Wednesday, March 1, 2017

హిందూ ఆచారాలగూర్చి....

ఈ మద్య చాలామంది  ఆన్ లైన్ మాధ్యమాలలో హిందు దేవుళ్ళ గురించి, హిందు దేవాలయాలలో జరిగే నిత్య ధూప దీప నైవేద్యాల గురించి, అభిషేకాలగురించి విమర్శనాత్మకముగా రకరకాల  పోష్టులు పెడ్తున్నారు. పాలూ, తేనె, నెయ్యి ఇలా అనేకాలు అభిచేకమ్ పేరు చెప్పి వృధా చేసే బదులు పోషకాహార లోపంతో భాధపడుతున్నవారికి ఇవ్వొచ్చుగా అని. అలాగే ఇంకో కొత్త పల్లవి... పుణ్యం అనేది దేవుడికి దణ్ణం పెడితే కాదు లేనోడికి అన్నం పెడితే వస్తుందనీ... నిజమే వాళ్ళు చెప్పేది! కానీ వీళ్ళంతా ఎవడో ఎక్కడో ఒక పోష్టులో పెట్టాడని అదే పట్టుకుని వ్రేలాడుతుంటారు. పురాణేతిహాసాలలో ఉన్న సారంశం ఒక్కటే. "అహింసో పరమ ధర్మః"  "మానవ సేవయే మాధవ సేవ". ఇవి కొత్తగా ఎవరి చేతా చెప్పించుకోవలసిన పనిలేదు.

మనం అభిషేకానికి ఉపయోగించే పాలూ, తేనె  ఆ పోషకాహార లోపం తో బాదపడ్తున్న పిల్లలు/పేదలుకి ఇచ్చేస్తే అవి తాగేసి జీవితాంతం బ్రతికేస్తారా? ఇంకా వేరే ఆహారం ఏమి అక్కరలేదా? పాలు అభిషేకం చేస్తే తప్పు అనేవాళ్ళు ఆ పాలు ఇచ్చే గోవును నిర్దయగా చంపేస్తుంటే ఎందుకు మాట్లాడరు? పాశ్చాత్య దేశాలలో టామాటలతో, బత్తాయి పళ్లతో కొట్టుకుంటూ ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు మరి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎందుకు వాళ్ళకి ఈ సుద్దులు చెప్పారు?

హైందవ ధర్మలో దేవాలయాల ఏర్పాటు వెనుకు ఉన్న శాస్త్రీయత కొంతమందికి మాత్రమే అర్థం అవుతుంది. దేవాలయం ఆకారము, నిర్మాణం, రూపము ఇలా అన్నింటివెనుకా చాలా శాస్త్రీయత ఉంటుంది. అలాగే దేవాలయాలలో మనం పూజించే దేవీ దేవతా విగ్రహాలు స్వయంభు కొన్ని అయితే కొన్ని దేవతల చే నిర్మింపబడినవి, మిగితావి మానవులచేత ప్రతిష్టింప చేయబడినవి. వాటికి ప్రతిష్టింప చేయబడిన ముహూర్తం వల్ల ప్రాణం/శక్తి వస్తుంది. అలాంటి శక్తి కి నిత్య కైంకర్యాలు చేయకపోతే చెడుఫలితాలు చూపే ప్రమాదముంది. అలా నిత్యం ధూప దీప నైవేద్యాలు, అభిషేకాలు, కైంకర్యాలు చేస్తూ ఉండటం వలన ఆ దేవాలయంలోని విగ్రహాల నుండి వచ్చే దైవశక్తి ఆ గుడికి వచ్చిన వారికి తెలియకుండానే ఎన్నో రోగాలనుండి ఉపసమనం కలుగుతుంటుంది. కనీసం మానసిక ప్రశాంతత అయినా పొందుతుంటారు.

దీపాలు వెలిగించడం వలన ఆ చుట్టుప్రక్కల ఉండే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. తీర్ధం సేవనం వలన అందులో ఉండే పచ్చ కర్పూరం/తులసి ఆకులు/ఇతర ద్రవ్యముల యొక్క ఔషది గుణాల వలన చాలా రోగాలు నయమవుతాయి. శాటగోపమ్ వలన మన తలలో ఉండే వేడిని చెడు శక్తి తరంగాలను తొలగింప చేస్తాము. ఘంట కొట్టడం వలన దానినుండి వచ్చే శబ్ద తరంగాలు మనలోని షట్చక్రాలను హీల్ చేస్తాయి. మనం ఎప్పుడైనా  పురాణాలు తిరగేస్తే కదా అభిషేకాల వలన కలిగే ఫలితాలు తెలిసేది. ఎప్పుడు చూసినా బూతు పుస్తకాలు వల్లే వేయటమే ఇక పురాణాలు చదవటానికి సమయం ఎక్కడ ఉంటుంది?

