Friday, January 11, 2019

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికంగా దీన్ని విశ్లేషిద్దాం. దీనికి కొన్ని ప్రమాణాలు ముందుగా సిద్ధం చేసుకుని ఈ చర్చ కొనసాగిద్దాము.
1. పునర్జన్మ /కర్మ సిద్ధాంతము : ఇతఃపూర్వము మనము ఎన్నో పోస్ట్లలో ఈ విషయం రూడీ చేసుకున్నాము.టూకీగా చంద్రశేఖర పరమాచార్య వారు ఋజువు చేసిన విధానం ఒకసారి నేమరువేసుకుందాము..ఒకే ఊళ్ళో ఒకే రోజు 14 మంది పుట్టగా ఒకరిద్దరు బాగా ధనవంతుల ఇళ్ళలో పుట్టగా, కొందరు మధ్యతరగతి ఇళ్ళలో, కొందరు రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలలో, ఒకరిద్దరు అంగవైకల్యంతో పుట్టగా ఇలా పుట్టడానికి కారణం వారి పూర్వజన్మ కర్మలు మాత్రమె అని ఆచరణాత్మకంగా ఒక ఋజువు చూపించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పుట్టిన ప్రతీ ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతీ ప్రాణీ మరల పుట్టక తప్పదని, ఆత్మకు చావు లేదు, అది చిరిగిన వస్త్రం మార్చి కొత్త వస్త్రం వేసుకున్న రీతిలో శరీరధారణ చేస్తుందని చెప్పి ఉన్నారు. ఈ సిద్ధాంతం మన సనాతనధర్మానికి ఆయువు పట్టు. ఇది ఎన్నోసార్లు ప్రమాణపూర్వకంగా నిరూపింపబడివున్నది.
2. పితృఋణం: మనిషికి శాస్త్రం నాలుగు రకాల ఋణాల గురించి చెబుతుంది. దైవఋణం (జప ధ్యాన యజ్ఞాదులు చెయ్యడం వలన తీరేది), ఋషిఋణం ( ఋషులు కనుక్కున్న వేదరాశి పఠన, వారు చెప్పిన విషయాల పై తపస్సు చెయ్యడం), మనుష్యఋణం ( సమాజంలో అందరి మీదా నీకున్న బాధ్యత నెరవేర్చడం అని శతపధబ్రాహ్మణం చెబుతుంది) మరియు పితృఋణం (ఈ విషయం ఈ టపాలో విస్తారంగా తెలుసుకుందాము) . ఈ ఋణాలు తప్పక తీర్చుకోవాలి లేదంటే అటువంటి వారి జీవితం వ్యర్ధం.

నేటి సాంకేతిక శాస్త్రం నిరూపించిన విషయం ఒకసారి అవలోకన చేసుకుందాము. మనకు వర్షం ఎలా పడుతుంది అంటే చిన్నపిల్లవాడు కూడా చెబుతాడు, నదుల్లో, తటాకాలలో, సముద్రాలలో ఉన్న నీరు సూర్యుని ప్రతాపానికి ఆవిరిగా మారి సాంద్రతలో తేడా వలన ఆకాశానికి చేరి మేఘంలా మారి అడ్డుగా ఉన్న కొండల వలన, వాతావరణం వలన నేలపై తిరిగి వర్షంగా అదే నీరు వస్తుంది. ఆ నీరు ఎక్కడ గ్రహింపబడినదో అక్కడే కురవాలన్న కట్టుబడి లేదు. మురికికాలువలో ఉన్న నీరు కూడా ఆవిరిగా మారి వర్షం పడేటప్పుడు తన మురికిని పోగొట్టుకుని మరల మంచి నీటిగా వర్షిస్తుంది. అదే వాతావరణంలో ఆమ్ల సారాలు ఉంటె ఆమ్లవర్షాలు, ఇతర రకాలుగా పడుతుంది.
మన వాంగ్మయం ఇంచుమించు ఇదే రీతిలో మన పునర్జన్మను వివరిస్తుంది. కాలమనే సూర్యుడు కిందనున్న జీవుల ఆత్మలను ఆ శరీరాలనుండి విడి చేసి ఇతరలోకాలకు పయనింపచేస్తుంది. ఈ జీవుడు చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా యాతనాశరీరం ద్వారా స్వర్గనరకాలలో సుఖదుఃఖాలు అనుభవించి వారి కర్మఫలావిశేషం వలన చంద్రుని ఆశ్రయించి మొక్కలు ఇతర ఫలపుష్పాల ద్వారా బీజరూపంలో ఆహారంగా మారి, జీవులు తిన్న ఆ తిండి వలన వీర్యంగా మారి ఆయా జీవుల శరీరం నుండి పునః ఉద్భవిస్తాయి.

