Saturday, January 21, 2017

మంత్రోపదేశం

మంత్రము అంటే ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ - దేనిని మననం చేస్తే రక్షణ చేయగలదో దానిని మంత్రము అంటారు. మననం చేస్తే రక్షణ చేయగలిగినటువంటి శక్తి దేనియందు నిక్షేపింపబడి ఉంటుంది అంటే బీజాక్షరములతో కూడుకున్నటువంటిది అయితే దానికి రక్షణ శక్తి అంతర్లీనంగా ఉంటుంది అని శాస్త్ర వాక్కు. ఒక్కొక్క మంత్రం అన్నీ బీజాక్షరాలతో ఉండవచ్చు. ఒక్కొక్క మంత్రంలో ఒక్క బీజాక్షరం ఉండవచ్చు. పంచాక్షరీ మహామంత్రంలో ఒక్కటే బీజాక్షరం. అష్టాక్షరీ మహామంత్రంలో ఒక్కటే బీజాక్షరం. గాయత్రీ మహా మంత్రం ఉంది – 24బీజాక్షరాలే. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఋషి ఉంటారు. ఆ బీజాక్షరానికి ఒక దైవం ఉంటాడు. ఆ బీజాక్షరాన్ని మనం మననం చేసినప్పుడు అది లోపల విష్ఫోటనం అయి ఋషి యొక్క అనుగ్రహం చేత, దేవత యొక్క అనుగ్రహం చేత అది ఎవరు మననం చేశారో వారిని రక్షించేటటువంటి శక్తిని లోపల ప్రసారం చేస్తుంది.
అటువంటి మంత్రాన్ని ఒక గురువు దగ్గర పుచ్చుకోవడానికే ఉపదేశము అని పేరు. ఈ ఉపదేశం చేయడం అనే ప్రక్రియ అనేక విధాలుగా ఉంటుంది. హస్తమస్తక సంయోగం అని గురువుగారు తన చేతిని ఎవరికి ఉపదేశం చేస్తున్నారో వారియొక్క మూర్ధన్య స్థానమునందు అంటే తలమీద చేతిని ఉంచి సంకల్పం చేస్తారు. అంటే అవతలి వారికి కూడా ఆ మంత్రాధిష్టాతదేవత యందు నమ్మకముండి ఆ మంత్రము చేత రక్షణ పొందాలనే కుతూహలం ఉండి ఆ మంత్రాధిష్టాన దేవతయందు మనస్సు నిలబెట్టడంలో అభిరుచి కలిగి ఉంటే మనస్సు దానిని ఆశ్రయించడానికి యోగ్యతని పొంది ఉంది గనుక అంతకుపూర్వం ఎన్నో పర్యాయములు ఆ మంత్రాన్ని జపం చేసి ఆ మంత్రం యొక్క అధిదైవతం యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు ఎవరు ఉంటారో అటువంటి వారు శిష్యుడికి ఉపదేశం చేస్తారు. అలా హస్తమస్తక సంయోగం చేయడంలో గురువుగారికి, శిష్యుడికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. అది ఒక ప్రక్రియ.
రెండవది గురువుగారు తనయొక్క కాలి వేలికి తాడు కట్టుకుని శిష్యుని చేతికి కాని, కాలికి కానీ తాడు కట్టి తనలో ఉన్నటువంటి ఆ జపం చేసినటువంటి శక్తిలో కొంతభాగం శిష్యునికి వెళ్ళేటట్లుగా అనుగ్రహిస్తాడు. తత్కారణం చేత శిష్యునికి కూడా ఆ మంత్రమునందు ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి గురువుయందు పరిపూర్ణమైనటువంటి భక్తివిశ్వాసములు కలిగేలా అనుగ్రహించి ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. మంత్రోపదేశం మనం ఎవరి దగ్గర పొండుతామో వారినే గురువు అని పిలుస్తారు.
గురువులలో ప్రధానంగా అయిదురకాల గురువులు ఉంటారు అంటుంది గురుగీత - సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధగురువు.
