కొక్క గాయత్రీ మంత్రాక్షరాన్ని చేర్చి, ఇరువది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణాన్ని రచించాడు. గాయత్రీ మంత్రాక్షర ఘటితమైన శ్రీమద్రామాయణం సర్వశక్తి స మన్వితం, కల్యాణప్రదం. అందుకనే ఇహపర సాధకమై జీవన్ముక్తికి సోపానమయింది

శ్రీరామకథ.
సూర్యభగవానుడు- కాలప్రాముఖ్యతను తెలియచేసేవాడు. త్యాగమూర్తి, నిత్య కర్తవ్య పరిపాలకుడు. అందుకే మహర్షులు ‘‘మీరు కూడా సూర్యునివలే ఉండండని, ఆత్మ తేజస్సుని విసింపచేసుకోండి’’ అని చెప్తారు. సూర్యునిలోని సద్గుణ శక్తియే- గాయత్రి. సూర్యునికి, గాయత్రికి భేదం లేదు. సూర్య సహస్రనామావళిలో ‘గాయత్రీ జప సుప్రీతాయైనమః’’ అని ఉంటుంది.
‘‘సంధ్యాదేవీం, సావిత్రీం, వర గాయత్రీం, సరస్వతీం భజేహం’’ ప్రాతఃకాలము, మధ్యాహ్నము, సాయంకాలము- గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ రూపములలో సంధ్యాదేవిని ధ్యానిస్తారని, వీటినే జన్మ, మధ్యమ, అస్తమయ జీవిత కాలములుగా చెప్తారు. గాయత్రీ పూజకు స్ఫూర్తిదాయకమైన ఈ కీర్తనను అందించాడు ముత్తుస్వామి దీక్షితులు దేవక్రియ రాగంలో. దేవీ అనుగ్రహంతో సంప్రాప్తించిన శక్తిని, సకాలంలో లోక కల్యాణానికి స్వార్థరహితంగా ఉపకరించి తరించాలని ఉద్బోధిస్తోంది- సద్బుద్ధి ప్రదాయిని, సం ధ్యాదేవత వేదమాత గాయత్రి.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...