గరుడపురాణం, విష్ణుపురాణం ఇత్యాది పురాణాలు ఈ విషయం కూలంకషంగా చర్చించాయి. ముందుగా మనం మాట్లాడుకుంటున్నది జీవాత్మ గురించి. జీవుని విగత శరీరం నుండి జీవాత్మ బయటకు వస్తుంది. ఊర్ధ్వ రంధ్రాల నుండి బయల్వడిన జీవాత్మ ఊర్ద్వ లోకాలకు, అధో రంధ్రాల నుండి విడువడిన ఆత్మ ప్రయాణం అధో లోకాలకు. శరీరానికి కర్మ కాండ జరిగిన పద్ధతి ప్రకారం పదకొండో రోజు సపిండీకరణ ద్వారా అతడికి యాతనా శరీరం ఇవ్వబడుతుంది. ఆ యాతనా శరీరంతో ఆ జీవాత్మ తనకు నిర్దేశించబడిన లోకాలకు ప్రయాణం చేస్తుంది. ప్రతి మాసికంలో ఇచ్చే తిలధాన్యాలతో బలం పుంజుకుని ప్రయాణం సాగిస్తుంది. సంవత్సర కాలంలో యాత్ర పూర్తి చేసుకుంటుంది. ఈ కాలం అంతా కూడా తన వారితో అనుబంధం వదులుకోలేక వారు పెట్టె పిండాలు స్వీకరిస్తూ వెళ్తూవుంటుంది. యమధర్మరాజు వేసే శిక్షలను అనుభవించేది ఈ యాతనా శరీరమే. శరీర భ్రాంతితో వున్నది కనుక జీవాత్మ అది తానే అనుభవిస్తున్నట్టు భావిస్తుంది. అతడి పాప పుణ్యాల అకౌంట్ ప్రకారం ఆ యాతన శరీరానికి ఆ శిక్షలు లేదా స్వర్గ భోగాలు లభిస్తాయి. ఒక్కసారి స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరినాక వారికి ఒక రోజు వ్యవధి మనకు సంవత్సర కాలము. వారు పోయిన తిధి నాడు వారికి తద్దినం పెట్టి తర్పణాలు వదులుతాము. అది వారికి భోజనము. అలా ఎవరైతే పిత్రు దేవతలను సంతోష పెడతారో వారిని తృప్తిగా ఆశీర్వదిస్తారు. వారు దేవతల కన్నా మనకు కావలసిన వారు. పితృదేవతలను క్షోభ పెట్టిన వారు వారి ఆగ్రహానికి గురయ్యి బాధలు అనుభవిస్తారు. కొన్ని పర్వదినాలలో వారికి తర్పణాలు వదిలే పద్ధతి మన సాంప్రదాయంలో వుంది. అది వారికి తేనీరు లా/ స్నాక్స్ లా అందే అవకాశం అన్నమాట. ఇక్కడ మనం పెట్టె పిండాలు వారికి ఎలా భోజనాలు అవుతాయి అంటే నేను ఇక్కడ online లో పంపిన డబ్బు వేరొక దేశంలో వారి కరెంసీలో వారికి అందడం లాంటిది. బ్రహ్మ కపాలం దగ్గర పెట్టిన పిండం ఆ తండ్రికి బ్యాంకు లో ఫిక్సెడ్ డిపాజిట్ లాంటిది .దాని మీద వచ్చే వడ్డీ తో ఆ పితరుల జీవనం గడుస్తుంది అన్నమాట. కానీ అక్కడ పిండం పెట్టినా కూడా సంవత్సరీక శ్రాద్ధం తప్పనిసరి. వారిని ఎంత తృప్తి పరచితే మనకు అంత సౌభాగ్యము, రక్షణ.

