Saturday, April 8, 2017

మహాస్వామి మక్కాయాత్ర

[06/04, 12:56 AM] ‪+91 93464 16199‬: *మహాస్వామి - మక్కాయాత్ర*
(మొదటి భాగం)

మార్చ్ నెల ఉషోదయ వేళ. జనవరిలో మొదలైన ౘల్లని గాలి తిమ్మెరలు ఇంకా వీస్తూనే ఉన్నాయి. తెలవారకుండానే టార్చిలైటు వెలుగులో ఒక పల్లకీ, నదీ తీరంలో ఊరేగింపుగా వెళ్తోంది. ముందు పల్లకీ, వెనుకగా కొంతమంది జనం, ఏనుగులూ, గుర్రాలూ, లొట్టిపిట్టల గుంపులూ.. అలా వెళ్తోంది.

మాయనూర్, హరిశ్చంద్రపురం, తిట్టచేరి దాటి వెళ్లి 'నాట్టం' అనే ఊరు చేరగానే పల్లకీ తలుపులను దండంతో కొట్టిన శబ్దం వినబడింది. వెంటనే నడకను ఆపారు.

అక్కడ ఒక వినాయకుని దేవాలయం ఉంది. అక్కడితో దారి కుడి ఎడమలు రెండుగా వెళ్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అక్కడి నుండి ఎడమవైపుగా ప్రయాణించాలి. కానీ, మరలా లోపలి నుండీ శబ్దం రావడంతో 'మాలి' అనే భక్తుడు, అది తాము ఎడమవైపు కాకుండా కుడివైపు ఉన్న దారిలో వెళ్లాలని అర్థం చేసుకుని, ప్రయాణాన్ని కుడివైపుగా మరల్చారు.

“ఇది బహుశః మన్మంగళం వెళ్ళే దారిలా ఉంది” అని గుంపులో నుండి ఒకరు అన్నారు. 'మనకు లోపలి నుండి ఆదేశం వచ్చింది కాబట్టి, మనం దాని ప్రకారం నడచుకోవాలి. ప్రతి విషయానికీ ఎదో కారణం ఉంటుంది' అని మాలి చెప్పడంతో ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

మన్మంగళం ఇంకా గాఢ నిద్రలో ఉంది. ఒక ఇంటిలోనుండి గృహిణి బయటకు వచ్చి, ఇంటి ముందర మట్టి దీపం ఒకదానిని వెలిగించి, వెంటనే దగ్గరలో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కూడా ఒక దీపం వెలిగించి వచ్చింది. ఇంటి ముందర చట్ట ఊడ్చి, కళ్ళాపి ౘల్లి శుభ్రపరౘడం మొదలుపెట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఊరేగింపుని చూసింది. ఆ ఊర్లో అంతటి గజ తురగ జన సమూహంతో వస్తున్న పల్లకిని చూసి నిశ్చేష్టురాలయ్యింది.

సరిగ్గా ఆ గృహిణి ఇంటికి దగ్గరగా రాగానే లోపలినుండి మరలా ౘప్పుడవ్వడంతో పల్లకీని కిందకు దించారు బోయీలు. సూర్యుని దర్శనంతో పూలు విచ్చుకున్నట్టుగా ఆ రోజు అంతటి అనుగ్రహం కలిగింది మన్మంగళం గ్రామానికి.

వారి దర్శనంతోనే సూర్యుడు ఉదయిస్తాడేమో అన్నట్టుగా పల్లకి తెరలు తొలగించుకొని బయటకు రాగానే సూర్యుడు కూడా అరుణ వర్ణ శోభితుడై ఉదయించి, ఆ ఊరిని పావనం చేసిన ఆ పాదపద్మాలను తన కిరణములతో తాకాడు.

ఆ ఊరు పావనమైనది. ఆ ఊరి ప్రజల అదృష్టము అంతా ఇంతా కాదు. వారిని కరుణింౘడానికే వచ్చినట్టు, 'నడిచే దైవం', కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామివారు ఆ ఊరి నేలపై అడుగు పెట్టారు.