ఈ అయిదుగురిలో వాచక గురువు అంటే చిన్నతనంలో చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు.
సూచక గురువు అంటే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమంలో పాటించవలసిన నియమ నిబంధనలను మనకు చెప్పే గురువుగారు.
బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసే గురువుగారు. ఆ మంత్రం విశేషమైన శక్తిచేత ఇక్కడా రక్షిస్తుంది, శరీర పతనానంతరం రక్షిస్తుంది. ఒక్కొక్కచో దాని అనుగ్రహం చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా పోవచ్చు. ఇంత గొప్ప ఉపకారం గురువు చేస్తాడు. తల్లీ తండ్రీ కూడా చేయరు. అందుకే మంత్రోపదేశం చేసినటువంటి గురువు ఎవరుంటారో ఆయన పరమేశ్వరుడితో సమానం. ఆ గురువుకు, పరమేశ్వరుడికి అభేదాన్నే పాటిస్తారు. ఈశ్వరుణ్ణి కర చరణాదులతో ఎదురుగుండా కనపడితే ఎటువంటి భావనతో చూసి నమస్కరిస్తామో మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు కూడా అదే స్థానంలో నిలబడతారు. అటువంటి మంత్రోపదేశం చేయగలిగినటువంటి స్థాయిని పొందినటువంటి గురువులందరూ కూడా సశిష్యులై ఎవరికి నమస్కరిస్తారో అటువంటి వారియందు మంత్రములన్నీ కూడా చేరి ఉంటాయి. వారి శరీరమే మంత్రపూతం అవుతుంది. అంత స్థాయిని పొందిన మహా పురుషులుంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు – వారు ఉపదేశం చేయలేని మంత్రం అన్నది లేదు. శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు అలాగే ఇప్పుడు పీఠాధిపతిగా ఉన్న భారతీ తీర్థ మహాస్వామివారు, ఇటువంటి వారు అవతలి వారిని చూడగానే వారికి ఏ మంత్రం ఉపదేశం చేస్తే వారు ఉన్న స్థితిలో వారికి విశేషంగా అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతుంది, వాళ్ళు ఉన్న స్థితిలో అది వాళ్ళకి ఉపకారం చేస్తుంది అన్నది నిర్ణయించగలిగి ఉంటారు.
అందుకే శృంగేరీ చంద్రశేఖర భారతీస్వామివారు పీఠాధిపత్యంలో ఉండగా ఒక వ్యక్తి వెళ్ళి నాకు ఫలానా మంత్రాన్ని ఉపదేశం చేయండి అని అడిగారు. స్వామివారు రేపు రండి ఉపదేశం చేస్తాను అన్నారు. రోగి చెప్పవలసింది రోగం ఒక్కటే. ఏ మందు ఇవ్వాలో చెప్పవలసింది వైద్యుడు. నీకు ఏ మంత్రం ఇవ్వాలో చెప్పవలసింది నేను. నాకు ఈ మంత్రం కావాలి అని నువ్వు కాదు అడగవలసినది అని మంత్రోపదేశం చేశారు. ఉపదేశం చేసిన మంత్రం చేత ఎంత శక్తి ఆవిర్భవిస్తుందో బీజాక్షరములతో కూడుకున్నటువంటి మంత్రములను మననం చేయడం వల్ల ఎంత శక్తి విస్ఫోటనం అవుతుందో దానిచేత ఎటువంటి ఇక్కట్లను కూడా అధిగమిస్తారో తెలుసుకోవాలంటే చంద్రశేఖర భారతీస్వామివారి జీవిత చరిత్ర చదివితే అటువంటి దృష్టాంతాలు ఎన్నో కనబడతాయి. మంత్రం అంటే మంత్రమే.
కొన్ని శ్లోకములకు మంత్రస్థాయి కలుగుతుంది. ఆదిత్య హృదయం శ్లోకాలుగా ఇచ్చినా మంత్రస్థాయిని పొందింది. జయమంత్రం శ్లోకాలుగా ఇచ్చినా రామాయణంలో మంత్రస్థాయిని పొందాయి. అవి గురువు ఉపదేశం చేయాలి.