ఇలా ఊర్ధ్వలోకాలకు చేరిన పితృదేవతలు పిత్రులోకంలో వసురూపంలో మసలుతారు. తమ పితృదేవతలంటే కేవలం గతించిన మన తల్లిదండ్రుల మాత్రమె కాదు. మూడు తరాల వారి రూపం అక్కడ ఉంటారని చెబుతుంది శాస్త్రం. తండ్రి వసు రూపంలో, తాత గారు రుద్ర, ముత్తాతగారు ఆదిత్యరూపంలో ఉంటారని వారి అందరినీ త్రుప్తి పరచవలసిన బాధ్యతనే మనము పితృఋణం అంటాము. అలాగే ఇటువంటి ప్రక్రియ నిత్యం జరిగేట్టు నువ్వు వారసులను కనాలి, అప్పుడే ఇది నిరాటంకంగా సాగుతుంది.  వారందరికీ స్వాంతనకలిగేట్టు మనం చేసే పిండప్రదానం వారిని ఆనందపరచి మనకు తిరిగి ఆశీర్వాద రూపంలో తిరిగి వస్తుంది. వారు అప్పటికే మరొక జన్మ తీసుకున్నట్టు అయితే వారికి ఆ సమయానికి అదృష్టంగా అందుతుంది. ఒకొక్కసారి మనకు ఒక లాటరీ తగలవచ్చు, లేదా పెద్ద కష్టాలలో ఉన్నప్పుడు ఒక మంచి అదృష్టం ఏదో కలిసి రావచ్చును. అంటే మన పూర్వజన్మలో మన వంశం వారు మనలను ఉద్దేశించి శ్రాద్ధ దానాదులు చేసారని అర్ధం. నువ్వు పుచ్చుకోవడమే కాదు నీకు కూడా ఆ బదులు తీర్చుకోవలసిన విధి ఉన్నది. అందుకు నువ్వు కూడా శ్రాద్ధం, తర్పణం తప్పక వదలాలి. ఇది ధర్మశాస్త్రం నీ మంచి కోసం చెబుతున్నది. నమ్మిక ప్రధానం. నమ్మి చేస్తే తప్పక నీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది.

పితృదేవతలను సంతృప్తి పరచే విధానం మనకు శాస్త్రం బోధించి వుంది. తిలలతో వారిని ఆహ్వానించి తిలతర్పణం తిలలతో కలిసిన పిండి కానీ అన్నం గానీ ఉదకంతో వారికి ఇవ్వాలి. తిలలే ఎందుకు అంటే వారికి అందే medium అది. నేను అమెరికాలో ఉన్న ఒక స్నేహితునికి డబ్బు పంపాలంటే ఇక్కడున్న డబ్బుని మారకం ద్వారా ఆన్లైన్ లో ఎలా పంపితే వారికి చేరుతుందో ఇప్పటి సాంకేతికత చెప్పినట్టు ఇది సనాతన సాంప్రదాయం. తిలలతో స్వధాకారంతో ఇచ్చిన శ్రాద్ధతర్పణాలు వారికి చెందుతాయి. ఎలా అయితే స్వాహాకారంతో ఇచ్చిన హవనం అగ్నిదేవుడు ఒక పోస్ట్ మాస్టర్ లా  తీసుకువెళ్లి ఆ ఉపాస్య దేవతలకు అందచేస్తాడో, స్వధాకారంతో చేసిన తర్పణం పితృదేవతలకు అందుతుంది. ఒకసారి శంతనమహారాజుకు భీష్ముడు పిండప్రదానం చెయ్యబోతే శంతనమహారాజు స్వయంగా నీటి నుండి చెయ్యు చాపగా పరమధార్మికుడైన భీష్ముడు శాస్త్రం ఈ విధంగా చెప్పలేదని నీటిలోనే వదిలి ఆయనకు అందేలా చేస్తాడు. శాస్త్రం చెప్పిన విధంగా వదిలిన తర్పణాలు, పిండాలు పితృదేవతలు కర్మభూమి అయిన మన దేశంలో మాత్రమె గ్రహింపగలిగే శక్తి పితృదేవతలకు ఇచ్చాడు. భోగభూముల్లో చేసిన తర్పణాధులు వారు స్వీకరించలేరు. ఏమి కర్మ భూమి మాత్రమె ఎందుకు అంటే ఈ లోకానికి ఉదరం లాంటిది ఈ కర్మ భూమి. ఇక్కడ చేసిన కర్మలు మాత్రమె వారికి చేరుతాయి.