ఇంటి ముందర శుభ్రం చేస్తున్న ఆమె అంతటి అనుగ్రహాన్ని ఊహింౘలేదు. కొన్ని క్షణాలు తన కళ్ళను నమ్మలేక అలా చూస్తూండిపోయింది. వెంటనే తేరుకొని లోపలికి వెళ్లి, తన భర్తకు విషయం చెప్పింది. భార్య చెప్పిన మాటలు విన్న వెంటనే ఆయన లేచి త్వరత్వరగా స్నానాదులు పూర్తి చేసుకొని, విభూది పూసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అతని భార్య నీళ్ళూ, మంగళహారతీ సిద్ధం చేసింది.

దంపతులిద్దరూ స్వామివారి కాళ్ళు కడిగి, హారతిచ్చి, స్వామికి నేలపై పది నమస్కారాలు చేసి మహాస్వామి వారిని ఆహ్వానించారు. కొద్ది క్షణాల్లోనే ఇంటి ముందర అరుగును శుభ్రపరిచి రంగవల్లులు తీర్చిదిద్దారు. మహాస్వామివారు అక్కడ కూర్చున్నారు.

ఈలోగా ఏనుగులూ, గుర్రాల అరుపులకి మొత్తం ఊరు నిద్ర నుండి మేల్కొంది. అందరూ ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి పళ్ళాలలో పూలు, పళ్ళు తీసుకుని చాలామంది వచ్చారు. ఒంటెలు, ఏనుగులను నది దగ్గరకు తీసుకుని వెళ్ళారు. మహాస్వామి వారి పరివారానికి చక్కని వసతి, ఆహారము ఏర్పాటు చేశారు.

అందరికి ఒక్కటే ప్రశ్న, “స్వామివారు ఇక్కడికి ఎలా/ఎందుకు వచ్చారు”?
ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా శ్రీమఠం మకాం చెయ్యదు. హఠాత్తుగా కంచి నుండి ఇక్కడికనే ఐనా కూడా రారు.

“ముందు అనుకున్నది నేడుంగరై వెళ్ళాలి అని. కానీ, పరమాచార్య స్వామివారు ఇక్కడికి రావాలని ఆదేశించారు. మేము వారి ఆజ్ఞానుసారం ఇక్కడకు వచ్చాము. ఏదో ముఖ్య కారణం ఉండి ఉంటుంది” అని చెప్పారు వైద్యనాథన్.

రెండు రోజులుగా స్వామివారు మౌనంలో ఉన్నారు. ఎప్పుడైనా మాట్లాడవచ్చు. 'ఇలా రావడం ముందుగానే తెలిసుంటే ఊరి పొలిమేరల నుండే పూర్ణకుంభ స్వాగతం పలికి ఉండే వాళ్ళం' అని అనుకున్నారు ఆ ఊరిజనం. కానీ, స్వామివారి ఆలోచన ఏముందో.

అందరూ స్నానాలు చేసి, పూజ ముగించారు. భోజనాలు కూడా అయ్యాయి. స్వామివారు కేవలం ఎండుద్రాక్ష, పాలు మాత్రమే తీసుకున్నారు. తక్కినవారికి ఆ గ్రామస్థులు ౘక్కగా అరటి ఆకులో భోజనం పెట్టారు. స్వామివారి ఆగమనం వార్త చాలా జోరుగా వ్యాపించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దర్శనానికి రావడం మొదలుపెట్టారు. అది మార్చి మధ్యకాలం అవ్వడంతో వ్యవసాయ పనులు అన్ని అయిపోవడంతో చాలామంది దర్శనానికి వచ్చారు. తామర పూలు, కొబ్బరి బొండాలు, అరటి బోదలు మొదలైనవి తెచ్చి స్వామికి సమర్పించారు. రోజు కూలీగా తన వంతు వచ్చిన ధాన్యాన్ని తెచ్చి సమర్పించింది ఒక ముసలి అవ్వ. మొత్తం ధాన్యాన్ని స్వామి ముందు ఉంచి నమస్కరించింది. అప్పుడు చూడాలి ఆనందపారవశ్యాలతో ఉన్న ఆ అవ్వ ముఖం. అరుగు మొత్తం భక్తుల సమర్పణలతో నిండి పోయింది.

గ్రామప్రజలకు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి స్వామివారితో మాట్లాడడానికి. పెళ్లి ఆలస్యం, గృహం కట్టడానికి ఆటంకాలు, ఆస్తి పంపకంలో తగాదాలు, ఇలా చాలా సమస్యలను స్వామివారి ముందు ఉంచారు.

