*హంసక్షీర న్యాయం.*
ఈ న్యాయం హంసకి పాలని నీళ్ళని వేరుచేసి, పాలని మాత్రమే స్వీకరించె నైపుణ్యం ఉంది అనే భావం తెలుపుతుంది.
ముందుగా ఈ శ్లోకం చూడండి.
హంస శ్వేతః బకః శ్వేతః/ కోభేదః బకహంసయో:
నీరక్షీర వివాదేతు / హంసఃహంసః బకః బకః.
అనగా :
హంస తెల్లగా ఉంటుంది, కొంగకూడా తెల్లగానే ఉంటుంది వాటిమధ్య ఏం బేధము ఉంది? అనే సందేహం వస్తే నీళ్ళని, పాలని వేరు చేసే నైపుణ్యంలో హంస హంసే, కొంగ కొంగే. హంసకి ఉన్న నైపుణ్యం కొంగకి లేదు అని అర్థం.
ఇట్టిదే ఇంకో ఉదాహరణ:
కాకః కాలః పికః కాలః/ కోభేదః పిక కాకయో:
వసంతకాలే సంప్రాప్తే/ కాకఃకాకః పికఃపికః
కాకినలుపు, కోకిలనలుపు వాటి మధ్య భేదమేమిటి? అంటే వసంతకాలం వచ్చినపుడు కాకి కాకే కోకిల కోకిలే! వసంత మాసంలో కోకిల పాడినట్లు కాకి పాడ లేదుకదా!
ఇదేభావాన్ని వేమన చక్కని పద్యంలో చెపుతాడు.
ఉప్పు కప్పురంబునొక్క పోలిక నుండు
చూడజూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
అల్పాక్షరముల అనల్పార్థ రచన అంటే యిదే కదా! చూడటానికి అందరు ఒక్కటిగానే కనబడతారు కాని వారి, వారి ప్రవర్తన విషయంలో మంచి చెడులు బైటపడతాయి. హంస కొంగ, కాకి కోకిల. ఉప్పు,కప్పురం. ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు. కనుక మంచి, చెడులను తెలుసుకొని మంచిని గ్రహించి చెడుని విడిచి పెట్టాలని ఈ హంసక్షీరన్యాయం తెలుపుతుంది.
కవికులగురువు కాళిదాసు ఏమన్నాడో చూడండి
పురాణ మిత్యేవ నసాధు సర్వం/ నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతః
పరీక్షాన్యతరత్ భజంతే/ మూఢ: పరః ప్రత్యయనేయ బుద్ధి:||
అనగా సాహిత్యం కాని, మరే విషయమైన కాని ప్రాచీనమైనదంతా మంచిది, కొత్తదంతా చెడ్డది అనినిర్ణయంచక, పరిశీలించి దేనిలో మంచి ఉందో దానిని మాత్రమే విజ్ఞులు గ్రహిస్తారు. మూర్ఖులు పరిశీలించకుండానే నిర్ణయం తీసుకొంటారు. మంచి చెడు, కష్టం సుఖం, చీకటి వెలుగు, సత్యం అసత్యం, ధర్మం అధర్మం, పుట్టుక మరణం, ఈ ద్వంద్వాలన్నీ ప్రపంచలో సహజమైనవి. వీటినుండి ఎవరు తప్పించుకోలేరు. అలాగే “కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురు శత్రువులు వీటినే అరిషడ్వర్గాలు {అరి= శత్రువు. షట్= ఆరు} అంటారు. వీటిని అనుభవించి అదుపులో ఉంచుకోవాలి కాని, వీటికి దూరంగా ఉండలేము.
వీటికి అతీతమైన వారు మహాత్ములు, ఋషులు. అట్టి మహానుభావులు దర్శించి, మనకి తెలిపిన అనేక మంచి విషయాలని తెలుసుకొని ఆచరించడం మన విధి. మంచిని హంసక్షీరన్యాయంగా గ్రహించడం అందరికి శ్రేయస్కరమని పెద్దల ఉవాచ.
(బి.లక్ష్మీనారాయణ శర్మ గారి సౌజన్యం)
No comments:
Post a Comment