ఒక భక్తుడు సాధారణ రోజుల్లో గుడికి వెళ్ళాడంటే తప్పనిసరిగా ఆ గుడిలో ఉన్న దేవాలయం లో ఉన్న హుండిలో కనీసం ఒక రూపాయి అయినా వేసి వస్తాడు. అలా వచ్చిన భక్తులు వేసిన కానుకలు అన్నింటినీ జమచేసి పండుగలకి, ఉత్సవాలకి కావలసిన ఏర్పాట్లు చేయటానికి ఉపయోగిస్తారు.  ప్రతిగుడి దగ్గర పండుగలు లేదా ఉత్సవాలు జరిగినప్పుడు ఉచిత అన్నదానాలు చేస్తుంటారు. అక్కడికి తినటానికి వచ్చేవాళ్ళంతా లక్షాధికారులు, కోటీశ్వరులు కారు. నూటికి 90 మంది పేదలే. అదంతా ఆ గుడికి వచ్చే వాళ్ళు హుండీలో వేసే డబ్బులతోనే అన్నధానాలు, ప్రసాదాలు ఇస్తుంటారు. ప్రఖ్యాత దేవాలయాలలో నిత్య అన్నదానం తినే వాళ్ళల్లో ఎంతమంది కోటిశ్వరులు ఉంటారండి. తినేవాళ్ళల్లో ఎక్కువమంది పేదలే కదా ఉండేది. ఇక చిన్న గుడి విషయానికి వస్తే చాలామంది ఆ చుట్టుపక్కల వాళ్ళల్లో ప్రసాదాలకోసమే వచ్చే వాళ్ళు కూడా ఉంటారని ఎంతమందికి తెలుసు?

ఇలా హిందూ దేవాలయాలను, అక్కడ జరిగే అభిషేక కార్యక్రమాలను నిందించే ముందు మనం ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకుంటే చాలా మంచిది. ఒకడు క్రొత్త బండి కొన్నాడంటె మందు పార్టీ ఇవ్వాలి... వాడికి గర్ల్ ఫ్రెండ్ పడిందంటే  మందు పార్టీ ఇవ్వాలి.. క్రొత్తగా ఉద్యోగం వచ్చిందంటే మందు పార్టీ ఇవ్వాలి...  వాడికి టైమ్ బాగోక నిశ్చితార్ధం జరిగి  పెళ్ళైనా మందు పార్టీ ఇవ్వాలి... శోభనమ్ జరిగినా, వాడి భార్య నీళ్ళు పోసుకున్నా, పిల్లలు పుట్టినా మందు పార్టీ  ఉండాలి.

గర్ల్ ఫ్రెండ్ ని ఊరంతా తిప్పటానికి, దాని ఫోన్ చార్చ్జింగ్ చేయించటానికి, గిఫ్టులకి, సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, దిస్కోలకి ఇలా ఎంత తగలేస్తున్నారో ఆలోచించారా?

ఏ అప్పుడు గుర్తుకురాదేమండీ ఈ పోషకాహార లోపం తో ఉండే వాళ్ళ సంగతి? దేవాలయాలలో జరిగే నిత్య కైంకర్యాలవలన వాతావరణము సుద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యము కూడా బాగుపడ్తుంది. కానీ మందు పార్టీల వలన, భిర్యానీలు తినడం వలన, కే.ఎఫ్.సీ లు, డోమినోలకి బార్లకీ రేష్టారెంట్లకి వెళ్లి వేలకి వేలు డబ్బులు పోసి ఆరోగ్యం పాడు చేసుకుని మరీ వస్తాము కదా? మరి అప్పుడు ఎందుకు ఆ పోషకాహార లోపం తో బాదపడ్తున్న పిల్లలు/పేదలు గుర్తుకురారు?

హైందవాన్ని చులకనగా చేసి మాట్లాడుతుంటే బాధ వేసి ఇలా నా నిరసనని తెలియ చేస్తున్నాను. ఎవరినీ నొప్పించాలని కాదు.
సదా ఆ దేవుని సేవలో.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...