(సశేషం)

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
[06/04, 12:57 AM] ‪+91 93464 16199‬: *మహాస్వామి - మక్కాయాత్ర*
(తరువాయి భాగం)

కానీ, స్వామివారు ఏమీ మాట్లాడక మౌనంగా అన్నీ వింటున్నారు. చేతులెత్తి అక్కడున్న అందరినీ ఆశీర్వదించారు. కొందరికి బిల్వదళాలూ, కొందరికి నిమ్మకాయలూ ఇచ్చారు. సమయం కదులుతూ ఉంది. కానీ, స్వామివారు మౌనం వీడలేదు. హఠాత్తుగా మాలిని పిలిచి సైగలతో ఏదో చెప్పారు. చేతులతో శివలింగం, గోపురం మొదలైనవి చూపిస్తున్నారు. బహుశా ఈ ఊళ్ళో అవి ఎక్కడున్నాయి అని అడుగుతున్నారేమో.

మాలి సైగలను అర్థం చేసుకున్నాడు. అక్కడున్న ఊరి జనంతో, “ఈ ఊళ్ళో శివాలయం ఎక్కడ ఉంది” అని అడిగాడు. కానీ, ఎవ్వరినుండీ జవాబు రాలేదు. వారిలో ఉన్న ముసలాయన, “ఇక్కడ ఒక విష్ణు ఆలయం ఉంది. అది కాక ఒక దేవీ ఆలయం, గ్రామ దైవం అయ్యనార్ ఆలయం, ఊరి పొలిమేరన గణపతి ఆలయం ఉన్నాయి. శివాలయం గురించి మాకు తెలియదు” అని చెప్పాడు. తొంభయ్యేళ్ల వృద్ధునికే తెలియకపోతే ఇక వేరేవారికి ఏమి తెలుస్తుంది?

మహాస్వామివారు మరలా కొన్ని సైగలు చేశారు. ఊరికి పైభాగాన విష్ణు ఆలయం ఉంది అంటే కింది భాగాన ఖచ్చితంగా శివాలయం ఉండి ఉంటుంది. కానీ, ఇప్పుడు అది లేదు అంతే. కానీ, గ్రామప్రజలకు ఆ విషయం ఏమీ తెలియదు. అందరూ మౌనంగా ఉన్నారు.

ఈ సంభాషణ జరుగుతుండగా అక్కడకు ఒక మహమ్మదీయ దంపతులు ఒకరు వచ్చారు. అతను తనని తానూ లతీఫ్ భాయ్ అనీ, తన భార్య మెహరున్నిసా అనీ పరిచయం చేసుకున్నాడు. వారితో పాటు తెచ్చిన రెండు అరటి గెలలను, రోజా పూలను స్వామివారికి సమర్పించారు. మహాస్వామివారు వారిని ఆపాదమస్తకం ఒక్కసారి చూశారు. స్వామివారిని దర్శించుకున్న పూజ్యభావం వారి కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లతీఫ్ భాయ్ తేరుకుని చెప్పడం ప్రారంభించాడు. అతని సంభాషణ వల్ల ఒక విషయం తెలిసింది.

కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ ఒక శివాలయం ఉండేది. కాలాంతరంలో అది కాస్త పాడయిపోయి భూమిలో కలిసిపోయింది. ఆ భూమి ఎంతోమంది చేతులు మారి చివరకు లతీఫ్ భాయ్ ఆధీనంలోకి వచ్చింది. “మా నాన్నగారి హయాంలో దర్గా భూములు చూసుకుంటున్నప్పుడు కొన్ని దేవాలయ భూములను కూడా తీసుకుని వ్యవసాయం చేస్తుండేవారు. శివుని భూములను చూసుకుంటూ మోసం చెయ్యడం వల్ల వంశం పాడవుతుందని గట్టిగా నమ్మేవారు. ఈశ్వరుని కృప వల్ల ఆ భయం, భక్తి, మంచితనం నాకు కూడా అబ్బింది. కానీ, ఏం చెయ్యాలి. మాకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు మానసిక రుగ్మత వల్ల పదేళ్ళ క్రితం చనిపోయింది.

