Sunday, December 11, 2016

రుద్రాధ్యాయం మాహాత్మ్యం

ఒకసారి యమలోకం ఖాళీగా ఉందట. యముడు తనకు పనిలేక, ఇతర ఉద్యోగుల్ని సమావేశం చేశాడు. జీవుని నరకానికి తీసుకువచ్చే పాప, రోగ దేవతల్ని పిలిచాడు. “ఏమిటి మీరు ఏమీ పని చేస్తున్నట్లు లేదే! నరకలోకం ఖాళీగా ఉంది. మీరు కొంచెం పని బాగా చేస్తే నాకు కొంచెం జనం పెరుగుతారు. పెరిగితే నాకు పని పడుతుంది’ అన్నాడు యముడు. అంతేకాక ఏ పనీ లేకుండా గోళ్ళు గిల్లుకుంటే ఏం బాగుంటుంది? చేతినిండా పని ఉండాలి ఆయనకు.

నరకస్య వివృధ్యర్థం పట్టబంధం చకారయత్. మిమ్మల్ని పట్టం కట్టారు దేనికి? – నరకాన్ని పెంచడానికి. మీరు వెళ్ళి ఏమీ చెయ్యడం లేదు? అప్పుడు ఆ నరక నాయకులు చెప్తున్నారు “మేము చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం. కానీ ఏం చేస్తాం? మేము భూమికి వెళ్ళడానికి వీలు కుదరలేదు. ఎందుకంటే అందరూ కూడా రుద్రాధ్యాయం జపిస్తూ శివుని ఆరాధిస్తుంటే మాకు ప్రవేశమే లేదక్కడ”. “రుద్రాధ్యాయ భువం ప్రాప్తే సాక్షాత్ కైవల్య సాధనే” – సాక్షాత్ కైవల్య సాధనం కలిగిన రుద్రాధ్యాయం ప్రతివాళ్ళు చేస్తుంటే ‘భీతా ప్రదుద్రువు స్సర్వే పాతక నాయకాః” అందుకే మేము పారిపోతున్నాం. మేమంత తెలికవారం కాదు. ఎవరు ఎటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా మాకేం ఫరవాలేదు. వారిలో దూరిపోగలం. మాకంతటి శక్తి ఉంది. వెయ్యి ప్రాయశ్చిత్తాలనైనా మేము కొట్టగలం కానీ రుద్రాధ్యాయాన్ని మాత్రం మేము కొట్టలేము” అన్నారు. వేయి ప్రాయశ్చిత్త కర్మలకంటే ఒక్క రుద్రాధ్యాయం ఎంత గొప్పదో.

ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా చేసిన పాపం పోతుంది. కానీ మళ్ళీ పాపం చేయాలనే సంస్కారాన్ని నశింపజేయదు. రుద్రాధ్యాయం ఆ పని చేస్తుంది. అందుకే దాని శక్తి ఎక్కువ. అది ఉంటే దాని నుండి వస్తున్న తేజస్సు అంతా ఇంతా కాదు. ఈ రుద్రాన్ని భావన చేసే వారినుండి వచ్చే తేజస్సు చేత ‘సర్వభూతేష్వపరాజితో భవతి” సర్వ భూతములు కూడా జయించలేవు. దగ్గరకు రాలేవు. ‘తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకినీ డాకినీ సర్వ శ్వాపద తస్కర జ్వరాద్యుపద్రవాత్” అని మహన్యాసంలో చెప్పబడింది.

నిరంతరం ఆ శివుని ఎవరు ఆరాధన చేస్తున్నారో వారిని చూసి రోగాలు, పాపాలూ, ఉపద్రవాలూ, భూతప్రేత పిశాచాలూ అన్నీ దూరం నుండి భయపడతాయట. ‘సర్వ్ జ్వలంతం పశ్యంతు” వాటికి వీడు అగ్ని శిఖలాగా కనపడతాడు. శాంభవ తేజస్సు అని అంటారు దానిని. దానిని చూసి భయపడిపోతారు. అందుచేత “యమా! మా వల్ల కాదు” అన్నారు.

రుద్రాధ్యాయీ వసేత్ యత్ర గ్రామేవా నగరేపివా!