ఆపస్థంభ గృహ్యసూత్రములలో ఆచారకాండలో ఐదు రకాల శ్రాద్ధకాండ వున్నది. “సాపిండీ (పిండ ప్రదానం) , సంకల్ప (ఇద్దరు బ్రాహ్మణులకు సంకల్ప పూర్వకంగా పెట్టేది),  బ్రాహ్మణభోజన (ఒక బ్రాహ్మణునికి తర్పణం సకల్ప సహితంగా), ఉపాదాన (స్వయంపాకం ), అశ్రుతశ్రాద్దేషు (చెయ్యలేకపోతున్నా తండ్రీ అని అశ్రువులతో చెప్పుకోవడం)  పంచశ్రద్ధా: ప్రకీర్తితా“. ఒకదాన్ని కంటే ఒకటి ఒకొక్క మెట్టు తక్కువది. మూడులోకాలలో ఎక్కడున్నా చేరేట్టు ఒక పిండం నీటిలో జలచరా రూపంలో స్వీకరించే విధంగా, అగ్ని రూపం లో స్వధాకారం తో, ఆవుకు ఆహారంగా పెట్టి అందేట్టు మనం శ్రాద్ధ పిండాన్ని పెడతాము. అలాగే వసు రుద్ర ఆదిత్య రూపాలలో ఆవాహన చేసిన బ్రాహ్మణులను త్రుప్తాస్థ అని వారికి తృప్తి కలిగేలా శ్రద్ధగా భోజనం పెట్టి వారిని సంతోషపెట్టడం ద్వారా మన పితృదేవతలను ఆనందపెట్టినవారం అవుతాము. ఇక్కడ మనం DD తీసి చెప్పిన విధానం పాటిస్తే యెక్కడో ఉన్న మనవారికి డబ్బు నగదు చేరినట్టు ఇక్కడ మనం చేసిన శ్రాద్ధం వారికి ఆహారంలా అంది వారు ఆనందపడి మరల నిన్ను దీవించి నీకోసం దేవతలతో కూడా పోరాడి నీకోసం మంచి చేస్తారు మన పితృదేవతలు. శ్రాద్ధం తర్పణం ఎవరికోసమో కాదు చేసుకునేది, నీకోసం నువ్వు చేసుకోవడమే. తప్ప ఇందులో నువ్వు కోల్పోయేది ఏమీ లేదు, వస్తే మరికొంచెం పుణ్యం తప్ప. అందుకు శాస్త్రం చెప్పిన ఈ శ్రాద్ధం /తర్పణం శ్రద్ధగా చేసి బాగుపడదాం.

Saturday, December 15, 2018

మేలుకొలుపు

గొల్లపూడి మారుతీరావు వ్యాసం చదవండి...