నాకు అనిపిస్తుంది.. తెలిసో తెలియకో మేము ఏదో పాపం చేశాము. అందుకే అల్లాహ్ మాకు ఇలా చేశాడు అని నిభాయించుకొన్నాము. కాలం వేగంగా గడిచిపోయింది. నిన్న ఇంటి వెనుక మట్టిలో ఏదో పని చేసుకుంటుండగా ఒక శబ్దం వినబడింది. కొద్దిగా మట్టిని తీసి చూడగా ఒక పెద్ద శివలింగం కనపడింది. రాత్రి నాకు నిద్రపట్టలేదు. మేము చాలా ఆందోళన పడి, దాన్ని ఏం చెయ్యాలో పాలుపోక అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము. ఉదయం అవ్వగానే చుట్టుపక్కల వారు మీ రాక గురించి మాట్లాడుకుంటూండడంతో వెంటనే ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో పరమాచార్య స్వామివారే సెలవియ్యాలి“ అని స్వామికి నమస్కరించారు.

“మనస్ఫూర్తిగా ఆ భూమిని ఇవ్వడానికి నేను సిద్ధం. దానికి బదులుగా నాకు డబ్బు కూడా వద్దు. పూర్వం శివాలయం ఎలా ఉండేదో అలాగే నిర్మిద్దాం. అది గ్రామ ప్రజాలకు సమ్మతమైతే ఆల్లాహ్ కూడా సంతోషిస్తాడు” అని కళ్ళ నీరు పెట్టుకుంటూ తన్మయత్వంతో చెబుతున్నాడు. కేవలం మాటలు చెప్పడమే కాదు.

“మా వంతుగా శివాలయ నిర్మాణం కోసం ఈ కానుకని స్వీకరించండి" అని 101/- రూపాయలను సమర్పించారు. తొలి సమర్పణగా దీన్ని భావించండి” అని ఒక పళ్ళెంలో తాంబూలంతో సహా సమర్పించారు. అక్కడున్న వారంతా మాటలు రాక అలా చూస్తూండిపోయారు.

ఇప్పటిదాకా మహాస్వామివారు ఆ మహమ్మదీయుడు చెప్పిన విషయాలను మందహాసంతో వింటున్నారు. సైగల ద్వారా స్వామివారు ఏదో అడిగారు. అతనికి అదేమిటో అర్థం కాకపోవడంతో, ఒక పలకా, బలపం తీసుకుని వచ్చి స్వామివారికి అందించాడు. స్వామివారు ఆ పలకపై అతను మక్కా యాత్ర చేశారా అని అడిగారు. అందుకు అతను 'లేద'నీ, 'అల్లా మాకు అంత ధనం ఇవ్వలేద'నీ తెలిపాడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రణాళిక వేసుకున్నా వెళ్ళడం కుదరలేదని తెలిపాడు.

వెంటనే మహాస్వామివారు వైద్యనాథన్ వైపుకి తిరిగి విచారిస్తున్నట్టుగా, “స్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డ ఇంతటి ఉత్తమమైన వ్యక్తి, మరి మనం ఏదైనా సహాయం చెయ్యాలి కదా? అతని అవసరం కూడా ఇప్పుడు మనకు తెలుసు కదా” అన్నారు. పరమాచార్య స్వామివారి ఆలోచనని గ్రామ ప్రజలకు తెలిపారు వైద్యనాథన్.

అది విన్న వెంటనే ఊరి ప్రజలు అందరూ మరొక ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. వాళ్ళు మహాస్వామితో, “వారి మక్కా - మదీనా యాత్రకు అయ్యే ఖర్చును మేము భరిస్తాము పెరియవ” అని చెప్పారు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. స్వామివారు ఆ దంపతులిద్దరినీ, గ్రామప్రజలనూ ఆశీర్వదించారు.

తరువాత స్వామివారు నిదానంగా పైకి లేచి, గోడకు ఉంచిన దండాన్ని తీసుకొని పల్లకీలోకి వెళ్లి కూర్చున్నారు. వారివైపు చూసి నవ్వుతూ అందరినీ ఆశీర్వదించారు. మరలా అందరితో కలిసి యాత్ర బయలుదేరింది. అప్పుడు మహాలింగం అన్నారు, “ఇప్పుడు అర్థం అయ్యింది ఎందుకు మహాస్వామివారు ఈ ఊర్లో పల్లకి ఆపమన్నారో! ఏ కారణం లేకుండా ఏమీ జరగదు. పరమాచార్య స్వామివారి ప్రతి చర్యకీ ఒక కారణం ఉంటుంది”

--- వైద్యనాథన్ ‘శంకర భక్త జ్ఞాన సభ’ కార్యదర్శి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...