Saturday, January 21, 2017

పురాణాలలో యాదవుల చరిత్ర

పురాణాలలో  యాదవుల చరిత్ర

రఘువంశం వారికి రాఘవులు అని ఏవిధంగా వ్యవహారమో, అదే విధంగా యదువంశం వారికి యాదవులు అని వ్యవహారం.

యదువు తల్లి దేవయాని.  ఆమె మృతసంజీవనీవిద్య ను కనుగొన్న భృగువంశీయుడైన  శుక్రాచార్యుని కుమార్తె.  యదువు తండ్రి యయాతి.  ఆయన చంద్రవంశానికి చెందిన సుక్షత్రియుడు.  యదువు తాతగారు నహుషుడు.  ఆయన  దేవలోకంలో ఇంద్రపదవిని అధిష్ఠించిన ఘనచరిత్ర కలవాడు.  

యదువు సోదరుడు అనువు.  అతని వంశంలో పుట్టినవాడే శిబి చక్రవర్తి.  ఒక పావురాన్ని గ్రద్దబారినుండి కాపాడేందుకు తన శరీరంలోని మాంసాన్ని కోసి ఇచ్చిన మహాదాత.  అతని సంతానం బలి.   అతనికి ఆరుగురు పుత్రులు.  అంగుడు,  వంగుడు,  కళింగుడు,  సుహ్ముడు, పుండ్రుడు, ఆంధ్రుడు.  వారందరూ మహావీరులు.  తమతమ పేర్ల పేరిట భారతదేశం తూర్పు  ప్రాంతాలలో రాజ్యాలను ఏర్పరచుకున్నారు.  

యయాతి తన రాజ్యంలో దక్షిణభాగానికి యదువును ప్రభువుగా చేశాడు.  ఆ యదువుకు సహస్రజిత్తు,  క్రోష్టుడు, నలుడు రిపుడు అని నలుగురు కొడుకులు.  ఈ నలుగురు, ఆ నలుగురి కొడుకులు, వారి మనుమలు, మునిమనుమలు, ఇలా వారి వంశంలోని తరతరాలన్నిటికీ యాదవులు అని పేరు.
 
సరే, అందులో సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు.  అతని కుమారుడు హైహయుడు.  వీరందరూ ఆకాలంలో మహావీరులైన క్షత్రియులు.  హైహయవంశంలోనే కార్తవీర్యార్జునుడు జన్మించాడు.  అతడు దత్తాత్రేయుని భక్తుడు.  మహాయోగి.  మహాపండితుడు.  తరగని సంపద కలిగినవాడు.  అసంఖ్యాకమైన యజ్ఞయాగాదులను చేసి గొప్ప దానాలు చేసిన మహాదాత.  అంతేకాదు, తనపై పోరాటానికి దిగిన రావణాసురుని పట్టుకుని అతనిని పిల్లకోతిలా ఆడించిన మహాబలుడు.  అయితే అంతటి వాడు కూడా విధి వక్రించి జమదగ్నిమహర్షి ధేనువును ఆశించి దానిని బలవంతంగా లాక్కుని పోయాడు. దానితో పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యుని చంపేశాడు.  అప్పటినుండి అతని వంశం నామమాత్రావశిష్టం అయిపోయింది.  

యదువు రెండవ కుమారుడు క్రోష్టుడు కదా - అతడు, అతని సంతానం తరతరాలుగా గొప్పగా రాజ్యాలనేలుతూ వచ్చారు.     వారిలో శశబిందు మహారాజు ఆరోజులలోనే విమానాలలో విహరించిన చరిత్ర కలవాడు.  సప్తద్వీపాధిపతిగా పేరుగాంచినవాడు.  ఆయన మునిమనుమలలో ఒకడు విదర్భుడు.  విదర్భుని మనుమలలో ఒకడైన చేది తన పేరుమీద ఒక రాజ్యాన్ని ఆరభించినవాడు. విదర్భుని మరొక కుమారుడైన క్రతుని మునిమునిమానులలో ఒకడు సాత్వతుడు.  అతని కుమారుడైన మహాభోజుని కుమారులందరూ భోజరాజులుగా పిలువబడ్డారు.  సాత్వతుని మరొక కుమారుడు వృష్ణి.  ఈ వృష్ణికి మునిమునిమనుమడు సాత్యకి.  ఇతడు మహాభారతంలోని అర్జునునికి శిష్యుడు.   వృష్ణికి మరొక కుమారుడైన యుధాజిత్తు వంశంలో కొన్ని తరాల తరువాతి వాడే మనకు వినాయకచవితి కథలో వినవచ్చే శ్యమంతకమణి సత్రాజిత్తు.  ఆయన కూతురే సత్యభామ.  

సాత్వతుని మరొక కుమారుడు అంధకుడు.  ఆయనకు ఇద్దరు కుమారులు.  దేవకుడు, ఉగ్రసేనుడు.  దేవకుని కూతురే వసుదేవుని భార్య, భగవంతుని గర్భాన మోసి కన్న ధన్యురాలు దేవకి.  ఉగ్రసేనుని కుమారుడే మేనల్లుళ్ళను క్రూరంగా చంపదలచిన కంసుడు.  

యుధాజిత్తు తన మనుమడికి తన తాతగారిపేరే పెట్టుకున్నాడు - వృష్ణి.  అతనికి చిత్రరథుడు అనే కుమారుడు.  అతని మనుమడు శూరుడు.  ఆ శూరునికి మారిష అనే భార్య.   వారి పుత్రుడే వసుదేవుడు.  దేవదేవుని కన్నతండ్రి.  వ్రేపల్లెలో గోపాలకుడైన నందునికి ప్రాణమిత్రుడు.  తన మిత్రుని భార్య అయిన యశోదకు జగన్మోహనమూర్తి అయిన తన కుమారుని పెంచే భాగ్యం కలిగించినవాడు.  