అక్బరుద్దీన్‌ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్‌'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం?
మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా 'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్‌ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్‌ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు 'యముడికి మొగుడు' సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ, నారదుడినీ ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్ని గర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటి పరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా?
ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటు వేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, మరొక పక్క భయం - వారిని సంఘటిత పరుస్తుంది.
మనదేశంలో మనం మహారాష్ట్రులం, తమిళులం, బెంగాళీలం, వెనుకబడిన వారం, ముందుబడినవారం, కులాలవారం, రెడ్లం, కమ్మవారం, కాపులం, బ్రాహ్మణులం, శ్రీవైష్ణవులం, శైవులం, మాలలం, మాదిగలం -మనం సామూహిక ప్రతిపత్తిని ఏనాడూ ప్రకటించుకోము. ఎవరూ ఎవరిమాటా వినరు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరయినా ఎప్పుడయినా ముస్లింలకు ప్రాతిపదిక మతం. మనకి? వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం, డబ్బు, పదవి, ఎదుటివాడి పతనం -మరేదో, మరేదో.
హిందూదేశంలో ముస్లింల 'హజ్‌' యాత్రకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాలలో ఏ దేశంలోనూ ఈ ఉపకారం లేదు. శుభం. మరి భారతదేశంలో కాశీ, గయ, కేదార్‌, బదరీ, వైష్ణోదేవి యాత్రలకు మన ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యదేం? అడిగే నాధుడేడీ? వాళ్ల స్వార్దాలకే వ్యవధి చాలకపోయె. మన చిన్న పొట్టకు శ్రీరామరక్ష. మన కులానికి మేలు కలిగితే చాలు. మొన్న విశాఖపట్నంలో ఓ స్వామీజీని బహిరంగంగా కొట్టారు. కారణమేదయినా ఈ పనిని ఏదీ? ఒక 'ఇమామ్‌'కి దమ్ముంటే చేయమనండి. మనది భారతదేశం. పరాయి పెద్దని అవమానించమనడం ఉద్దేశం కాదు. మన మర్యాదకి నీడలేదని చెప్పడం ఉద్దేశం.
అక్బరుద్దీన్‌ చేసిన ప్రసంగం ఏ హిందువయినా చేసి బతికి బట్టకట్టగలడా? ముస్లింలు మాట దేవుడెరుగు. ఔదార్యం కట్టలు తెంచుకునే మన సెక్యులర్‌ వీరులు 'హిందుత్వం' పేరిట గొంతుచించుకోరా? అక్బరుద్దీన్‌ అరాచకాన్ని ఉత్తరప్రదేశ్‌లో మరో ముస్లిం నాయకుడు సమర్థించారు! హిందూ దేశంలో ముస్లింల కిచ్చిన ప్రత్యేక స్థానం మరే ముస్లిం దేశంలోనయినా హిందువుల కిచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ దేశంలో 15 శాతం మైనారిటీ వర్గాన్ని 85 శాతం మెజారిటీ వర్గం నెత్తిన పెట్టుకుంటోంది.
కరుణానిధికి రామాయణం కట్టుకథ. ఆయన మన ముఖ్యమంత్రి. దేవుడిని నమ్మని, నమ్మకం లేదని బల్లగుద్దే ఏ ముస్లిమయినా ఏ ముస్లిం దేశంలో నయినా నాయకుడు కాగలడా?
ఈ విచిత్రాన్ని ఎవరయినా గమనించారా? గాజాలో అరబ్బులు క్షేమంగా లేరు. పాకిస్తాన్‌లో వందలమంది ముస్లింలను వారే చంపుకుంటున్నారు. లిబియాలో, మొరాకోలో, ఆఫ్గనిస్థాన్‌లో, సిరియాలో, లెబనాన్‌లో, ఈజిప్టులో, ఇరాక్‌లో, యెమెన్‌లో ముస్లింలు హింసకు బలి అవుతున్నారు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లండులో, ఫ్రాన్స్‌లో, ఇటలీలో, జర్మనీలో, స్వీడన్‌లో, అమెరికాలో, నార్వేలో వారు క్షేమంగా, హాయిగా ఉన్నారు. అయినా ఆ దేశాల్లో ముస్లింలు పై దేశాల్లో ముస్లింలుగా ఉండాలనుకుంటున్నారు.
మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ముస్లింలు మైనారిటీలుగా రాయితీలు పొందుతున్నారు. శుభం, మరి ఈ దేశంలోనే జమ్ము కాశ్మీర్‌లో, మిజోరంలో, నాగాలాండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో, మేఘాలయలో మైనారిటీలయిన హిందువులకు ఆ రాయితీలు యివ్వడం లేదేం?
ముస్లిం మత కార్యకలాపాలను, వారి వ్యవహారాలను చూసే వక్ఫ్‌ బోర్డులున్నాయి. వాటి ఆదాయాన్ని ఈ దేశంలో ఎవరయినా ముట్టుకోగలరా? పదిమంది దర్శించే ప్రతి హిందూ దేవాలయ పరిపాలనా, ఆదాయం -రాజకీయ నాయకుల, వారి ప్రతినిధుల చేతుల్లోకి పోయిందేం?
ఎవరయినా మనల్ని తిట్టినప్పుడు -మనం హిందువులం. ఎవరూ తిట్టనప్పుడు -మనల్ని మనమే తిట్టుకునే స్వదేశీయులం. అదీ మన ప్రతాపం.
'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్‌!' అన్నాడు గిరీశం. అక్బరుద్దీన్‌ వంటి పెద్దలు ''వీళ్లంతా ఉత్త వెధవాయిలోయ్‌!'' అని నవ్వుకుని ఉంటారు. అందుకే రొమ్ము విరుచుకుని -ప్రేక్షకులు మురిసిపోయేలాగ -హిందూ దేశంలో హిందువుల్ని తిట్టి -తీరిగ్గా లండన్‌ వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ మన వీరంగం చూసి -అక్కడ పేపర్లలో చదువుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటారు.
కులాల పేరిట, వర్గాల పేరిట -కిష్టిగాడు, రాములు వెధవ, సీతి, లచ్చి స్థాయికి మతాన్ని యీడ్చిన గౌరవనీయులైన హిందువులు -మొదట ఇల్లు చక్కబెట్టుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తమలో ఏ లోపాలున్నా 'మతం'- భేషరతుగా -నయానికో, భయానికో -తమకి గుర్తింపునీ, బలాన్నీ, సామూహిక ప్రతిపత్తినీ యివ్వగల శక్తి అని ముస్లింలు నమ్ముతున్నారు. మనం ఏనాడయినా -ఎవరో మనని దుయ్యబట్టిన యిలాంటి అరుదయిన సందర్భాల్లో ప్రథమ కోపాన్ని చూపడం తప్ప -యిలాంటి సంఘటిత శక్తిని ప్రదర్శించామా?
అక్బరుద్దీన్‌ తప్పు చేశాడా? ఇప్పుడు క్రైస్తవ మతాన్ని సహాయం తెచ్చుకుంటాను. మీ మతాన్ని, మీ విలువల్ని, మీ విశ్వాసాల్ని, మీ ఆచారాల్ని గౌరవించే మొనగాడెవరయినా ఉంటే మొదటి రాయి వెయ్యండి.
నా ఉద్దేశంలో అక్బరుద్దీన్‌ ప్రసంగం మేలుకొలుపు. పేడ తినే బ్రాహ్మణ్యం, యముడిని వెక్కిరించే సినిమాలూ, స్వజనాన్ని గౌరవించుకోలేని స్వార్థం, వేలంటీన్‌ వేలం వెర్రికి విర్రవీగే సామూహిక పైత్యం, దేవుడు, దేవాలయాలు 'హిందుత్వం' అని రాజకీయ ప్రయోజనాలకు గొంతు చించుకునే అవకాశవాద పార్టీలూ మతానికి విలువని పెంచవు. అక్బరుద్దీన్‌ వంటి వారి నోటికి బలి అవుతాయి. అంతకంటే భయంకరమైన విషయం ప్రేక్షకుల ప్రశంస అనే హెచ్చరిక.