నతత్రక్షుత్పిపాసాద్యా దుర్భిక్షం వ్యాధ యోపిచ”

రుద్రాధ్యాయం జపించేవాడు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఉపద్రవాలుండవు. అతని చుట్టూ ఉన్న పరిసరాలు కూడా బాగుపడిపోతాయి. అందుకే ఒక్క శివాలయం ఉన్నా ఊరిని రక్షిస్తుంది అని చెప్పారిక్కడ. ఎందువలన? ఆ శివాలయం ఉంటే రోజూ ఆయనకు రుద్రంతో అభిషేకం చేస్తారు.ఈ ఊరంతా క్షేమంగా ఉంటుంది. పీడలు లేకుండా ఉంటుంది. ‘గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే ష్వాయత నేషుచ’ ప్రతి ఊళ్ళో ప్రతి నదీ తీరంలో ప్రతి వాడూ రుద్రజపం చేస్తున్నాడు. రుద్రం జపానికే కాదు అభిషేకానికీ వినియోగించవచ్చు. హోమానికీ వినియోగించవచ్చు. రకరకాలుగా దీనిని వినియోగించగవచ్చు. అందుకే “జప హోమాభిషేకార్చనేషు వినియోగః” అన్నారు.

అభిషేకానికి ద్రవ్యం లేకపోయినా రుద్రం జపం చేసుకుంటూ కూర్చోవచ్చు. అంతశక్తి ఉన్నదయ్యా దానికి అది చాలన్నారు. “రుద్రజపం చేసేవాని దగ్గర మేము ఒక్క క్షణం నిలబడలేము. నీ ఇష్టం. నరకం నింపుకోవడానికి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో” అన్నారు ఆ పాపాదులు. తిన్నగా యముడు బయలుదేరాడు బ్రహ్మగారి దగ్గరికి. పదవి ఇవ్వడం కాదు. పని ఇవ్వవయ్యా అన్నాడట బ్రహ్మగారితో. నన్ను నియమించావు, ఖాళీగా ఉన్నాను. ఏం చేయమంటావ్? సృష్టిలో అంతా మంచే ఉన్నా ప్రమాదమే, అంతా చెడు ఉన్నా ప్రమాదమే. త్రిగుణాలు ఒకేలా ఉంటే సృష్టి సాగదు. వైషమ్యం రావాలి. బ్రహ్మదేవుడు ఆలోచించి రెండింటిని భూమిమీదికి పంపాడట.

రుద్రా జాప్య విఘాతార్థముపాయం పర్యకల్పయత్!

అశ్రద్ధాం చైవ దుర్మేధా మవిద్యాయా ఉభేసుతే!!

‘అవిద్య’కు ఇద్దరు కూతుళ్ళు – అశ్రద్ధ, దుర్మేధ. ఆ రెండూ భూమిలో ప్రవేశించి సందు చూసుకుని క్రమంగా బుద్ధులలో చేరాయి. దానితో ప్రతివారూ మోహితులై రుద్రా జపాదులను విస్మరించారు. శివారాధన విడిచారు. దానితో తిరిగి పాప, రోగాదులు ఆక్రమించుకున్నాయి. యమలోకం కళకళలాడింది.

-ఈ కథ స్కాందపురాణంలోని ‘బ్రహ్మోత్తరఖండం’లోనిది.

ఇందులో ప్రధాన బోధ: అశ్రద్ధ, దుర్మేధ – వీటి వలన మనిషి భగవదారాదన వంటి సత్కర్మలను వదలి, పతితుడై పాపజీవనుడౌతాడు. ‘శ్రద్ధ’ అంటే శాస్త్ర వాక్యాలపై విశ్వాసం. ఇంద్రియాతీత సత్యాలను అనుభవంలో గ్రహించడానికి శ్రద్ధయే ప్రధానం. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అని గీతాచార్యుని వాక్యం.

అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి – మూర్ఖుడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు నశిస్తాడు అని కూడా హెచ్చరించాడు. శ్రద్ధ లేకపోవడమే ‘అశ్రద్ధ’. దానికి తోడు ‘దుర్మేధ’. కుతర్కాలు చేస్తూ, సత్కర్మలను హేళన చేస్తూ శాస్త్ర విరుద్ధంగా ఆలోచించడమే ఈ దుర్బుద్ధి. ఈ రెండూ దుఃఖానికి దారితీస్తాయి అని అందమైన కథగా వివరించారు వ్యాసమహర్షి.

(రాజశేఖరుని విజయ్ శర్మ గారి సౌజన్యంతో)

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...