ఆ వసుదేవునికి ఐదుగురు చెల్లెండ్రు.  అందులో ఒకరు పృథ.  ఆమెను కుంతిభోజుడు పెంచుకున్నాడు.  ఆమె స్వయంవరంలో పాండురాజును వరించింది.  వారి సంతానమే ధర్మరాజభీమార్జునులు.  పాండవులు.  రెండవ చెల్లెలు శ్రుతదేవి.  కరూషదేశాధిపతి  అయిన వృద్ధశర్మ ఆమె భర్త.  వారి కుమారుడే దంతవక్త్రుడు.  కృష్ణునితో విరోధించి హతమార్చబడ్డాడు.  మూడవచెల్లెలు శ్రుతకీర్తి.  ఆమె కేకయరాజైన ధృష్టకేతువును వివాహమాడి సంవర్ధనుడు మొదలైన మహావీరులను కన్నది.  నాల్గవచెల్లి రాజాధిదేవి.  ఆమె అవంతిమహారాజైన జయసేనుని వివాహమాడింది.  ఆమె కూతురు మిత్రవింద.  ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకరు.  రాజాధిదేవి కుమారులు మహావీరులైన విందానువిందులు.  దురదృష్టవశాత్తు వారు కురుక్షేత్రంలో దుర్యోధనుని తరపున పోరాడవలసివచ్చింది.  

దుర్యోధనుడు మొదలైన వారు పాండవులకు పెదనాన్న కొడుకులైతే, ఈ విందానువిందులు పినతల్లి కుమారులన్నమాట.  విధివశాత్తు వీరు యుద్ధంలో అర్జునుని చేతిలో మరణించారు.  వసుదేవుని ఐదవ చెల్లి శ్రుతశ్రవ.  ఆమె చేదిరాజైన  దమఘోషుని వివాహమాడింది.  వారి కుమారుడే శిశుపాలుడు.  కంసుడి మామ అయిన జరాసంధుడికి ఇతడు అనుంగు అనుచరుడిగా వ్యవహరించాడు.  రుక్మిణిని ఇతడిని ఇచ్చి చేద్దాం అనుకుంటే రుక్మిణికి అది ఇష్టం లేక శ్రీకృష్ణునికి రాయబారం పంపడం, శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తెచ్చి పెండ్లి చేసుకొనడం తెలిసిందే.  మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం ఈ శిశుపాలుడు చేసిన నూరు తప్పులను సహించిన శ్రీకృష్ణుడు ధర్మజుని రాజసూయయాగం ముగింపుసభలో శిశుపాలుని అనుచితమైన ఔద్ధత్యాన్ని సహించలేక హతమార్చేశాడు.  

ఈవిధంగా యదువంశంలో పుట్టడం వల్ల శ్రీకృష్ణుడు యాదవుడని, వృష్ణి వంశంలో పుట్టడం వల్ల వృష్ణివంశప్రదీపకుడని, వార్ష్ణేయుడని, శూరుని మనుమడు కావడంవల్ల శౌరి అని పిలవబడ్డాడు.  

తన చెల్లెలు సుభద్రను తన ప్రియమిత్రుడు, మేనత్తకొడుకు అయిన అర్జునునికి ఇచ్చి పెళ్లి చేశాడు.  తన అల్లుడైన కంసుని చంపాడనే కోపంతో జరాసంధుడు పదే పదే మధురమీదకు దండయాత్రకు వస్తూంటే సముద్రమధ్యంలో ద్వారక అనే జలదుర్గాన్ని నిర్మింపజేసి యాదవులను కాపాడాడు.  భీముని చేత ఆ జరాసంధుని చంపించేశాడు.  

కలియుగంలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడబోయే జనాలకు భగవద్గీత అనే జ్ఞానదీపాన్ని వెలిగించాడు.  భూభారాన్ని తగ్గించేందుకే అవతరించిన మహానుభావుడు కాబట్టి కురుక్షేత్రయుద్ధం జరిపించి ధర్మానికి పట్టాభిషేకం చేశాడు.  యుద్ధం ముగిసిన తరువాత  మదోన్మత్తులైన తన యాదవులను గమనించి వారి సంఖ్యను కూడా తగ్గించాలని భావించాడు.  

ఫలితంగా మునుల శాపం.  యాదవులలో ముసలం జన్మించింది. పరస్పరకలహాలతో యాదవులు నశించారు.  శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు.  ఆ పిమ్మటనే కలియుగం ప్రారంభం అయింది.  పాండవులు హస్తినాపురానికి తమ మనుమడైన పరీక్షిత్తును, ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణుని మనుమడైన యాదవవంశాంకురం అయిన వజ్రుడిని రాజులుగా అభిషేకించి తమ మహాప్రస్థానాన్ని ప్రారంభించారు.  

ఇంతటి ఘనచరిత్ర కలిగిన యాదవులు ఇప్పటికీ భారతదేశంలో తమదైన ప్రాముఖ్యతను చాటుకుంటూ చిరంజీవులై ఉన్నారు.  

1 comment:

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి?

ఠాట్...ఈ లేటెస్ట్ యుగంలో శ్రాద్ధాలు పిండాలు ఏమిటి? నేటి యువతరం, నిరుటి కమ్యూనిస్ట్ భావాలున్న పెద్దలు కూడా అడిగే ప్రశ్న ఇది. కొంచెం తార్కికం...