---- గొల్లపూడి మారుతీరావు

Saturday, December 8, 2018

అత్యంత మహిమాన్వితమైనది... బాసర క్షేత్రం

*వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ఏకైక సరస్వతీ ఆలయం*
💫🌞🌎🌙🌟🚩
🕉ఓంశ్రీమాత్రేనమః 🕉
అద్వైత చైతన్య జాగృతి
💫🌞🌎🌙🌟🚩

అత్యంత మహిమాన్వితమైనది... బాసర క్షేత్రం.

దక్షిణ భారత దేశంలో అత్యంత మహిమాన్విత క్షేత్రం.. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ నిలయం. ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మండలంలో గోదావరి నదీ తీరాన వెలిసిన చదువులమ్మ నెలవు. మనశ్శాంతి ప్రసాదించే ప్రాంతంగా పేరు పొందింది. భారత యుద్ధాన్ని చూసి చలించిన వ్యాస మహార్షి ప్రశాంత చిత్తంతో తపస్సు చేయడానికి వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలనాటి నుంచి నేటి వరకూ కూడా సరస్వతీ అమ్మవారు విశేష పూజలందుకుంటోంది.

బాసర ఆలయం దినదినప్రవర్థమానం చెందుతూ అఖండ కీర్తితో అలరారుతోంది. నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటు న్నారు. వందల మందికి అక్షర శ్రీకార పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని దర్శించని, దర్శించాలనుకోని విద్యార్థుల్లేరంటే అతిశయోక్తే అవుతుంది. ఇలా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయం మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది. నేడు వసంత పంచమి సందర్భం ఆలయ ప్రతిష్టపై ప్రత్యేక కథనం.                                                             

భైంసా/బాసర : బ్రహ్మండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిన అవసరం ఏర్పడింది. శక్తిని వర్ణించాలంటే మరింత తపోశక్తితోపాటు ఎలాంటి అంతరాయంలేని మహిమ గల ప్రశాంత వాతావరణం అవసరం ఏర్పడింది. దీంతో ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి బాసర (జాహ్నావితీరం) చేరుకున్నారు. ఇది గోదావరి నాబీ స్థానం. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బ్రహ్మేశ్వరం వరకు గోదావరి నాబీ స్థానం అంటారు. బ్రహ్మేశ్వరం ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్‌లో ఉంది.

