Friday, February 23, 2018

బిజిలి మహాదేవ్ మందిర్

ఈ గుడిపై 12 ఏళ్లకోసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది

కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

ఉరుములు... మెరుపులు... పెళపెళమంటూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.

కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి... తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో... శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది.

ఇలా ఒకటి రెండుసార్లు కాదు... వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది.ఈ ఆలయం పేరు బిజిలి మహాదేవ్ మందిర్. ఈ ఈశ్వరుడి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఉంది. ఇలా జరగడానికి కారణాలు వివరించే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి జనాన్ని, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు. బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు.

అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచివుండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. కానీ పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని... ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి.
12 ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగు పడడం, అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీకాదు. ఇది కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఇక ఈ భోళాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ.

No comments:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...