గురువు గారి దగ్గర ఉపదేశం పొందేటటువంటి పర్యంతమూ అది ఇవ్వవలసిన విస్ఫోటన శక్తిని ఇవ్వదు. అటువంటి గురువు మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు.
ఉపదేశ ప్రక్రియలో సాధారణంగా కుడిచెవిలో మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. దంపతులుగా ఉన్నప్పుడు భార్య మంత్రోపదేశం పొందడం కన్నా కూడా శాస్త్ర విహితమైన పధ్ధతి ఏమిటి అంటే భర్త మంత్రోపదేశాన్ని పొందాలి. ఎందుచేత అంటే ‘యో మే భర్తా సమే గురుః’ – భార్యకు భర్త సహజసిద్ధమైన గురువు. బిడ్డకు తండ్రి ఎలా గురువో పెళ్ళి అయిపోయిన ఆడదానికి భర్త సహజంగా గురువు. చాలా గొప్పవాడు. పరమేశ్వరుని స్థాయిలో ఉంటాడు.
నాఽతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహమ్!
సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమివావ్యయమ్!!
అంటుంది అనసూయమ్మ. అంత గొప్పవాడైన భర్త మంత్రోపదేశాన్ని పొంది కొంతకాలం జపం చేసిన తర్వాత తాను జపం చేసిన మంత్రం ఏదైతే ఉందో అది భార్యకి ఉపదేశం చేస్తే ఇద్దరూ కలిసి ఆ మార్గంలో నడవగలుగుతారు. ఒక మంత్రాన్ని ఉపదేశం పొందినప్పుడు దాని అంగన్యాస కరన్యాసాలు కానీ ధ్యానశ్లోకం కానీ ఏ గురువు దగ్గర ఉపదేశం పొందారో ఆ మంత్రసంబంధమైన జపంలో వచ్చే వైక్లబ్యాలు ఏమైనా ఉంటే ఆ గురువునే ఆశ్రయించి అడగడం ఎప్పుడూ మంచిది తప్ప ఒకరి దగ్గర ఉపదేశం పొంది వేరొక గురువును ఆశ్రయించి సమాధానం పొందడం కన్నా ఏ గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నారో ఆ గురువు గారి దగ్గరే ఆ మంత్రానికి సంబంధించిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. ఒక్కొక్కచో గురువుగారు శరీరంతో ఉండకపోవచ్చు. కానీ గురువు అని నమ్మకం ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టినా గురువును ప్రార్థన చేస్తే ఏదో ఒక రూపంలో ఆయన నీ సమస్యను పరిష్కరిస్తారు అనడంలో వ్యక్తిగతంగా నాకు ఏవిధమైన అనుమానం లేదు. గురువు గురువే. మనకు ఆ గురి ఆయనయందు ఉండాలి. ఆ గురి మనకు లేనప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడైనా మనకు గురువు కాలేడు.
కాబట్టి మంత్రోపదేశం అనే మాటలో అంతర్లీనంగా ఇన్ని విశేషాలు నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి గురువు జీవితంలో లభించడం అటువంటి గురువు యొక్క శుశ్రూష చేయడం చేత వ్యక్తి ఎంతో వృద్ధిలోకి వస్తాడు. అందుకే మనిషి జీవితంలో చేసి తీరవలసింది ఏది అంటూ చెప్పేది ఏది అంటే శాస్త్రం – గురు శుశ్రూష. గురువుగారి శరీరం పదికాలాలు ఉండేటట్లుగా శిష్యుడు చూసుకోవాలి. గురు శుశ్రూష అంటే గురువుగారి కాళ్ళు పట్టడం, పనులు చేసిపెట్టడం, ఆయన బడలిపోకుండా చేసుకోవడమే కాదు స్థాన శుశ్రూష అని గురువుగారు ఉన్న ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుతారు. అలా ఉంచడం చేత పరమేశ్వరుడికి సేవ చేయడం ఎంతో గురువుగారి సేవచేయడం కూడా అంతే.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...