ఇది అప్పటికే పుణ్యస్థలం కావడంతో వ్యాసుడు ధ్యానం చేసుకోవడానికి ఆగాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్న ఆయనకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైంది. దీంతో ఆ రూపం ఎవరిదా అని తన దివ్యదృష్టితో చూడగా జ్ఞాన సరస్వతీ అమ్మవారు కనిపించింది. పూర్తిరూపం కనిపించకపోవడానికి కారణం అడిగాడు. భూలోకంలోని కొన్ని పాప కార్యాల కారణంగా తన పూర్తి రూపాన్ని చూపెట్టలేకపోతున్నానని అమ్మవారు చెప్పింది. ప్రతీరోజు గోదావరిలో ధ్యానం చేసి పిడికెడు ఇసుకను నచ్చిన స్థానంలో వేయాలని, ఇలా వేసిన ఇసుకతో తన పూర్తిరూపం తయారవుతుందని, అనంతరం జ్ఞాన సరస్వతీగా అందరికీ దర్శనమిస్తానని అమ్మవారు తెలిపింది.

వ్యాసుడు గోదావరి తీరాన కొంత దూరంలో ఉన్న కుమారచర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు. అమ్మవారు చెప్పినట్లు ఇసుకను తీసుకువచ్చి ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించారు. ఇలా కొన్నేళ్లు గడిచిన అనంతరం అమ్మవారి రూపం పూర్తి కావడం ఆమె జ్ఞాన సరస్వతీగా ఆవిర్భవించడం జరిగిందని పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతీ దేవి ఆయనకు జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది.

జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున బాసర జ్ఞానానికి పుట్టుకగా వెలుగొందుతోంది. భారతదేశంలోని కాశ్మీర్, కన్యాకుమారిలలో సరస్వతీ ఆలయాలు ఉన్నా చదువుల తల్లి జ్ఞాన సరస్వతీ బాసరలోనే ఉందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఒక సరస్వతీ దేవినే ప్రతిష్టించడం సబబు కాదని అమ్మవారికి తోడుగా మహాకాళి, మహాలక్ష్మీలను ప్రతిష్టించారు. ముగ్గురు మాతలు పక్కపక్కనే భారతదేశంలో మరెక్కడా లేరు. ఈ అరుదైన దృశ్యం ఒక బాసరలోనే ఉండడంతో ఈ క్షేత్రానికి మరింత ప్రాధాన్యం చేకూరింది.

🕉🌞🌎🌙🌟🚩

థాయిలాండ్_లో_రామరాజ్యం_మీకు_తెలుసా?

#థాయిలాండ్_లో_రామరాజ్యం_మీకు_తెలుసా?

థాయిలాండ్ లో  రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు.

👉#సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.

వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు ,   ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు.

👉శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.

పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే #భూమిబల్_అతుల్య_తేజ్.

👉థాయిలాండ్ యొక్క అయోథ్య

థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - "  క్రుంగదేవ మహానగర
అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.

👉 థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.

థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

👉 థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం

థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో  రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.

థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -
1. రామ్ ( రాముడు )
2. లక్ ( లక్ష్మణుడు )
3. పాలీ ( వాలి )
4. సుక్రీప్ (సుగ్రీవుడు )
5. ఓన్కోట్ ( అంగదుడు )
6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
7. బిపేక్ ( విభీషణుడు )
8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
9. సదాయు ( జటాయు )
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
11. మారిత్ ( మారీచుడు )
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.

👉 థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు

ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
2. నారాయి (నారాయణ్ ) విష్ణువు
3. ఫ్రామ్ ( బ్రహ్మా )
4. ఇన్ ( ఇంద్రుడు )
5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
6. పాయ్ ( వాయు )

👉 థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు

గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite )  అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.

👉 థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి

మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలో ముస్లిం ఆక్రమణదారులు మన సంస్కృతిని నాశనం చేసి ముస్లింపేర్లతో మన పట్టణాలనూ , పట్టణాలలోని వీథులనూ మార్చివేసారు. స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ , హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ , థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది. ఈ బొమ్మని కొన్నిరోజులక్రితం నేను షేర్ చేసాను కూడా.

👉 ఈ వ్యాసం ఉద్దేశ్యం

అసలైన సెక్యులరిజం అంటే ఏమిటో మనం థాయిలాండ్ ని చూసైనా నేర్చుకోవాలి. మనసంస్కృతిని మనమే మర్చిపోతే జాతికి మనుగడ ఉండదు అని గ్రహించాలి. మన పిల్లలకు , రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.

ఈ వ్యాసం ఎలా ఉంది? కామెంట్ చేయండి.
నచ్చితే షేర్ చేయండి.

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...